ప్రశ్నించడమే ప్రజాద్రోహమా! | Story analyzed on sez | Sakshi
Sakshi News home page

ప్రశ్నించడమే ప్రజాద్రోహమా!

Published Sun, Feb 22 2015 12:23 AM | Last Updated on Mon, Jul 23 2018 8:35 PM

ప్రశ్నించడమే ప్రజాద్రోహమా! - Sakshi

ప్రశ్నించడమే ప్రజాద్రోహమా!

జన్యుమార్పిడి పంటలు ఆహార భద్రతకు ఏవిధంగా సమాధానం కాలేవో ప్రారంభ సదస్సులో ఇచ్చిన ఉపన్యాసంలో నేను వివరించాను. ఆ పంటలను పండించడం వల్ల వాతావరణ ంలోను, మన ఆరోగ్యంలోను సంభవించే విపరిణామాలను గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాను. తరువాత జరిగిన ఒక గోష్టిలో జన్యుమార్పిడి పంటల అనుకూలుడైన ఒక వక్త ప్రసంగించారు. ఆయన నాకూ, అల్‌కాయిదాకు సంబంధం ఉన్నదనే వరకూ వెళ్లిపోయాడు. జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకించిన వారి మీద కూడా ‘అభివృద్ధి నిరోధకులు’ అంటూ ముద్ర వేస్తున్నారు.  
 
కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. నేను మంగ ళూరులో ఒక సభలో మాట్లాడవలసి వచ్చింది. దేశమంతా ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) మాయాజాలంలో కొట్టుకు పోతున్న కాలమది. ఆర్థిక మండళ్ల ఆర్థికస్తోమత ఏపాటిదో, ఇలాంటి విధానం ఎలాంటి ఫలితాలు ఇవ్వగలుగుతుందో సాంఘికంగా గానీ, ఆర్థికంగా గానీ ఆ అంశాల మూల్యాం కన ఏదీ జరగకుండానే సెజ్‌లను, ఆర్థికాభివృద్ధిని త్వరితం చేసే యంత్రాలూ, వ్యూహాలూ అన్నట్టు దేశం మీద రుద్దే యత్నం జరిగింది.
 
మంగళూరు సమావేశానికి రైతులూ, సామాజిక ఉద్యమకారులు, వివిధ రంగాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. ఆర్థిక మండళ్ల పేరిట జరుగుతున్న భూఆక్రమణలు, నిర్వాసితులవుతున్న ప్రజలు అనే అంశాలను గురించి వివరంగా చెప్పడానికి నేను ప్రయత్నించాను. నా ఉపన్యాసం ముగించి నేను సభా మందిరం నుంచి బయటకు వచ్చాక అక్కడ కొన్ని వాల్ పోస్టర్లు నాకు స్వాగతం పలికాయి. నన్ను ‘నక్సలైట్’ అంటూ, ‘జాతి విద్రోహి’ అంటూ సంబోధిస్తూ వెలసిన పోస్టర్లే అవన్నీ.
 
ఆర్థిక మండళ్ల ఏర్పాటు
ప్రత్యేక ఆర్థిక మండళ్ల మీద యూపీఏ ప్రధాని డాక్టర్ మన్మో హన్‌సింగ్ కూడా అపారమైన విశ్వాసాన్ని ప్రకటించిన సందర్భం ఒకటి కూడా నాకు బాగా గుర్తుంది. ఒక బిజినెస్ వార్తాపత్రిక నిర్వహించిన వార్షిక పురస్కారాల సభలో డాక్టర్ మన్మోహన్ పాల్గొన్నారు. తరువాత ప్రశ్న-జవాబు కార్యక్రమం మొదలైంది. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఒక ప్రశ్న వేశారు. వాణిజ్యానికి ప్రోత్సాహం ఇవ్వగలిగే కొద్దిపాటి వాతావరణం కూడా లేని మన దేశంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సంస్థలో చదివిన విద్యార్థి బయటకు వచ్చి ఏంచేస్తాడు? అన్నదే ఆ ప్రశ్న సారాంశం.
 
‘యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడానికి, ప్రోత్సాహకాలు కల్పించడానికే మేం ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేస్తున్నాం’ అన్నా రు ప్రధాని. అసలు ఆర్థిక మండళ్ల ఏర్పాటు యోచన కార్యరూపం ధరిస్తున్నదని ఆ సమావేశంలోనే ప్రధాని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు సెజ్‌ల ద్వారా ఒక కొత్త రూపు, ఒక వేగం తథ్యమని ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ కూడా ఎంతగానో విశ్వసించారు. సెజ్‌ల చట్టం 2005లో రూపుదిద్దుకుంది. దేశమంతటా ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. మరోవైపు సెజ్‌ల పేరుతో భూములు లాక్కుంటున్నారంటూ పేదలూ, రైతుల నుంచి వెల్లువెత్తిన నిరసనలను ఎవరూ ఖాతరు చేయలేదు. ఆర్థిక మండళ్లను వ్యతిరేకించడం ప్రగతి నిరోధ కులు చేసే పని అన్న రీతిలో అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ సర్కారు, అందులోని పెద్దలు ప్రచారం సాగిం చారు కూడా.
 
 బెడిసికొట్టిన వ్యూహం
 అయితే ఏడేళ్ల తరువాత ప్రత్యేక ఆర్థిక మండళ్ల వ్యవహారం దిగుమతి చేసుకున్న ఆలోచనగా బయటపడింది. ఇందుకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదిక జాడ లేకుండాపోయింది. 2007- 2013 సంవత్సరాల మధ్య జరిగిన ఆర్థిక మండళ్ల కుంభకోణం ఏ స్థాయిలో జరిగిందో, ఆ ఆలోచన ఎంత అవాస్తవికమో ఆ నివేదిక నమోదు చేసింది. సెజ్ పథకం అమలుకు సంబం ధించిన నివేదికను అధ్యయనం చేసిన తరువాతే కాగ్ ప్రభుత్వాన్ని తూర్పారపట్టింది.
 
 ఆ కాలంలో మొత్తం 576 సెజ్ పథకాలను ఖరారు చేశారు. అందులో 392 సెజ్‌ల గురించి ప్రకటనలు కూడా వెలువడ్డాయి. అయితే అందులో కార్యకలాపాలు సాగుతున్న ఆర్థిక మండళ్లు కేవలం 170. ఇందులో మళ్లీ 48 శాతం కంటే తక్కువగానే ఎగుమతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అవన్నీ కలసి 2013-2014 కాలంలో చేసిన ఎగుమతులు కేవలం 3.8 శాతం. దేశంలో పలుచోట్ల 45,635.63 హెక్టార్ల భూమిని సెజ్ పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయనున్నట్టు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందుకు సంబం ధించిన కార్యకలాపాలు ప్రారంభించిన భూమి 28,488.49 హెక్టార్లు.
 
 అంటే ఇది సేకరించిన భూమిలో 62 శాతం. దీనిని దృష్టిలో ఉంచుకునే కాగ్ చేసిన వ్యాఖ్యను గమనిం చాలి. ప్రజల నుంచి ప్రభుత్వం భూమిని సేకరించిందంటే గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి సంపదను కార్పొరేట్ ప్రపంచానికి దఖలు పరిచిందని రుజువవుతున్నదని కాగ్ తీవ్రంగానే వ్యాఖ్యానించింది. సెజ్ ఏర్పాటు పేరుతో భూములు తీసుకున్నవారిలో చాలా మంది ఇతర అవస రాలకు వాటిని ఉపయోగించుకున్నారు. సెజ్ భూములతో సంబంధం లేని బయటి వారికి అందులో ప్రవేశం దొరికింది. ఇంకా చిత్రం ఏమిటంటే, ఈ రీతిలో సాగిన సెజ్ చట్టం దుర్వినియోగాన్ని వాణిజ్య మంత్రిత్వశాఖ కళ్లప్పగించి చూసింది.
 
 కడిగిపారేసిన ‘కాగ్’
 ఇంకా దారుణంగా, ఈ సెజ్ భూములలో ఇళ్లు, పాఠశా లలు, ఆస్పత్రులు నిర్మించడానికి డెవలపర్లను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇది సెజ్ ఏర్పాట్ల పేరుతో చేసిన చట్టానికి పూర్తి విరుద్ధం. సెజ్ చట్టం ప్రకారం, పారిశ్రామిక అవసరాల కోసమే అక్కడ నిర్మించవలసిన కట్టడాలు ఏవీ ఆ భూములలో కనిపించడం లేదు. ఆర్థికాంశాలు రాసే ఒక పత్రిక అయితే ఈ పథకం ఎప్పుడో మూలపడిందని రాసింది. సెజ్ పేరుతో కేటాయించిన భూమిలో దాదాపు యాభై శాతం నిరుపయోగంగా ఉండిపోయింది.
 
 ఎగుమ తులలో గాని, ఉద్యోగాలు కల్పించడంలో గాని ఆర్థిక మండళ్ల భూముల ద్వారా ఎలాంటి ఫలితాలు అందలేదు. అందులో చాలా భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వర్గం లా మారిందన్న విమర్శ కూడా వచ్చింది. అయితే పన్నుల రూపంలో వచ్చే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవడానికి ఈ భూములు ఐటీ సంస్థలకు మాత్రం బాగా ఉపయోగ పడ్డాయి. చిత్రం ఏమిటంటే, 2007లో ఏర్పాటైన పార్ల మెంటరీ స్థాయీ సంఘం సెజ్‌ల వల్ల ఆదాయంలో వచ్చిన నష్టం వివరాలను కూడా తెలియచేసింది. అంటే ప్రధాని ప్రకటించిన రెండేళ్లకే సెజ్‌లు ఏ రూపం దాల్చాయో స్థాయీ సంఘమే బయటపెట్టింది. సెజ్‌లకు 2005- 2012 మధ్య ఇచ్చిన ట్యాక్స్ హాలిడే కారణంగా రూ.1.75 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని స్థాయీ సంఘం తేల్చింది.
 
 ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే ద్రోహం కాదు
 ఇలా ఉండగా, ఆర్థికాభివృద్ధి పేరుతో భూములను ఖాళీ చేయించిన లక్షలాది పేదలకు సానుభూతిగా ఒక్క సాంత్వన వచనం కూడా ఎవరి నోటి నుంచి వెలువడలేదు. గ్రీన్‌పీస్ సామాజిక కార్యకర్త ప్రియా పిళ్లై కేసు గురించి ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను వార్తాపత్రికలో చదువుతున్నపుడు నాకు ఆర్థిక మండళ్ల అనుభవం గుర్తుకు వచ్చింది. ప్రియా పిళ్లై విదేశాలకు వెళ్లడానికి అనుమతి నిరాకరణకు సంబం ధించి కోర్టులో ప్రాథమిక వాదోపవాదాలు జరిగాయి. అందుకు సంబంధించిన వార్త అది.
 
 ఈ కేసుకు న్యాయ చరిత్రలో ఎంతో ఖ్యాతి వచ్చింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నంత మాత్రాన జాతి వ్యతిరేకంగా భావించరాదని ప్రభుత్వ ప్రతి నిధులను కోర్టు ఆ కేసులో హెచ్చరించింది. అలాగే తరు వాత జరిగిన వాదోపవాదాలలో జాతీయ వాదానికీ, వీర జాతీయ వాదానికీ మధ్య తేడాను గుర్తించవలసిందని కూడా హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఈ సంద ర్భంలోనే ప్రస్తావించుకోవలసిన మరొక సంఘటన కూడా ఉంది. రెండు దశాబ్దాల క్రితం లండన్‌లో ఏర్పాటైన మొదటి ప్రపంచ ఆహార, వ్యవసాయ సదస్సుకు నన్ను ఆహ్వానించారు.
 
 వ్యవసాయోత్పత్తుల అంతర్జాతీయ వాణి జ్యవ్యవస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమమది. జన్యుమార్పిడి పంటలు ఆహార భద్రతకు ఏవిధంగా సమాధానం కాలేవో ప్రారంభ సదస్సులో ఇచ్చిన ఉపన్యాసంలో నేను వివరిం చాను. ఆ పంటలను పండించడం వల్ల వాతావరణంలోను, మన ఆరోగ్యంలోను సంభవించే విపరిణామాలను గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాను. తరువాత జరిగిన ఒక గోష్టిలో జన్యుమార్పిడి పంటల అనుకూలుడైన ఒక వక్త ప్రసంగిం చారు. ఆయన నాకూ, అల్‌కాయిదాకు సంబంధం ఉన్నదనే వరకూ వెళ్లిపోయాడు. జన్యుమార్పిడి పంటలను వ్యతిరే కించిన వారి మీద కూడా ‘అభివృద్ధి నిరోధకులు’ అంటూ ముద్ర వేస్తున్నారు. వాణిజ్య ప్రయోజనాలతో సహా అనేక ఇతర వాస్తవాలు, అంశాలు- చౌకగా, సులభంగా లభించే ప్రత్యామ్నాయాలను గురించి చెప్పేవారిని మూలకు నెట్టేటట్టు చేస్తున్నాయి. అలాంటి వారిపై అనేక ముద్రలు వేస్తున్నాయి.
 
 ప్రత్యామ్నాయ దృక్పథం తప్పుకాదు
 ఒక అంశాన్ని విమర్శించాలంటే చాలా పరిశోధన, విశ్లేషణ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆ తరువాత ఒక సందర్భంలో అన్నారు. దీనితో నేను కూడా ఏకీభవిస్తాను. వార్తాపత్రికలో వచ్చిన ఒక పతాకశీర్షికను మనం నమ్ము తాం. మనకంటూ ఒక అభిప్రాయం ఏర్పడడానికి అది చాలు కూడా. నిజానికి మనలో చాలా మంది పతాక శీర్షికను మించి వివరాలలోకి వెళ్లడానికి ప్రయత్నం చేయం.
 
 నేను చాలా టీవీ చానళ్ల చర్చలలో పాల్గొంటూ ఉంటాను. చిత్రంగా అక్కడ ఒకే ఆలోచనా విధానం ఉన్న వారి నుంచే నాకు ఎక్కువ ప్రతిఘటన ఎదురవుతూ ఉంటుంది. ప్రత్యా మ్నాయ దృక్పథం అణచివేతకు గురవుతోంది లేదా గుర్తిం పునకు నోచుకోవడం లేదు. ప్రశ్నించేవాడు, విమర్శించే వాడు కూడా జాతీయ వాదులే. వీరు కూడా ఈ భూగో ళాన్ని సజావుగా ఉంచడానికి కృషి చేస్తున్నవారే. నిలకడగా ఉండే ఆర్థికవృద్ధిని సాధించడం, అభివృద్ధి మహిళాభ్యు న్నతికి అనుకూలంగా, ప్రజానుకూలంగా, పర్యావర ణానుకూలంగా ఉండటం కోసం కట్టుబడి ఉన్నవారే. పర్యావరణానికి చేటు చేయని రీతిలో దోపిడీలేని, సహజ వనరులను సద్వినియోగం చేసుకునే చోట మాత్రమే అభి వృద్ధి సాధ్యమవుతుంది. అలాంటి వ్యవస్థ కోసమే మన మంతా ఎదురుచూడాలి. ఎవరు అవ్యవస్థకు వ్యతిరేకంగా గళం ఎత్తుతారో వారంతా జాతిలో చైతన్యాన్ని నిలిపి ఉంచ గలిగేవారే. అలాగే వీర జాతీయ వాదం ప్రకటించేవారు ఎంతమాత్రం జాతీయ వాదులు కారన్న సంగతి వాస్తవం. ఇలాంటివారు మనలను ఫాసిజం వైపు నడుపుతారు. అంతవరకే.
(వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు)
ఈమెయిల్: hunger55@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement