ఏలూరు (టూ టౌన్) :వ్యవసాయ రుణాల మాఫీ కార్యక్రమం జిల్లాలో ప్రహసనంలా సాగుతోంది. ఎన్నికల ముందు రుణమాఫీ హామీ ఇచ్చి రైతులను ఆకర్షించిన చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టాక తప్పదన్నట్టుగా కొంతమొత్తాన్ని విది ల్చారు. అదికూడా రైతులకు పూర్తిగా అందలేదు. తరచూ నిబంధనల్ని మారు స్తూ.. ఎట్టకేలకు జిల్లాలోని సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల ద్వారా 4.55 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని తేల్చారు. వారికి రెండు విడతలుగా రూ.1,550 కోట్లను మాఫీ చేయాల్సి ఉండగా, రూ.488 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని బాండ్ల రూపంలో రైతులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంతవరకు అమలు కాలేదు. మరోవైపు ప్రభుత్వం డొంక తిరుగుడు వ్యవహారం చేయడంతో జిల్లాలో 30 శాతం మంది రైతులకు మాఫీ సొమ్ము వారి ఖాతాల్లో జమ కాలేదు.
రైతుల కష్టాలెన్నో..
రుణమాఫీకి అర్హత పొందని రైతులు పైసాకూడా దక్కక అల్లాడుతుంటే.. అర్హత సాధించిన రైతులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. కొంత పొలంపై సొసైటీలోను, మరికొంత పొలంపై వాణిజ్య బ్యాంకుల్లోను రుణాలు తీసుకున్న రైతులు మాఫీ కోసం అవస్థలకు గురవుతున్నారు. సొసైటీలో తీసుకున్న రుణానికి సంబంధించి పట్టాదార్ పాస్ పుస్తకాలపై స్టాంప్ వేయించుకు రావాలని వాణిజ్య బ్యాంకు అధికారులు, వాణిజ్య బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి ఆ బ్యాంక్ స్టాంప్ వేయించాలని సొసైటీలు కోరడంతో రైతులు అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారు. మరోవైపు నిమ్మ, అరటి వంటి దీర్ఘకాలిక పంటలు వేసిన ఉద్యాన రైతులు రుణమాఫీకి అనర్హులుగానే మిగిలిపోవాల్సి వచ్చింది. వారి గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ఇదిలావుండగా, మూడో విడతలోనూ రుణమాఫీకాని రైతులంతా తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిం చింది. దీంతో రైతులు ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 9,796 మంది రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రత్యేక కౌంటర్లలో రైతుల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులను మూటగట్టి మూలన పడేయటం తప్ప ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీరికి రుణమాఫీ అవుతుందా లేదా అన్నది సందేహంగానే ఉంది. రుణమాఫీ సక్రమంగా జరగకపోవడంతో బకాయిలు చెల్లించని రైతులపై అధిక వడ్డీల భారం పడుతోంది. మరోవైపు కొత్త రుణాలు అందక అల్లాడిపోతున్నారు. రుణమాఫీ పేరిట ప్రభుత్వం చేసిన మోసాన్ని తలుచుకుని ఆవేదన చెందుతున్నారు.
మాఫీ అంతంతే
Published Tue, May 26 2015 2:18 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement