కొత్తపల్లిలో తడిసిన పసుపును నీళ్లలోంచి తీస్తున్న రైతులు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. బలమైన ఈదురు గాలులతో కూడిన వడగండ్ల దాటికి పంటలు దెబ్బ తిన్నాయి. వేలాది ఎకరాల్లో ఎర్రజొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందల సంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కల్లాల్లో ఉన్న పసుపు తడిసి ముద్దయింది. చేతికందే పంటలు వర్షార్పణం కావడంతో అన్నదాతలు కంట నీరు పెడుతున్నారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం హోరెత్తించింది. ముందుగా బలమైన ఈదురు గాలులతో ప్రారంభమై.. వడగండ్ల వాన కురిసింది. పెద్ద పెద్ద మంచుగడ్డలు పడటంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కొన్ని చోట్ల గింజలు రాలిపోవడంతో రైతులు కన్నీటి పర్వంతమవుతున్నారు.
4 వేలకుపైగా హెక్టార్లలో పంటనష్టం..
వడగండ్ల వానతో బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్ మండలాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లింది. మోపాల్ మండలంలో కూడా కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంట నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తం 6,600 మంది రైతులకు సంబంధించి 4,010 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు తేల్చారు. ఈ ఏడు మండలాల పరిధిలోని 69 గ్రామాల్లో ఈ అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. అత్యధికంగా 2,742 హెక్టార్లలో ఎర్రజొన్న పంట దెబ్బతిన్నట్లు తేలింది. 899 హెక్టార్లలో మొక్కజొన్న, వరి 299, నువ్వుపంట 69 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు.
తడిసిన పసుపు..
అకాల వర్షం పసుపు రైతులకు కన్నీటిని మిగిల్చింది. విక్రయించేందుకు సిద్ధంగా కల్లాల్లో ఆరబెట్టిన పసుపు తడిసి ముద్దయింది. దీంతో పసుపు రంగు మారి నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు గత నెల రోజులుగా పసుపును మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వర్షం కురియడంతో పంటను ఎలా విక్రయించుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
కాగా పోస్ట్ హార్వెసింగ్ (కోత అనంతరం) కావడంతో పంట నష్టం వివరాలను సేకరించలేక పోతున్నామని అధికారులు దాట వేస్తున్నారు. మరోవైపు ఉద్యాన పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.
సుమారు 148 మంది రైతులకు సంబంధించి 153 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. టమాట, ఇతర కూరగాయలు దెబ్బతిన్నాయి. మామిడి పూత రాలిపోవడంతో ఈసారి కాత తగ్గి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుందని రైతులు వాపోతున్నారు. కొత్తిమీర పంటకు కూడా నష్టం జరిగింది.
సుమారు 200లకు పైగా గొర్రెల మృతి..
వడగండ్ల వాన పశు సంపదకు కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా 182 గొర్రెలు మృతి చెందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ సుమారు రెండు వందలకు పైగా జీవాలు చనిపోయినట్లు అనధికారిక అంచనా. మృతి చెందిన గొర్రెల్లో 72 ప్రభుత్వం పంపిణీ చేసిన సబ్సిడీ గొర్రెలున్నట్లు అధికారులు గుర్తించారు. వీటికి బీమా పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మిగతా గొర్రెల పరిహారానికి సంబంధించి విపత్తు నియంత్రణ శాఖకు ప్రతిపాదనలు పంపుతామని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment