నిండా ముంచారు
‘రుణమాఫీ పచ్చి బూటకం. అన్ని వివరాలు సమర్పించినా మాఫీ చేయడం లేదు. ఎందరో అధికారులకు వినతులు ఇచ్చాం. అయినా ఫలితమేమీ లేదు. అసలు లోన్ రద్దవుతుందో, లేదో తెలియక వేదన పడుతున్నామ’ని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేశారని, ఇప్పుడు మాత్రం నిబంధనల పేరిట ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పరిషత్ ప్రాంగణంలోని పంచాయతీ వనరుల కేంద్రంలో సోమవారం రుణమాఫీ పరిష్కార వేదికను ప్రారంభించారు. మాఫీ కాని రైతులు ఫిర్యాదులు ఇస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తారని వ్యవసాయ అధికారులు ప్రచారం చేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో రైతులు తరలివచ్చారు. మొదటి రోజు ఫిర్యాదుల స్వీకరణలో తీవ్ర జాప్యం జరిగింది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రసంగాలు, కౌంటర్ల పరిశీలన తదితర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఫిర్యాదులు స్వీకరించారు.
ఒక్కోసారి వంద మంది ప్రకారం రైతులకు టోకెన్లు ఇచ్చి లోపలికి పంపారు. మొదటి రోజు మూడు వేల మంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. అనేక మందికి లభించకపోవడంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి రైతులు పోటెత్తారంటే రుణమాఫీ సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. అనేక మందికి అన్ని అర్హతలున్నా ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. మరి కొంతమందికి రెండు, మూడు విడతల మాఫీ నిధులు జమ కాలేదు. ఇంకొందరికి మూడో విడత రాలేదు.
బ్యాంకర్లపైకి నెపం
రుణమాఫీలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నా.. తప్పిదాన్ని బ్యాంకులపైకి నెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. రైతు రుణం వివరాలు ఇప్పటి వరకు ఎన్ఐసీ పోర్టల్‌లో నమోదు కాలేదు. 2007 ఏప్రిల్ 1 నుంచి 2013 డిసెంబరు 31 మధ్య లోన్ ఉన్నట్లయితే అవుట్ స్టాండింగ్ (అప్పు నిల్వ) రిపోర్టుతో కూడిన 36 వివరాలను సంబంధిత బ్యాంకు ద్వారా రైతు సాధికార సంస్థకు మెయిల్ చేయించాలంటూ ఒక కాగితాన్ని రైతుల చేతుల్లో పెట్టి చేతులు దులిపేసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే లోపాన్ని బ్యాంకులపైకి నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బ్యాంకుకు వెళ్లండంటూ ఉచిత సలహా ఇవ్వడం తప్ప రైతుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం లేదు.
రెండు విడతల నిధులు జమ కాలేదు
పత్తికొండలోని బ్యాంకు నుంచి రూ.1.50 లక్షల పంట రుణం తీసుకున్నా. ఒక విడత మాత్రమే రూ.26,174 మాఫీ నిధులు జమయ్యాయి. 2, 3వ విడతల నిధులు రాలేదు.. దీనిపై ఫిర్యాదు చేసినా పరిష్కారం కనిపించలేదు. ‘పడతాయిపో’ అన్నారు తప్ప ఎప్పటికి పడతాయో అధికారులెవరూ చెప్పడం లేదు. – బాబాఫకృద్ధీన్, హోసూరు, పత్తికొండ మండలం
మూడో విడత నిధులు రాలేదు
రుణమాఫీ మూడో విడత నిధులు జమ కాలేదు. దీనిపై వినతి ఇచ్చేందుకు ఇప్పటికే గన్నవరం కూడా వెళ్లి వచ్చాం. ఈ పరిష్కార వేదికలోనూ అన్ని వివరాలు ఇచ్చాం. తూతూ మంత్రంగా పరిశీలించి, బ్యాంకుకు వెళ్లి కలవాలని చెప్పారు. – వెంకటరమణ, గోరుకల్లు, పాణ్యం మండలం