గిట్టుబాటు కాలే.. | Farmers Not Getting Supporting Price on Crops | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు కాలే..

Published Sun, Jul 7 2019 10:29 AM | Last Updated on Sun, Jul 7 2019 10:29 AM

Farmers Not Getting Supporting Price on Crops - Sakshi

 బాదేపల్లి మార్కెట్‌ యార్డుకు విక్రయానికి వచ్చిన మొక్కజొన్న

సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్‌) : పంటలకు కేంద్రం పెంచిన మద్దతు ధరలపై రైతులు పెదవి విరుస్తున్నారు. అరకొరగా పెంచి చేతులు దులుపుకొందని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో రైతాంగానికి కొంత ఊరట లభించినా ఆయా మద్దతు ధరలు రైతులకు ఎంతమాత్రం దక్కుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలోనూ ప్రకటించిన మద్దతు ధరలు రైతుల దరికి చేరకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. నాణ్యత పేరుతో వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధరలకు గండి కొడుతున్నారని వాపోతున్నారు. కేంద్రం నాణ్యత విషయంలో నిబంధనలను కొంత మేరకు సడలింపు చేసినట్లయితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాగు ఖర్చులు కూడా పెరిగాయని, వీటితో పోలిస్తే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు ఎంత మాత్రం గిట్టుబాటుగా లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా విత్తనాలు, డీజిల్, ఎరువులు, పురుగు మందుల ధరలు గణనీయంగా పెరిగాయని వీటితోపాటు కూలీల ఖర్చు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని రైతులు పేర్కొంటున్నారు.

ఏ పంటకు ఎంత.. 
కేంద్రం 2019–20 సంవత్సర కాలానికి సంబంధించి పలు పంట ఉత్పత్తులకు మద్దతు ధరలను పెంచింది. అయితే 2018–19 ఏడాదిలో పెంచిన ధరలతో పోలిస్తే ప్రస్తుతం పెరిగిన ధరలు స్వల్పంగానే ఉన్నాయి. గతేడాది వరికి ఏకంగా క్వింటాకు రూ.200 పెంచగా.. ఈసారి నామమాత్రంగా రూ.65 పెంచింది. ఈ పెంపుతో ప్రస్తుతం క్వింటా ఏ గ్రేడు ధాన్యానికి రూ.1,770 నుంచి రూ.1,835కు మద్దతు ధర చేరింది. కాగా వరికి కనీసంగా క్వింటా ధరను రూ.2 వేలకు వరకు పెంచినా బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. అలాగే పత్తికి గతేడాది క్వింటాకు రూ.1,130 పెంచగా ఈసారి కేవలం రూ.105 మాత్రమే పెంచింది. దీంతో పత్తి మద్దతు ధర క్వింటాకు గరిష్టంగా రూ.5,550కు చేరింది. ఇక జిల్లాలో ప్రధానంగా సాగు చేసే మొక్కజొన్న పంటకు సంబంధించి క్వింటాకు  రూ.60  పెంచింది.  దీంతో  మొక్కజొన్న గరిష్ట ధర రూ.1,760కు చేరింది. మరో ప్రధాన పంట వేరుశనగకు రూ.200 పెంచింది. దీంతో వేరుశనగ గరిష్ట ధర రూ.5,090కి చేరింది. 

నాణ్యతను సడలిస్తే.. 
కాగా పంట ఉత్పత్తుల నాణ్యత నిబంధనలను కొంత మేరకు సడలిస్తే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న ఉత్పత్తులకు సంబంధించి తేమ శాతం గుర్తింపులో సడలింపు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో పంట దిగుబడులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్దతు ధరలు లభించేలా సంబంధిత మార్కెటింగ్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  వ్యయ ప్రయాసాలకోర్చి పండించిన పంట దిగుబడులను మార్కెట్‌కు  తీసుకువస్తే  మద్దతు  ధర  దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ దిక్కు వివిధ కారణాలతో పంట  దిగుబడులు  తగ్తుండగా.. మద్దతు ధర కూడా దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరలను రైతులకు అందించేలా కృషి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

రైతుకు మేలు జరగాలి 
రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వ మద్దతు ధరలు ఉండాలి. ప్రతి ఏటా సాగు వ్యయం పెరుగుతూ వస్తుంది. అందుకు తగ్గట్టుగానే మద్దతు ధరల పెరుగుదల ఉండాలి. సాగు వ్యయం, మద్దతు ధర మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. పత్తి ధర రూ.6 వేలు, వరి ధాన్యం ధర రూ.2 వేలకు పెంచితే కొంత నయంగా ఉండేది. 
– వెంకట్‌రెడ్డి, రైతు సంఘం నాయకుడు, మున్ననూర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement