అకాల వర్షాలతో నీటమునిగిన వరిపంట
అకాల వర్షం.. అపార నష్టం
నేలపాలైన పంటలు.. అన్నదాతల కన్నీళ్లు
యార్డుల్లో తడిసిపోయిన ధాన్యం, మక్కలు, పసుపు, మిర్చి
ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాలు అతలాకుతలం
‘రంగారెడ్డి’ని హడలెత్తించిన పిడుగుల వాన
యాదాద్రి జిల్లాలో ధాన్యం తడవడంతో రైతు ఆత్మహత్య
సాక్షి నెట్‌వర్క్: అకాల వర్షం అపార నష్టం మిగిల్చింది. గాలివాన, వడగళ్లు, ఈదురుగాలుల ముప్పేట దాడితో కళ్లెదుటే కష్టార్జితం నేలపాలై రైతు గుండె చెరువైంది. పంటలు చేతికొచ్చే దశలో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు అన్నదాత పొట్టగొట్టాయి. పలుచోట్ల ఇప్పటికే పంటలు దెబ్బతినగా.. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు కురిసిన వానలతో ఉన్న కొద్దిపాటి పంటలు ఊడ్చిపెట్టుకుపోయాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, మక్కలు, పసుపు, మిర్చి తడిసిపోయాయి. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు 30 వరకు మూగజీవాలు చనిపోయాయి.
అటు చేలల్లో.. ఇటు యార్డుల్లో..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంట నష్టం ఎక్కువగా ఉంది. సూర్యాపేట మార్కెట్‌తోపాటు అర్వపల్లి, ఆత్మకూరు (ఎస్) మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యంతో పాటు 8 వేల ధాన్యపు బస్తాలు తడిసిపోయాయి. నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. తిప్పర్తిలో 20 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ధాన్యం తడిసిపోయిందంటూ రహదారిపై ధర్నా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 మండలాల్లోని 3,035 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. 700 ఎకరాల్లోని మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, వరి, పసుపు, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. నర్సంపేట డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో మార్కెట్లు, కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న నీటిపాలైంది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో కల్లాల్లో ఉడికించి ఆరబెట్టిన పసుపుతోపాటు కొన్నిచోట్ల మిర్చి తడిసిపోయింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను పిడుగుల వాన హడలెత్తించింది. 2 జిల్లాల్లో వందలాది ఎకరాల్లోని వరి, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. 10 రోజుల్లో కోతకు రానున్న మామిడి నేలపాలవడంతో రైతులు కంటతడి పెట్టుకున్నారు. తలకొండపల్లి మండలంలో దాదాపు 500 వందల ఎకరాల వరిపంట నీట మునిగింది. పిడుగుపాటుకు గురై పదుల సంఖ్యలో పశువులు మృత్యువాతపడ్డాయి. వికారాబాద్ జిల్లాలోని బొంరాస్‌పేట మండలంలో 200 ఎకరాల్లో వరి దెబ్బతింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బలమైన ఈదురుగాలులతో వరి, మొక్కజొన్న నేలవాలాయి. సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వాన ముంచెత్తింది. సిద్దిపేట జిల్లాలోని రాయపోలు, దౌల్తాబాద్, చిన్నకోడూరు మండలాల్లో ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలో రెండ్రోజులుగా కురిసిన వర్షానికి 1,850 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి, మొక్కజొన్న, మామిడి, జీడిమామిడి, అరటి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. భద్రాద్రి జిల్లాలో 45 ఎకరాల్లోని అరటి తోటలు దెబ్బతిన్నాయి. జీడిమామిడి తోటల్లో మొక్కలు సగానికి విరిగి పడిపోయాయి.
ధాన్యం తడవడంతో రైతు ఆత్మహత్య
అకాల వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) రైతు ఎలిమినేటి యాదిరెడ్డి (52) 13 ఎకరాల్లో వరి సాగు చేశారు. శుక్రవారం నుంచి కురుస్తున్న అకాల వర్షానికి వడ్లు నేల రాలడంతో మనస్తాపం చెందిన యాదిరెడ్డి.. ఆదివారం పొలంలోని గుడిసెలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నేడూ తీవ్రమైన ఈదురుగాలులు
ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భలో నెలకొన్న ఉపరితల ద్రోణి కారణంగా సోమవారం కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం కూడా కొద్దిమేర ఉపరితల ద్రోణి ప్రభావం కనిపించవచ్చని వివరించింది. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. ఉట్నూరు, వికారాబాద్‌లలో 6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. పాలకుర్తిలో 5, దోమకొండ, రామన్నపేట, జూలపల్లి, చేవెళ్లల్లో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. సూర్యాపేట, నల్లగొండ, హుజూరాబాద్, భువనగిరి, సంగారెడ్డి, సత్తుపల్లి, ఇల్లందు, కొందుర్గులలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అటు హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, బాచుపల్లి, నాంపల్లి, ఆస్మాన్‌ఘడ్ తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment