కాడి వీడుతున్న కర్షకుడు
ఏలూరు సెంట్రల్ :పొలాలనన్నీ హలాల దున్నీ.. ఇలా తలంలో హేమం పిండే రైతన్నలకు గడ్డు రోజులు దాపురించాయి. ఒకప్పుడు రాజనాలు పండించిన అన్నదాతలకు నేడు భోజనాలు కరువయ్యాయి. నేలతల్లిని నమ్ముకుని-నమ్మకాల నీడల్లో.. నాగేటి సాళల్లో నాటిన ఆశల విత్తులు వారి కుత్తుకలు కత్తిరించే విచ్చు కత్తులవుతున్నాయి.. ఫలితంగా ఇప్పటికే చాలా మంది కర్షకులు కాడి కిందేశారు. మిగిలిన వారి దింపుడు కళ్లెం ఆశలు కూడా ఆవిరయ్యే రోజులు ఆట్టే దూరం లేవు. ఇది ఎవరో చెప్పిన జోస్యం కాదు. ఆర్థిక సర్వే నిగ్గు తేల్చిన చేదు నిజం.ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం వ్యవసాయాన్ని వదిలేసి ఇతర రంగాల్లో ఉపాధి వెతుక్కుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతోంది. అయినా దేశంలో ఇప్పటికీ 54.60 శాతం మందికి వ్యవసాయమే ఉపాధి కల్పిస్తోందనేది సత్యం. డాక్టర్ తనయుడు డాక్టర్ అయినట్టు.. యాక్టర్ వారసుడు యాక్టర్ అయినట్టు.. రైతు పుత్రుడు భూమిపుత్రడు కావడం లేదు.
అన్నపూర్ణగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లాలో 2001 లెక్కల ప్రకారం 5లక్షల 45వేల 301 మంది రైతులున్నారు. ఏటా ఈ సంఖ్య తగ్గుతూ 2014 నాటికి సుమారు 15శాతం పడిపోయిందని రైతు సంఘం నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ సంఖ్య పెరిగినట్లు కనిపించినా వారు కౌలు రైతులు మాత్రమేనని, ఈ జిల్లాలో 2001 నుంచి ఇప్పటి వరకు సగం మంది భూ యజమానులు ఏనాడో కాడి వదిలేశారని అంచనా. ప్రస్తుతం సాగు కష్టమైన నేపధ్యంలో కౌలు రైతులు కూడా సేద్యానికి దూరమైతే ఉన్న పొలాలను తెగనమ్ముకోవడమే తప్ప యజమానులు సాగుకు సిద్ధంగా లేరన్నది వాస్తవం.
వ్యవసాయానికి కౌలురైతులే ఆయువుపట్టుగా మారారు. ఆహార పంటల సాగులో వీరిదే అగ్రస్థానం. సేద్యం కొనసాగిస్తున్న కొద్ది మంది భూ యజమానులు వాణిజ్య పంటల సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆహారధాన్యాల ఉత్పత్తిలో కీలక భాగస్వాములైన కౌలు రైతులను కాపాడుకోవాల్సిన కనీస ధర్మం పాలకులకుంది.2004లో జయంతీఘోష్, 2006లో కోనేరు రంగారావు కమిషన్లు కౌలు రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేసి రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీలు, ప్రకృతి నష్ట పరిహారాలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. లేకపోతే మొత్తం సేద్యమే మూలనపడుతుందని హెచ్చరించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయం దండగ కాదు.. పండగని నిరూపించే ప్రయత్నం చేశారు. అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో ఆయన హఠాన్మరణం సమస్యను మళ్లీ మొదటికి తెచ్చింది. తర్వాత వచ్చిన రోశయ్య కానీ, కిరణ్‌కుమార్‌రెడ్డి కానీ వ్యవసాయం ఊసే ఎత్తలేదు.
మద్దతు ధర ఏది!
మరోవైపు పంటలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే కనీస మద్ధతుధర కూడా కౌలు రైతులకు దక్కడం లేదు. వరి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,340లకు ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనాల్సి ఉండగా అదీ అమలు కావడం లేదు. గత్యంతరం లేక అయిన కాడికి కౌలురైతులు కమిషన్‌దార్లు, మిల్లర్లకు అమ్ముకుంటున్నారు.
సాగుకు కౌలు రైతులే దిక్కు
జిల్లాలోని డెల్టా ప్రాంతంలో 80శాతానికి పైగాను, మెట్ట ప్రాంతంలో 50శాతానికి పైగా భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. పెరిగిన కౌలు, సాగు ఖర్చులతో కౌలు రైతులకు సాగు భారంగా మారింది. 2003నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 23వేల రైతుమిత్ర గ్రూపులేర్పడితే 5వేల గ్రూపులకు మాత్రమే పంట రుణాలిచ్చారు.