Unseasonal rain
-
ధోని చివరి మ్యాచ్ వాన గండం తప్పదా...!
-
ఉపరితల ద్రోణి ప్రభావంతో అకాలవర్షాలు
-
అకాల నష్టం..
జంగారెడ్డిగూడెం : రాకాసి గాలులు విరుచుకుపడ్డాయి. పంటలకు తీవ్రనష్టం కలిగించాయి. ఉరుము, మెరుపు లేకుండా రాత్రివేళలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం జిల్లాలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. చేతికందిన పంట నేలనంటడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంటను చూసి పోలవరం మండలంలో ఓ రైతు గుండె ఆగింది. మొక్కజొన్న, వరి, అరటి, నిమ్మ పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షంతో జంగారెడ్డిగూడెం వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్ శాఖల పరిధిలో పెద్దెత్తున నష్టం సంభవించింది. శనివారం రాత్రి వేళలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. సుమారు 12,500 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చేతికి వచ్చే దశలో పంటలు నేలపాలవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రధానంగా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోనే ఎక్కువ నష్టం సంభవించింది. మొక్కజొన్న రైతు విలవిల వ్యవసాయశాఖ పరిధిలోని మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కేఆర్ పురం వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలో సుమారు 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 1,500 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నట్టు వ్యవసాయ శాఖాధికారి చెన్నకేశవులు తెలిపారు. నష్టాలేనిమ్మ.. ఉద్యాన శాఖ పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. అరటి, నిమ్మ, మామిడి తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో సుమారు 300 ఎకరాల్లో అరటి పంట నేలకూలింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి తోటలన్నీ నేలరాలడంతో ఎందుకు పనికిరాకుండా పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 ఎకరాల్లోని నిమ్మతోటల్లో కాయలు నేలరాలాయి. ఈదురుగాలుల ధాటికి మామిడి పంటకు కూడా తీవ్రంగా నష్టం జరిగింది. సుమారు 500 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలాయి. ఉద్యాన శాఖకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని ఏడీ ఎ.దుర్గేష్ తెలిపారు. విద్యుత్ శాఖకు నష్టం విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం జరిగింది. భారీ ఈదురుగాలులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 20 విద్యుత్ స్తం భాలు దెబ్బతినగా వీటిలో 33 కేవీ విద్యుత్ స్తంభాలు 10, 11 కేవీ విద్యుత్ స్తంభాలు 11 దెబ్బతిన్నట్టు విద్యుత్ శాఖ డీఈ ఎ.రవికుమార్ తెలిపారు. మరో 10 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్నాయన్నారు. సుమారు రూ.10 లక్షల వరకు నష్టం జరిగినట్లు చె ప్పారు. వీటన్నింటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామన్నారు. పంటను చూసి ఆగిన గుండె పోలవరం: చేతికందిన పంట నేలనంటడంతో చూసి తట్టుకోలేక ఓ రైతు పొలం వద్దే కు ప్పకూలి మృతిచెందిన ఘటన పోలవరం మండలంలోని పాతపట్టిసీమ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పాతపట్టిసీమకు చెందిన పందిటి వెంకట్రాజు (65) గ్రామంలో తన సొంత పొలం ఎకరంతో పాటు కౌలుకు తీసుకుని మరో మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. పంట బాగా పండి చేతికందే దశకి వచ్చింది. శనివారం రాత్రి బలమైన ఈదురుగాలులు వేయడంతో పంట అంతా నేలకొరిగింది. ఆదివారం ఉదయం చేలోకి వెళ్లిన వెంకట్రాజు పంటను చూసి కుప్పకూలి మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. నాలుగు ఎకరాలకు సుమారు రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాడు. మూడు ఎకరాలను ఎకరాకు రూ.20 వేలు చొప్పున కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన వెంకట్రాజు పంట చేతికి వస్తే అప్పులు తీర్చవచ్చని భావించాడు. అతడికి దాదాపు రూ.5.50 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. దొండపూడి ఆంధ్రాబ్యాంకులో రూ.లక్ష, సహకార సంఘంలో రూ.1.50 లక్షలు, పొలం మీద రూ.1.50 లక్షలు, బంగారంపై రూ.50 వేలు, ప్రైవేట్ అప్పు రూ.లక్ష వరకు ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పట్టిసీమ వీఆర్వో కె.రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు మానసికంగా అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయిస్తున్నారు. -
కల్లాల్లో కల్లోలం
అకాల వర్షం.. అపార నష్టం నేలపాలైన పంటలు.. అన్నదాతల కన్నీళ్లు యార్డుల్లో తడిసిపోయిన ధాన్యం, మక్కలు, పసుపు, మిర్చి ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాలు అతలాకుతలం ‘రంగారెడ్డి’ని హడలెత్తించిన పిడుగుల వాన యాదాద్రి జిల్లాలో ధాన్యం తడవడంతో రైతు ఆత్మహత్య సాక్షి నెట్వర్క్: అకాల వర్షం అపార నష్టం మిగిల్చింది. గాలివాన, వడగళ్లు, ఈదురుగాలుల ముప్పేట దాడితో కళ్లెదుటే కష్టార్జితం నేలపాలై రైతు గుండె చెరువైంది. పంటలు చేతికొచ్చే దశలో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు అన్నదాత పొట్టగొట్టాయి. పలుచోట్ల ఇప్పటికే పంటలు దెబ్బతినగా.. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు కురిసిన వానలతో ఉన్న కొద్దిపాటి పంటలు ఊడ్చిపెట్టుకుపోయాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, మక్కలు, పసుపు, మిర్చి తడిసిపోయాయి. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు 30 వరకు మూగజీవాలు చనిపోయాయి. అటు చేలల్లో.. ఇటు యార్డుల్లో.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంట నష్టం ఎక్కువగా ఉంది. సూర్యాపేట మార్కెట్‌తోపాటు అర్వపల్లి, ఆత్మకూరు (ఎస్) మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యంతో పాటు 8 వేల ధాన్యపు బస్తాలు తడిసిపోయాయి. నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. తిప్పర్తిలో 20 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ధాన్యం తడిసిపోయిందంటూ రహదారిపై ధర్నా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 మండలాల్లోని 3,035 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. 700 ఎకరాల్లోని మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, వరి, పసుపు, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. నర్సంపేట డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో మార్కెట్లు, కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న నీటిపాలైంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో కల్లాల్లో ఉడికించి ఆరబెట్టిన పసుపుతోపాటు కొన్నిచోట్ల మిర్చి తడిసిపోయింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను పిడుగుల వాన హడలెత్తించింది. 2 జిల్లాల్లో వందలాది ఎకరాల్లోని వరి, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. 10 రోజుల్లో కోతకు రానున్న మామిడి నేలపాలవడంతో రైతులు కంటతడి పెట్టుకున్నారు. తలకొండపల్లి మండలంలో దాదాపు 500 వందల ఎకరాల వరిపంట నీట మునిగింది. పిడుగుపాటుకు గురై పదుల సంఖ్యలో పశువులు మృత్యువాతపడ్డాయి. వికారాబాద్ జిల్లాలోని బొంరాస్‌పేట మండలంలో 200 ఎకరాల్లో వరి దెబ్బతింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బలమైన ఈదురుగాలులతో వరి, మొక్కజొన్న నేలవాలాయి. సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వాన ముంచెత్తింది. సిద్దిపేట జిల్లాలోని రాయపోలు, దౌల్తాబాద్, చిన్నకోడూరు మండలాల్లో ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలో రెండ్రోజులుగా కురిసిన వర్షానికి 1,850 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి, మొక్కజొన్న, మామిడి, జీడిమామిడి, అరటి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. భద్రాద్రి జిల్లాలో 45 ఎకరాల్లోని అరటి తోటలు దెబ్బతిన్నాయి. జీడిమామిడి తోటల్లో మొక్కలు సగానికి విరిగి పడిపోయాయి. ధాన్యం తడవడంతో రైతు ఆత్మహత్య అకాల వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) రైతు ఎలిమినేటి యాదిరెడ్డి (52) 13 ఎకరాల్లో వరి సాగు చేశారు. శుక్రవారం నుంచి కురుస్తున్న అకాల వర్షానికి వడ్లు నేల రాలడంతో మనస్తాపం చెందిన యాదిరెడ్డి.. ఆదివారం పొలంలోని గుడిసెలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నేడూ తీవ్రమైన ఈదురుగాలులు ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భలో నెలకొన్న ఉపరితల ద్రోణి కారణంగా సోమవారం కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం కూడా కొద్దిమేర ఉపరితల ద్రోణి ప్రభావం కనిపించవచ్చని వివరించింది. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. ఉట్నూరు, వికారాబాద్‌లలో 6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. పాలకుర్తిలో 5, దోమకొండ, రామన్నపేట, జూలపల్లి, చేవెళ్లల్లో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. సూర్యాపేట, నల్లగొండ, హుజూరాబాద్, భువనగిరి, సంగారెడ్డి, సత్తుపల్లి, ఇల్లందు, కొందుర్గులలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అటు హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, బాచుపల్లి, నాంపల్లి, ఆస్మాన్‌ఘడ్ తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. -
దెబ్బతిన్న పంటల పరిశీలన
చిన్నశంకరంపేట(మెదక్) : మండలంలోని గవ్వలపల్లిలో వడగండ్ల వర్షంతో నష్టపోయిన వరి పంటలను జిల్లా వ్యవసాయ అధికారి పరుశరామ్ నాయక్ శనివారం పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. వడగండ్ల వర్షంతో నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట చిన్నశంకరంపేట ఏఈఓ శ్రీనివాస్ ఉన్నారు. -
రైతుల కష్టం ‘రాళ్ల’ పాలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. బలమైన ఈదురు గాలులతో కూడిన వడగండ్ల దాటికి పంటలు దెబ్బ తిన్నాయి. వేలాది ఎకరాల్లో ఎర్రజొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందల సంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కల్లాల్లో ఉన్న పసుపు తడిసి ముద్దయింది. చేతికందే పంటలు వర్షార్పణం కావడంతో అన్నదాతలు కంట నీరు పెడుతున్నారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం హోరెత్తించింది. ముందుగా బలమైన ఈదురు గాలులతో ప్రారంభమై.. వడగండ్ల వాన కురిసింది. పెద్ద పెద్ద మంచుగడ్డలు పడటంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కొన్ని చోట్ల గింజలు రాలిపోవడంతో రైతులు కన్నీటి పర్వంతమవుతున్నారు. 4 వేలకుపైగా హెక్టార్లలో పంటనష్టం.. వడగండ్ల వానతో బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్ మండలాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లింది. మోపాల్ మండలంలో కూడా కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంట నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తం 6,600 మంది రైతులకు సంబంధించి 4,010 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు తేల్చారు. ఈ ఏడు మండలాల పరిధిలోని 69 గ్రామాల్లో ఈ అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. అత్యధికంగా 2,742 హెక్టార్లలో ఎర్రజొన్న పంట దెబ్బతిన్నట్లు తేలింది. 899 హెక్టార్లలో మొక్కజొన్న, వరి 299, నువ్వుపంట 69 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. తడిసిన పసుపు.. అకాల వర్షం పసుపు రైతులకు కన్నీటిని మిగిల్చింది. విక్రయించేందుకు సిద్ధంగా కల్లాల్లో ఆరబెట్టిన పసుపు తడిసి ముద్దయింది. దీంతో పసుపు రంగు మారి నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు గత నెల రోజులుగా పసుపును మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వర్షం కురియడంతో పంటను ఎలా విక్రయించుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కాగా పోస్ట్ హార్వెసింగ్ (కోత అనంతరం) కావడంతో పంట నష్టం వివరాలను సేకరించలేక పోతున్నామని అధికారులు దాట వేస్తున్నారు. మరోవైపు ఉద్యాన పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 148 మంది రైతులకు సంబంధించి 153 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. టమాట, ఇతర కూరగాయలు దెబ్బతిన్నాయి. మామిడి పూత రాలిపోవడంతో ఈసారి కాత తగ్గి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుందని రైతులు వాపోతున్నారు. కొత్తిమీర పంటకు కూడా నష్టం జరిగింది. సుమారు 200లకు పైగా గొర్రెల మృతి.. వడగండ్ల వాన పశు సంపదకు కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా 182 గొర్రెలు మృతి చెందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ సుమారు రెండు వందలకు పైగా జీవాలు చనిపోయినట్లు అనధికారిక అంచనా. మృతి చెందిన గొర్రెల్లో 72 ప్రభుత్వం పంపిణీ చేసిన సబ్సిడీ గొర్రెలున్నట్లు అధికారులు గుర్తించారు. వీటికి బీమా పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మిగతా గొర్రెల పరిహారానికి సంబంధించి విపత్తు నియంత్రణ శాఖకు ప్రతిపాదనలు పంపుతామని పేర్కొంటున్నారు. -
కన్నీరే మిగిలింది
అకాల వర్షం.. అనుకోని రీతిలో గాలులు కలిపి రైతుల ఆశలు ధ్వంసం చేశాయి. ఆరుగాలం కష్టపడి మరో పది రోజుల్లో పంట అందుకుందా మని ఆశ పడిన రైతును నిలువునా ముంచేశాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పడిన వర్షానికి, వీచిన ఈదురుగాలులకు మొక్కజొన్న, అరటి పంటలు నేలకొరిగాయి. మామిడి, జీడి తోటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. కూరగాయల తోటలు చాలా చోట్ల పాడైపోయాయి. అప్పులు చేసి మరీ పంటకు మదుపులు పెట్టామని, ప్రకృతి వైపరీత్యానికి ఇలా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రణస్థలం: అకాల వర్షాలు, ఈదురుగాలులకు వాణిజ్య పంటలు నాశనమైపోయాయి. రణస్థలం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, అరటిని ఎక్కువగా సాగు చేస్తారు. శుక్రవారం వీచిన ఈదురుగాలులకు మొక్కజొన్న, అరటి, మిరప వంటి వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని సీతంవలస, రావాడ, రణస్థలం, కోష్ట, బంటుపల్లి, లంకపేట, వెంకట్రావుపేట, పాతర్లపల్లి వంటి గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. మిరప విరిగిపోగా, జీడి, మామిడి రాలిపోయాయి. ఈ అకాల వర్షాలకు సుమారు ఎకరాకు రూ.40వేలు వర కు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో రూణమాఫీ చేయకపోడంతో పంట వేసిన తరువాత అప్పులు చేసి మదుపులు పెడుతున్నామని చివరకు తీర్చేందుకు కూడా ఫలసాయం రావడం లేదని తెలిపారు. సర్వే చేస్తున్నాం: అకాల వర్షాల వల్ల సుమారు 350 హెక్టార్లలో మొక్కజొన్న నేలకొరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నాం. రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. --- సీహెచ్ కార్తీక సుధ, వ్యవసాయాధికారి, రణస్థలం పూర్తిగా నష్టపోయా: మొక్కజొన్న 2 ఎకరాలు, మిరప 50 సెంట్లలో వేశాను. ఈ పెను గాలులకు పంటలు పూర్తిగా పాడైపోయి నష్టపోయాను. --- కోల దుర్గారావు, రైతు ప్రభుత్వమే ఆదుకోవాలి: మొక్కజొన్న 2.50 ఎకరాలు, మిరప 75 సెంట్ల వరకు సాగు చేస్తున్నాను. ఈదురుగాలుల కు మిరప పిందె కూడా చేతికి రాకుండా మొత్తం పోయింది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. --- మాత రామారావు, రైతు రైతన్న కంట నీరు పొందూరు : మండలంలో శుక్రవారం కురిసిన అ కాల వడగళ్ల వర్షానికి పంటలు నాశనమయ్యాయి. ఉద్యానవన, కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో రైతన్నలు కన్నీ టి పర్యంతమవుతున్నారు. మండలంలోని బాణాం, తానెం, దళ్లిపేట, రెడ్డిపేట, కంచరాం, లోలుగు, తం డ్యాం, మీసాలపేట, బొట్లపేట, మన్నెపేట గ్రామాల్లో ఉద్యానవన పంటలు, మొక్కజొన్న తదితర పంటలు నాశనమయ్యాయి. బాణాం, దళ్లిపేట, లోలుగు, తండ్యాం పంచాయతీల్లో మొక్కజొన్న సుమారు 750 ఎకరాల్లో నాశనమైంది. సుమారుగా మిరప– 300 ఎకరాలు, అరటి– 50 ఎకరాలు, వంగ–20 ఎకరాల్లోను నాశనమైంది. బొట్లపేటకు చెందిన రైతులు నాగేశ్వరరావు, ఉప్పలపాటి ధనుంజయలక్ష్మి, మన్నె హైమావతి, బొట్ల సూర్యనారాయణ, సీతారాం, వాండ్రంగి గ్రామానికి చెందిన మేక సుందరనారాయణమ్మ తదితరులకు చెందిన మిరప పంట ధ్వంసమైంది. బాణాంలో మునకాల సత్యం, కొల్లి సత్యనారాయణ తదితరులకు చెందిన బొప్పాయి పంటలు నేలకొరిగాయి. సుమారు 5 ఎకరాల్లో అరటి తోట పువ్వు, కాయ దశలో ఉండగా వడగళ్ల వానకు నేలకొరిగింది. దీంతో పాటు మిరప, బొప్పాయి, వంగ తది తర పంటలు వందల ఎకరాల్లో నాశనమయ్యాయి. రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తున్నారు. వారి కష్టం, అప్పు మాత్రమే మిగిలింది. --- పెద్దింటి వెంకటరవిబాబు, సర్పంచ్, బాణాం చేతికొచ్చిన బొప్పాయి పంట చేజారిపోయింది. వడగళ్ల వానకు కాయలు పక్వానికి రాకుండానే రాలపోయాయి. అమ్మితే కొనేవారు కూడా ఉండరు. రాత్రి, పగలు కష్టపడి పంటను పండించాను. ఒక్క రూపాయి కూడా రాలేదు. అప్పులే మిగిలాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. --- మునకాల సత్యం, బొప్పాయి రైతు, బాణాం. తండ్యాం, మీసాల పేట, బొట్లపేట గ్రామాల్లో వేసిన సుమారు 2 ఎకరాల్లో వం గపంట నాశనమైంది. రాత్రి, పగలు కష్టపడి పంటను పండించాం. పిందెæ దశలో ఉండగా పంట మొత్తం నేలకొరిగింది. --- మీసాల రమణబాబు, మీసాల పేట, రైతు నేలమట్టమైన పంటలు లావేరు : మండలంలో శుక్రవారం రాత్రి వడగళ్ల వానతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో మండలంలోని మొక్కజొన్న, బొప్పాయి పంటలు నేలమట్టమయ్యాయి. అలాగే మామిడి కాయలు, పిందెలు రాలిపోయాయి. మండలంలోని కేశవరాయుని పురం, లావేటిపాలేం, లావేరు, సీతంవలస, రామునిపాలేం, తాళ్లవలస, గుమడాం, గోవిందపురం, ఇజ్జాడపాలేం, లింగాలవలస, పోతయ్యవలస, లుకలాపుపేట, కొత్తకోట, అదపాక, బెజ్జిపురం, రావివలస, గుమడాం, బుడతవలస, వేణుగోపాలపురం, నాగంపాలేం గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో మొక్కజొన్న పంట ఈదురుగాలులకు బలైపోయింది. అలాగే మండలంలోని పిడుగుపాలేం, లావేటిపాలేం, అప్పాపురం, వెంకటాపురం గ్రామాలతో పా టు మరికొన్ని గ్రామాల్లో బొప్పాయి చెట్లు విరిగిపోయాయి. వీటితో పాటు మామిడి కాయలు కూ డా చాలా వరకు రాలిపోయాయి. నాలుగు రోజుల కిందట పడిన అకాల వర్షానికి కొం త మొక్కజొన్న పంట నేలమట్టం అవ్వగా శుక్రవారం వీచిన గాలులకు మొత్తం ఒరిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అ«ధికారులు, పాలకులు పంట నష్టాన్ని పరిశీలించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. జి.సిగడాంలో..: మండలంలో శనివారం కురిసిన వర్షానికి, వీచిన భారీ గాలులకు రైతు నిలువునా మునిగిపోయాడు. వాండ్రంగి గ్రామంలో చింత సింహాచలం అనే వ్యక్తికి సం బంధించి రూ.1.80 లక్షల విలువ చేసే నూర్పు యంత్రంపై భారీ చెట్టుపడి యంత్రం నాశనమైపోయింది. అదే గ్రామానికి చెందిన మన్నె లక్ష్మిదొరకు చెందిన ఆవు పిడుగుపాటుకు మృతి చెందింది. గ్రామంలో మొక్కజొన్న, మిరప, జీడి, మామిడి తోటలు 25 ఎకరాల వరకు నాశనమయ్యాయని సర్పంచ్ బీవీ రమణ తెలిపారు. ఉల్లివలస, వెంకయ్యపేట, బాతువ గ్రామాల్లో అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు స్పందించి తక్షణమే నష్టాన్ని పూర్తి స్థాయిలో సర్వే జరిపి బాధితులను అదుకోవాలని కోరుతున్నారు. కొంప ముంచిన వర్షం: రాజాం రూరల్ : అకాల వర్షం కారణంగా మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. రాజాంతో పాటు రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో అకాల వర్షంతో పాటు ఈదురుగాలుల కారణంగా కోత దశలో ఉన్న మొక్కజొన్న పంటలు పొగిరి, పొనుగుటివలస, శ్యాంపురం తదితర ప్రాంతాల్లో పంట పూర్తిగా పాడైపోయింది. ఈ ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల్లో పంట నేలకొరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. రాజాం తో పాటు పరిసర మండలాల్లో పూత దశలో ఉన్న మామిడి పిందెలు నేలకొరిగాయి. దీంతో ఈ పంటలను కౌలుకు తీసుకు న్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలు చోట్ల పంటపొలాల మీదుగా నీరు ప్రవహించింది. కూలిపోయిన షెడ్లు, పొందూరు: మండలంలోని శుక్రవారం కురి సిన వడగళ్ల వానకు పలు రేకుల షెడ్లు విరి గిపోయాయి. బొట్లపేట, తండ్యాం మెట్ట, ఎ రుకల పేటల్లో రేకుల షెడ్లు ఎగిరిపోయి చె ల్లాచెదురైపోయాయి. బొట్లపేటలో రైతు ఉ ప్పిలి బుల్లిరాజుకు చెందిన ఆవుల షెడ్, వ్యవసాయ పనిముట్లు పెట్టుకొనే షెడ్‌పై రేకులు పూర్తిగా విరిగిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. తండ్యాం మెట్టకు సమీపంలో ఉన్న మడ్డువలస కాలువ రెండో దశ పనులుకు సంబందించి క్యాంపు ఆఫీసుపై రేకులు విరి గిపోయాయి. ఎరుకలపేట సమీపంలోని హో టల్ పైకప్పు పూర్తిగా కూలిపోయింది. -
తెలంగాణలో అకాల వర్షాలు...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆకస్మిక వర్షంతో పాటు పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో కురిసిన వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వర్షాల కారణంగా మామిడి, వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా వర్షాల కారణంగా కంది పంటను అమ్ముకోవడానికి అదిలాబాద్ మార్కెట్‌కు వచ్చిన రైతులకు వరుణుడు తీరని నష్టాన్ని మిగిల్చాడు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కందులు తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రైతన్న వెన్ను విరిచిన గాలివాన