ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు ఏంటి అనుకుంటున్నారా? దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నుంచి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరుగుతున్నాయి. ఇవి ఇప్పట్లో తగ్గే అవకాశాల్లేవని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
మానవాళి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఈ తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతలు వ్యవసాయోత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేయగలవని, దీంతో అధిక ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతిని ద్రవ్యోల్బణం 30-50 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని సంకేతాలిస్తున్నారు. సాధారణ రుతుపవనాలు వచ్చే జూన్ వరకు ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
హీట్‌వేవ్ ప్రభావం పాడైపోయే ఆహార వస్తువులు, ముఖ్యంగా కూరగాయలపై ఎక్కువగా ఉంటుందని, ఇది ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎకనామిస్ట్ అయిన రాధికా రావు ది ఎకనామిక్ టైమ్స్‌తో అన్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం 30-50 బేసిస్ పాయింట్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న హీట్‌వేవ్ గ్రామీణ వ్యవసాయ ఆదాయం, ఆహార ద్రవ్యోల్బణం, సాధారణ ఆరోగ్య పరిస్థితులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కేర్‌ఎడ్జ్ ముఖ్య ఆర్థికవేత్త రజనీ సిన్హా వివరించారు.
గడిచిన మార్చిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 10 నెలల కనిష్ట స్థాయికి 4.9 శాతానికి తగ్గింది. కానీ ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా 8.5 శాతం వద్ద ఉంది. ప్రధానంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఇది 28 శాతం పెరిగింది. కూరగాయల ద్రవ్యోల్బణం వరుసగా ఐదు నెలలుగా రెండంకెల స్థాయిలోనే ఉంది. ఈ త్రైమాసికంలో సగటున 28 శాతం ఉండవచ్చని, అదనంగా, పండ్ల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విపరీతమైన వాతావరణ పరిస్థితులలో సరుకు రవాణా సవాళ్లు అస్థిరతను పెంచుతాయని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపం చౌధురి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment