న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్లను తట్టుకుని పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందని అత్యున్నత స్థాయి అధికార వర్గాలు విశ్లేషించాయి. ఇందుకు సంబంధించి మొత్తం 22 ప్రధాన, కీలక ఇండికేటర్లలో 19 ‘కరోనా ముందస్తు స్థాయితో పోల్చిచూసినా’ అప్‌ట్రెండ్‌లో ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
ఆ వర్గాలు వెల్లడించిన అంశాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే..
- 2021 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో 19 కీలక, ప్రధాన ఇండికేటర్లు 2019 ఇదే నెలలకన్నా వృద్ధి బాటన పయనిస్తున్నాయి.
- వీటిలో కొన్ని రంగాలు ఏకంగా 100 శాతం పైగా వృద్ధిని (2019 ఇదే నెలలతో పోల్చితే) నమోదుచేసుకుంటున్నాయి. ఈ–వే బిల్లు, ఎగుమతులు, బొగ్గు ఉత్పత్తి, రైలు సరుకు రవాణా వంటి విభాగాలు 100 శాతానికి మించి రికవరీని నమోదుచేసుకున్నాయి. ఇది కేవలం రికవరీని మాత్రమే కాకుండా, ఆర్థిక వృద్ధిని సూచిస్తోంది. పలు రంగాల్లో ఉత్పత్తులు కూడా కరోనా ముందుస్థాయికి మించి కూడా పురోగమిస్తున్నాయి.
పలు విభాగాలను పరిశీలిస్తే...
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు నవంబర్‌లో రూ.1,31,526 కోట్లుగా నమోదయ్యాయి. 2020 నవంబర్ నెలతో (1.05 లక్షల కోట్లు) పోల్చితే తాజా సమీక్షా నెల వసూళ్లలో 25 శాతం వృద్ధి రేటు మోదయ్యింది. ఇక 2019 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 27 శాతం ఎగశాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే, , ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే ఎగుమతులు విలువ 50.71 శాతం పెరిగి 174.15 బిలియన్ డాలర్ల నుంచి 262.46 బిలియన్ డాలర్లకు ఎగసింది. కరోనా ముందస్తు సమయం 2019 ఏప్రిల్–నవంబర్‌తో పోల్చినా ఎగుమతులు 24 శాతం పెరిగడం గమనార్హం. అప్పట్లో ఈ విలువ 211.17 బిలియన్ డాలర్లు. ఇక ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) నవంబర్‌లో పది నెలల గరిష్ట స్థాయిలో 57.6కు ఎగసింది. ద్రవ్యలోటు పూర్తి కట్టడిలో (అక్టోబర్ నాటికి బడ్జెట్ లక్ష్యంలో కేవలం 36.3 శాతం) ఉంది. అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ టోల్ వసూళ్లు (ఈటీసీ) రూ.108.2 కోట్లు. 2019 ఇదే కాలంలో పోల్చితే ఈ వసూళ్లు 157 శాతం అధికం. యూపీఐ పరిమాణం కూడా ఇదే సమయంలో నాలుగు రెట్లు పెరిగి 421.9 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌లో బొగ్గు ఉత్పత్తి 131 శాతం పెరిగి 114.1 మిలియన్ టన్నులకు ఎగసింది. రైలు రవాణా ట్రాఫిక్ 125 శాతం ఎగసింది. ఎరువుల అమ్మకం, విద్యుత్ వినియోగం, ట్రాక్టర్ అమ్మకాలు, సిమెంట్ ఉత్పత్తి, పోర్ట్ కార్గో ట్రాఫిక్, ఇంధన వినియోగం, ఎయిర్ కార్గో... ఇలా పలు రంగాలు కోవిడ్–19 ముందస్తు స్థాయికన్నా ఎగువ బాటన పురోగమిస్తున్నాయి. అయితే అక్టోబర్ గణాంకాలను పరిశీలిస్తే, స్టీల్ వినియోగం 2019 స్థాయితో పోల్చితే 99 శాతం వరకే చేరింది. ఆటో అమ్మకాల విషయంలో ఇది 86 శాతంగా ఉంది. ఎయిర్ ట్రాఫిక్ విషయంలో ఈ స్థాయి 66 శాతం.
పటిష్ట రికవరీ బాటలో భారత్ ఎకానమీ
Published Tue, Dec 7 2021 9:00 AM | Last Updated on Tue, Dec 7 2021 9:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment