estimations
-
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు! ఆందోళన కలిగిస్తున్న అంచనాలు
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు ఏంటి అనుకుంటున్నారా? దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నుంచి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరుగుతున్నాయి. ఇవి ఇప్పట్లో తగ్గే అవకాశాల్లేవని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.మానవాళి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఈ తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతలు వ్యవసాయోత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేయగలవని, దీంతో అధిక ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతిని ద్రవ్యోల్బణం 30-50 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని సంకేతాలిస్తున్నారు. సాధారణ రుతుపవనాలు వచ్చే జూన్ వరకు ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.హీట్‌వేవ్ ప్రభావం పాడైపోయే ఆహార వస్తువులు, ముఖ్యంగా కూరగాయలపై ఎక్కువగా ఉంటుందని, ఇది ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎకనామిస్ట్ అయిన రాధికా రావు ది ఎకనామిక్ టైమ్స్‌తో అన్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం 30-50 బేసిస్ పాయింట్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న హీట్‌వేవ్ గ్రామీణ వ్యవసాయ ఆదాయం, ఆహార ద్రవ్యోల్బణం, సాధారణ ఆరోగ్య పరిస్థితులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కేర్ఎడ్జ్ ముఖ్య ఆర్థికవేత్త రజనీ సిన్హా వివరించారు.గడిచిన మార్చిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 10 నెలల కనిష్ట స్థాయికి 4.9 శాతానికి తగ్గింది. కానీ ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా 8.5 శాతం వద్ద ఉంది. ప్రధానంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఇది 28 శాతం పెరిగింది. కూరగాయల ద్రవ్యోల్బణం వరుసగా ఐదు నెలలుగా రెండంకెల స్థాయిలోనే ఉంది. ఈ త్రైమాసికంలో సగటున 28 శాతం ఉండవచ్చని, అదనంగా, పండ్ల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విపరీతమైన వాతావరణ పరిస్థితులలో సరుకు రవాణా సవాళ్లు అస్థిరతను పెంచుతాయని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపం చౌధురి అభిప్రాయపడ్డారు. -
Election Commission of India: ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వనరులపై కేంద్ర ఎన్నికల సంఘం అంచనాలు వేస్తోంది. ఒకే విడతలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపాల్సి వస్తే కొత్త ఈవీఎంల కొనుగోలుకు ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కలు కట్టింది. ఒక్కో ఈవీఎం జీవిత కాలం 15 ఏళ్లు కాగా, ఒక్కో మెషీన్‌ను మూడు సార్లు వాడుకోవచ్చని తెలిపింది. ఏకకాలంలో జరిపే ఎన్నికలకు దేశవ్యాప్తంగా 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పోలింగ్ బూత్‌లో జత ఈవీఎంలు.. ఒకటి లోక్‌సభకు, మరోటి శాసనసభ నియోజకవర్గానికి అవసరమవుతాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ యూనిట్(బీయూ)లు 46,75,100, కంట్రోల్ యూనిట్(సీయూ)లు 33,62,300, వీవీప్యాట్లు 36,62,600 అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలిపింది. కనీసం ఒక బీయూ, ఒక సీయూ, ఒక వీవీప్యాట్లను కలిపి ఒక ఈవీఎంగా పరిగణిస్తారు. ఒక బీయూ ఖరీదు రూ.7,900, ఒక సీయూ ఖరీదు రూ.9,800, ఒక వీవీప్యాట్ ఖరీదు రూ.16,000గా తాజాగా నిర్ణయించింది. అదనంగా పోలింగ్, భద్రతా సిబ్బంది, ఈవీఎంల నిర్వహణ కేంద్రాలు, మరిన్ని వాహనాలు అవసరమవుతాయని కూడా ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్తగా ఈవీఎల తయారీ, ఇతర సౌకర్యాలను సమకూర్చుకున్నాక 2029లో మాత్రమే మొదటి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
పటిష్ట రికవరీ బాటలో భారత్ ఎకానమీ
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్లను తట్టుకుని పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందని అత్యున్నత స్థాయి అధికార వర్గాలు విశ్లేషించాయి. ఇందుకు సంబంధించి మొత్తం 22 ప్రధాన, కీలక ఇండికేటర్లలో 19 ‘కరోనా ముందస్తు స్థాయితో పోల్చిచూసినా’ అప్‌ట్రెండ్‌లో ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఆ వర్గాలు వెల్లడించిన అంశాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే.. - 2021 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో 19 కీలక, ప్రధాన ఇండికేటర్లు 2019 ఇదే నెలలకన్నా వృద్ధి బాటన పయనిస్తున్నాయి. - వీటిలో కొన్ని రంగాలు ఏకంగా 100 శాతం పైగా వృద్ధిని (2019 ఇదే నెలలతో పోల్చితే) నమోదుచేసుకుంటున్నాయి. ఈ–వే బిల్లు, ఎగుమతులు, బొగ్గు ఉత్పత్తి, రైలు సరుకు రవాణా వంటి విభాగాలు 100 శాతానికి మించి రికవరీని నమోదుచేసుకున్నాయి. ఇది కేవలం రికవరీని మాత్రమే కాకుండా, ఆర్థిక వృద్ధిని సూచిస్తోంది. పలు రంగాల్లో ఉత్పత్తులు కూడా కరోనా ముందుస్థాయికి మించి కూడా పురోగమిస్తున్నాయి. పలు విభాగాలను పరిశీలిస్తే... వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్‌లో రూ.1,31,526 కోట్లుగా నమోదయ్యాయి. 2020 నవంబర్ నెలతో (1.05 లక్షల కోట్లు) పోల్చితే తాజా సమీక్షా నెల వసూళ్లలో 25 శాతం వృద్ధి రేటు మోదయ్యింది. ఇక 2019 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 27 శాతం ఎగశాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే, , ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే ఎగుమతులు విలువ 50.71 శాతం పెరిగి 174.15 బిలియన్ డాలర్ల నుంచి 262.46 బిలియన్ డాలర్లకు ఎగసింది. కరోనా ముందస్తు సమయం 2019 ఏప్రిల్–నవంబర్‌తో పోల్చినా ఎగుమతులు 24 శాతం పెరిగడం గమనార్హం. అప్పట్లో ఈ విలువ 211.17 బిలియన్ డాలర్లు. ఇక ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) నవంబర్‌లో పది నెలల గరిష్ట స్థాయిలో 57.6కు ఎగసింది. ద్రవ్యలోటు పూర్తి కట్టడిలో (అక్టోబర్ నాటికి బడ్జెట్ లక్ష్యంలో కేవలం 36.3 శాతం) ఉంది. అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ టోల్ వసూళ్లు (ఈటీసీ) రూ.108.2 కోట్లు. 2019 ఇదే కాలంలో పోల్చితే ఈ వసూళ్లు 157 శాతం అధికం. యూపీఐ పరిమాణం కూడా ఇదే సమయంలో నాలుగు రెట్లు పెరిగి 421.9 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌లో బొగ్గు ఉత్పత్తి 131 శాతం పెరిగి 114.1 మిలియన్ టన్నులకు ఎగసింది. రైలు రవాణా ట్రాఫిక్ 125 శాతం ఎగసింది. ఎరువుల అమ్మకం, విద్యుత్ వినియోగం, ట్రాక్టర్ అమ్మకాలు, సిమెంట్ ఉత్పత్తి, పోర్ట్ కార్గో ట్రాఫిక్, ఇంధన వినియోగం, ఎయిర్ కార్గో... ఇలా పలు రంగాలు కోవిడ్–19 ముందస్తు స్థాయికన్నా ఎగువ బాటన పురోగమిస్తున్నాయి. అయితే అక్టోబర్ గణాంకాలను పరిశీలిస్తే, స్టీల్ వినియోగం 2019 స్థాయితో పోల్చితే 99 శాతం వరకే చేరింది. ఆటో అమ్మకాల విషయంలో ఇది 86 శాతంగా ఉంది. ఎయిర్ ట్రాఫిక్ విషయంలో ఈ స్థాయి 66 శాతం. చదవండి: 2022 మార్చి 31 నాటికి దేశ అప్పు ఎంతంటే..! -
అకాల నష్టం..
జంగారెడ్డిగూడెం : రాకాసి గాలులు విరుచుకుపడ్డాయి. పంటలకు తీవ్రనష్టం కలిగించాయి. ఉరుము, మెరుపు లేకుండా రాత్రివేళలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం జిల్లాలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. చేతికందిన పంట నేలనంటడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంటను చూసి పోలవరం మండలంలో ఓ రైతు గుండె ఆగింది. మొక్కజొన్న, వరి, అరటి, నిమ్మ పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షంతో జంగారెడ్డిగూడెం వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్ శాఖల పరిధిలో పెద్దెత్తున నష్టం సంభవించింది. శనివారం రాత్రి వేళలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. సుమారు 12,500 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చేతికి వచ్చే దశలో పంటలు నేలపాలవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రధానంగా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోనే ఎక్కువ నష్టం సంభవించింది. మొక్కజొన్న రైతు విలవిల వ్యవసాయశాఖ పరిధిలోని మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కేఆర్ పురం వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలో సుమారు 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 1,500 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నట్టు వ్యవసాయ శాఖాధికారి చెన్నకేశవులు తెలిపారు. నష్టాలేనిమ్మ.. ఉద్యాన శాఖ పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. అరటి, నిమ్మ, మామిడి తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో సుమారు 300 ఎకరాల్లో అరటి పంట నేలకూలింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి తోటలన్నీ నేలరాలడంతో ఎందుకు పనికిరాకుండా పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 ఎకరాల్లోని నిమ్మతోటల్లో కాయలు నేలరాలాయి. ఈదురుగాలుల ధాటికి మామిడి పంటకు కూడా తీవ్రంగా నష్టం జరిగింది. సుమారు 500 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలాయి. ఉద్యాన శాఖకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని ఏడీ ఎ.దుర్గేష్ తెలిపారు. విద్యుత్ శాఖకు నష్టం విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం జరిగింది. భారీ ఈదురుగాలులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 20 విద్యుత్ స్తం భాలు దెబ్బతినగా వీటిలో 33 కేవీ విద్యుత్ స్తంభాలు 10, 11 కేవీ విద్యుత్ స్తంభాలు 11 దెబ్బతిన్నట్టు విద్యుత్ శాఖ డీఈ ఎ.రవికుమార్ తెలిపారు. మరో 10 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్నాయన్నారు. సుమారు రూ.10 లక్షల వరకు నష్టం జరిగినట్లు చె ప్పారు. వీటన్నింటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామన్నారు. పంటను చూసి ఆగిన గుండె పోలవరం: చేతికందిన పంట నేలనంటడంతో చూసి తట్టుకోలేక ఓ రైతు పొలం వద్దే కు ప్పకూలి మృతిచెందిన ఘటన పోలవరం మండలంలోని పాతపట్టిసీమ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పాతపట్టిసీమకు చెందిన పందిటి వెంకట్రాజు (65) గ్రామంలో తన సొంత పొలం ఎకరంతో పాటు కౌలుకు తీసుకుని మరో మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. పంట బాగా పండి చేతికందే దశకి వచ్చింది. శనివారం రాత్రి బలమైన ఈదురుగాలులు వేయడంతో పంట అంతా నేలకొరిగింది. ఆదివారం ఉదయం చేలోకి వెళ్లిన వెంకట్రాజు పంటను చూసి కుప్పకూలి మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. నాలుగు ఎకరాలకు సుమారు రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాడు. మూడు ఎకరాలను ఎకరాకు రూ.20 వేలు చొప్పున కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన వెంకట్రాజు పంట చేతికి వస్తే అప్పులు తీర్చవచ్చని భావించాడు. అతడికి దాదాపు రూ.5.50 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. దొండపూడి ఆంధ్రాబ్యాంకులో రూ.లక్ష, సహకార సంఘంలో రూ.1.50 లక్షలు, పొలం మీద రూ.1.50 లక్షలు, బంగారంపై రూ.50 వేలు, ప్రైవేట్ అప్పు రూ.లక్ష వరకు ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పట్టిసీమ వీఆర్వో కె.రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు మానసికంగా అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయిస్తున్నారు. -
అంచనాలను బీట్ చేసిన టైటన్
ముంబై: టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ బుధవారం భారీగా దూసుకుపోతోంది. కంపెనీ ఈ ఏడాది డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు ఎనలిస్టుల అంచనాలను బీట్ చేయడంతో ఒక దశలో 10 శాతానిపైగా ఎగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ఆకట్టుకోవడంతో ఈ కౌంటర్లో మదుపర్లు కొనుగోళ్ల జోరందుకుంది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో నికర లాభం 13 శాతం పెరిగి రూ. 255.75 కోట్లను అధిగమించింది. మొత్తం అమ్మకాలు 14 శాతం పెరిగి రూ. 3926 కోట్లను తాకాయి. టైటాన్ ఈబీఐటీడీఏ లేదా ఆపరేటింగ్ లాభం గత ఏడాది ఇదే కాలంలో రూ. 309 కోట్ల పోలిస్తే 21 శాతం ఎగసింది. ఈ ఏడాది రూ. 373 కోట్లగా నమోదుచేసింది. ఇబిటా మార్జిన్లు 9 శాతం నుంచి 9.5 శాతానికి బలపడ్డాయి. అమ్మకాలలో జ్యువెలరీ విభాగం నుంచి 15 శాతం అధికంగా రూ. 3255 కోట్లు లభించగా.. వాచీల బిజినెస్ ఆదాయం 5 శాతం పెరిగి రూ. 508 కోట్లను తాకింది. జ్యువెలరీ ఇబిటా 15 శాతం ఎగసి రూ. 334 కోట్లయ్యింది. వాచీల ఇబిటా మరింత అధికంగా 63 శాతం జంప్‌చేసి రూ. 53 కోట్లను తాకింది. మంచి ఫెస్టివల్ సీజన్, పెళ్లిళ్ల సీజన్ ,టైటాన్ రిటైల్ అమ్మకాల వృద్ధికి దోహదపడిందని, లాభాలకు తోడ్పడిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. డిమానిటైజేషన్ తరువాత చాలా బంగారం షాపులు మూతపడడంతో తమకు డిమాండ్ ఏర్పడిందని టైటాన్ కంపెనీ సీఎఫ్‌వో ఎస్ సుబ్రమణ్యం చెప్పారు. దీపావళివ కి గోల్డ్ కాయిన్ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయన్నారు. మొత్తంగా ఈ క్వార్టర్ వృద్ధి ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొన్నారు.