జగన్‌తోనే రైతులకు న్యాయం
ఏలూరు (వన్‌టౌన్) : ‘చంద్రబాబు కొద్ది నెలల పాలనలోనే రైతులను ఎన్నో రకాలుగా వంచించారు. మీకు చంద్రబాబుతో న్యాయం జరగదు. కేవలం ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి వల్లే రైతన్నలకు న్యాయం జరుగుతుంది. రైతుల కోసం మొన్న రాజన్న, నిన్న జగనన్న, నేడు నేను ఒకే మాటగా మీ కోసం చేస్తున్న ధర్మపోరాటంలో భాగస్తులు కండి. మీ ఆకలికేకలనే నినాదాలు చేసి హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం రండి’ అంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడు రూ.లక్షా 50 వేలుగా రుణమాఫీ హామీ దఫదఫాలుగా వడపోతలు చేపట్టి చివరకి ఎవరికీ ఉపయోగం లేని 50 వేల రుణం రైతులకు ఎరగా వేశారని విమర్శించారు. దీనివల్ల రైతులకు కనీసం వడ్డీకూడా కట్టలేని పరిస్థతి దాపురించిందన్నారు.
పదవి కోసం ప్రజలను మోసం చేయటం ఒక్కటే చంద్రబాబు నేర్చుకున్న రాజకీయపాఠంలా కనబడుతోందని దుయ్యబట్టారు. ‘దేశానికి వెన్నుముక మీరే.. మీ కోసం నేనిచ్చే వరం ‘రుణ మాఫీ’. గెలిపించిన వెంటనే నేను పెట్టబోయే తొలిసంతకం రుణమాఫీ పైనే అంటూ చంద్రబాబు హామీలిచ్చి ప్రస్తుతం వంద రోజుల పాలన పూర్తయినందుకు వేడుకలు చేసుకోవడం తప్ప రైతులకు ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేయకపోగా కొత్త రుణాలు మంజూరుకాక రైతులు నిరాశా నిస్పృహలతో కుప్పకూలిపోయారనేది నిజం కాదా అని ప్రశ్నించారు. రుణాలు కట్టలేక తాము మోసపోయామని గ్రహించి ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 85 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా ఇంకా కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబు తీరులో మాత్రం మార్పేలేదన్నారు.
హామీల సాధన కోసం, మోసపూరిత పాలనను ఎండగట్టేందుకు ప్రతి రైతు మహోద్యమంలా కదిలిరావాలన్నారు. రుణమాఫీపైనే ఆశలన్నీ పెట్టుకున్న జిల్లా రైతులు ఎంతగా మోసపోయారో ఇప్పటికే గ్రహించారన్నారు. ఇప్పటికైనా కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి హామీల అమలుకు చిత్తశుధ్దితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. అన్ని బ్యాంకులలో రైతులు తీసుకున్న పంటరుణాలు మాఫీచేస్తానన్న బాబు తన మాట నిలబెట్టుకునే వరకూ ఉద్యమించాలని కోరారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద శుక్రవారం రైతులతో నిర్వహించే ధర్నాకు రైతులంతా వచ్చి విజయవంతం చేయాలని కోరారు.