రుణమాఫీ కాని రైతుల సమస్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ కాలేదని అనేక మంది రైతులు ఆవేదన చెందుతున్నారని, దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ‘ఎక్స్’వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారని, ఏడు నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు రైతుల్ని వేధిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామని, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు పంట రుణాన్ని రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నామని, తక్షణమే పరిష్కరించాలని హరీశ్‌రావు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment