పీఎం కిసాన్ రైతులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. పీఎం-కిసాన్ పథకం కింద 42 లక్షల మందికి పైగా అనర్హులైన రైతులకు బదిలీ చేసిన సుమారు రూ.3,000 కోట్లను కేంద్రం రికవరీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. పీఎం కిసాన్ పథకం కింద, కేంద్రం ప్రతి ఏడాది రూ.6,000ను దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాలలో బదిలీ చేస్తుంది. అయితే ఈ పథకానికి రైతులు అర్హత సాధించాలంటే కొన్ని అర్హతా ప్రమాణాలు ఉన్నాయి. పీఎం కిసాన్ పథకం కింద డబ్బు పొందిన 42.16 లక్షల మంది అనర్హులైన రైతుల నుంచి రూ.2,992 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో అంగీకరించారు.
పీఎం కిసాన్ నుంచి అక్రమంగా నగదు పొందిన రైతుల గరిష్ట సంఖ్య అస్సాంలో 8.35 లక్షలుగా ఉంది, తమిళనాడులో - 7.22 లక్షలు, పంజాబ్ - 5.62 లక్షలు, మహారాష్ట్రలో - 4.45 లక్షలు, ఉత్తరప్రదేశ్ లో - 2.65 లక్షలు, గుజరాత్ లో - 2.36 లక్షలు. స్వాధీనం చేసుకోవలసిన డబ్బు అస్సాంలో రూ.554 కోట్లు, పంజాబ్ లో రూ.437 కోట్లు, మహారాష్ట్రలో రూ.358 కోట్లు, తమిళనాడులో రూ.340 కోట్లు, యుపీలో రూ.258 కోట్లు, గుజరాత్ లో రూ.220 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. "ఆధార్, పీఎఫ్ఎంఎస్ లేదా ఆదాయపు పన్ను డేటాబేస్ ఆధారంగా అధికారులు లబ్ధిదారుల డేటాను నిరంతరం చెక్ చేస్తారు. అయితే, వెరిఫికేషన్ ప్రక్రియ సమయంలో ఈ పథకం ప్రయోజనం కొంతమంది ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతులతో సహా కొంతమంది అనర్హులైన లబ్ధిదారులకు నగదు బదిలీ చేసినట్లు కనుగొన్నట్లు" తోమర్ పార్లమెంటుకు తెలిపారు.
పీఎం కిసాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడటానికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుందని "నిజమైన రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి" ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చాలా రాష్ట్రాలు అనర్హులైన రైతుల నుంచి డబ్బులను రికవరీ చేయడానికి నోటీసులు పంపాయి. పీఎం-కిసాన్ లబ్ధిదారుల భౌతిక ధృవీకరణ కోసం ప్రామాణిక కార్యాచరణ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసినట్లు తోమర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment