జంగారెడ్డిగూడెం : రాకాసి గాలులు విరుచుకుపడ్డాయి. పంటలకు తీవ్రనష్టం కలిగించాయి. ఉరుము, మెరుపు లేకుండా రాత్రివేళలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం జిల్లాలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. చేతికందిన పంట నేలనంటడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంటను చూసి పోలవరం మండలంలో ఓ రైతు గుండె ఆగింది. మొక్కజొన్న, వరి, అరటి, నిమ్మ పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షంతో జంగారెడ్డిగూడెం వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్ శాఖల పరిధిలో పెద్దెత్తున నష్టం సంభవించింది. శనివారం రాత్రి వేళలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. సుమారు 12,500 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చేతికి వచ్చే దశలో పంటలు నేలపాలవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రధానంగా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోనే ఎక్కువ నష్టం సంభవించింది.
మొక్కజొన్న రైతు విలవిల
వ్యవసాయశాఖ పరిధిలోని మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కేఆర్ పురం వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలో సుమారు 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 1,500 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నట్టు వ్యవసాయ శాఖాధికారి చెన్నకేశవులు తెలిపారు.
నష్టాలేనిమ్మ..
ఉద్యాన శాఖ పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. అరటి, నిమ్మ, మామిడి తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో సుమారు 300 ఎకరాల్లో అరటి పంట నేలకూలింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి తోటలన్నీ నేలరాలడంతో ఎందుకు పనికిరాకుండా పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 ఎకరాల్లోని నిమ్మతోటల్లో కాయలు నేలరాలాయి. ఈదురుగాలుల ధాటికి మామిడి పంటకు కూడా తీవ్రంగా నష్టం జరిగింది. సుమారు 500 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలాయి. ఉద్యాన శాఖకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని ఏడీ ఎ.దుర్గేష్ తెలిపారు.
విద్యుత్ శాఖకు నష్టం
విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం జరిగింది. భారీ ఈదురుగాలులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 20 విద్యుత్ స్తం భాలు దెబ్బతినగా వీటిలో 33 కేవీ విద్యుత్ స్తంభాలు 10, 11 కేవీ విద్యుత్ స్తంభాలు 11 దెబ్బతిన్నట్టు విద్యుత్ శాఖ డీఈ ఎ.రవికుమార్ తెలిపారు. మరో 10 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతిన్నాయన్నారు. సుమారు రూ.10 లక్షల వరకు నష్టం జరిగినట్లు చె ప్పారు. వీటన్నింటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామన్నారు.
పంటను చూసి ఆగిన గుండె
పోలవరం: చేతికందిన పంట నేలనంటడంతో చూసి తట్టుకోలేక ఓ రైతు పొలం వద్దే కు ప్పకూలి మృతిచెందిన ఘటన పోలవరం మండలంలోని పాతపట్టిసీమ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పాతపట్టిసీమకు చెందిన పందిటి వెంకట్రాజు (65) గ్రామంలో తన సొంత పొలం ఎకరంతో పాటు కౌలుకు తీసుకుని మరో మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. పంట బాగా పండి చేతికందే దశకి వచ్చింది. శనివారం రాత్రి బలమైన ఈదురుగాలులు వేయడంతో పంట అంతా నేలకొరిగింది. ఆదివారం ఉదయం చేలోకి వెళ్లిన వెంకట్రాజు పంటను చూసి కుప్పకూలి మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. నాలుగు ఎకరాలకు సుమారు రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాడు. మూడు ఎకరాలను ఎకరాకు రూ.20 వేలు చొప్పున కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన వెంకట్రాజు పంట చేతికి వస్తే అప్పులు తీర్చవచ్చని భావించాడు. అతడికి దాదాపు రూ.5.50 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. దొండపూడి ఆంధ్రాబ్యాంకులో రూ.లక్ష, సహకార సంఘంలో రూ.1.50 లక్షలు, పొలం మీద రూ.1.50 లక్షలు, బంగారంపై రూ.50 వేలు, ప్రైవేట్ అప్పు రూ.లక్ష వరకు ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పట్టిసీమ వీఆర్వో కె.రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు మానసికంగా అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment