support price
-
అధికారంలోకి రాగానే కుల గణన
భోపాల్: రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభిస్తామని కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పస్తామని అన్నారు. తమ ప్రభుత్వంలో ఈ రెండు అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలోని బంద్నవర్ పట్టణంలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం తరహాలో కులగణన కూడా ఒక భారీ విప్లవాత్మకమైన ముందడుగు అవుతుందని పేర్కొన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు కచి్చతంగా ఎవరెంత మంది ఉన్నారో కులగణన ద్వారా తెలుస్తుందని, దీని ఆధారంగా ఆయా వర్గాల కోసం సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేయవచ్చని తెలిపారు. ప్రజలకు సామాజిక, ఆర్థిక న్యాయం చేకూర్చడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రైతన్నలకు సైతం న్యాయం చేస్తామన్నారు. -
గిట్టుబాటు కాలే..
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్) : పంటలకు కేంద్రం పెంచిన మద్దతు ధరలపై రైతులు పెదవి విరుస్తున్నారు. అరకొరగా పెంచి చేతులు దులుపుకొందని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో రైతాంగానికి కొంత ఊరట లభించినా ఆయా మద్దతు ధరలు రైతులకు ఎంతమాత్రం దక్కుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలోనూ ప్రకటించిన మద్దతు ధరలు రైతుల దరికి చేరకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. నాణ్యత పేరుతో వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధరలకు గండి కొడుతున్నారని వాపోతున్నారు. కేంద్రం నాణ్యత విషయంలో నిబంధనలను కొంత మేరకు సడలింపు చేసినట్లయితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాగు ఖర్చులు కూడా పెరిగాయని, వీటితో పోలిస్తే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు ఎంత మాత్రం గిట్టుబాటుగా లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా విత్తనాలు, డీజిల్, ఎరువులు, పురుగు మందుల ధరలు గణనీయంగా పెరిగాయని వీటితోపాటు కూలీల ఖర్చు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఏ పంటకు ఎంత.. కేంద్రం 2019–20 సంవత్సర కాలానికి సంబంధించి పలు పంట ఉత్పత్తులకు మద్దతు ధరలను పెంచింది. అయితే 2018–19 ఏడాదిలో పెంచిన ధరలతో పోలిస్తే ప్రస్తుతం పెరిగిన ధరలు స్వల్పంగానే ఉన్నాయి. గతేడాది వరికి ఏకంగా క్వింటాకు రూ.200 పెంచగా.. ఈసారి నామమాత్రంగా రూ.65 పెంచింది. ఈ పెంపుతో ప్రస్తుతం క్వింటా ఏ గ్రేడు ధాన్యానికి రూ.1,770 నుంచి రూ.1,835కు మద్దతు ధర చేరింది. కాగా వరికి కనీసంగా క్వింటా ధరను రూ.2 వేలకు వరకు పెంచినా బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. అలాగే పత్తికి గతేడాది క్వింటాకు రూ.1,130 పెంచగా ఈసారి కేవలం రూ.105 మాత్రమే పెంచింది. దీంతో పత్తి మద్దతు ధర క్వింటాకు గరిష్టంగా రూ.5,550కు చేరింది. ఇక జిల్లాలో ప్రధానంగా సాగు చేసే మొక్కజొన్న పంటకు సంబంధించి క్వింటాకు రూ.60 పెంచింది. దీంతో మొక్కజొన్న గరిష్ట ధర రూ.1,760కు చేరింది. మరో ప్రధాన పంట వేరుశనగకు రూ.200 పెంచింది. దీంతో వేరుశనగ గరిష్ట ధర రూ.5,090కి చేరింది. నాణ్యతను సడలిస్తే.. కాగా పంట ఉత్పత్తుల నాణ్యత నిబంధనలను కొంత మేరకు సడలిస్తే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న ఉత్పత్తులకు సంబంధించి తేమ శాతం గుర్తింపులో సడలింపు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పంట దిగుబడులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్దతు ధరలు లభించేలా సంబంధిత మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్యయ ప్రయాసాలకోర్చి పండించిన పంట దిగుబడులను మార్కెట్‌కు తీసుకువస్తే మద్దతు ధర దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ దిక్కు వివిధ కారణాలతో పంట దిగుబడులు తగ్తుండగా.. మద్దతు ధర కూడా దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరలను రైతులకు అందించేలా కృషి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుకు మేలు జరగాలి రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వ మద్దతు ధరలు ఉండాలి. ప్రతి ఏటా సాగు వ్యయం పెరుగుతూ వస్తుంది. అందుకు తగ్గట్టుగానే మద్దతు ధరల పెరుగుదల ఉండాలి. సాగు వ్యయం, మద్దతు ధర మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. పత్తి ధర రూ.6 వేలు, వరి ధాన్యం ధర రూ.2 వేలకు పెంచితే కొంత నయంగా ఉండేది. – వెంకట్‌రెడ్డి, రైతు సంఘం నాయకుడు, మున్ననూర్ -
చెరుకు రైతుపై చిరుకన్ను!
చెరుకు సాగును టీడీపీ సర్కారు చిన్నచూపు చూస్తోంది. రైతన్నకు పంట సాగుపై ఆసక్తి ఉన్నా సర్కార్ మాత్రం సహకరించడం లేదు. సరైన మద్దతు ధర లేకపోవడం, ప్రోత్సాహం ఉండకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా సాగు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. రాజాం/రేగిడి: జిల్లాలో చెరుకు సాగు ఏటా పెరుగుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం మిగిలిన పంటలు కలిసి రాకపోవడమే. దీంతో ఎక్కువ మంది రైతులు చెరుకు సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పంటను సాగుచేస్తే ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కవచ్చునని భావిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 18,300 ఎకరాల్లో చెరకు పంటను సాగు చేశారు. అయితే సరైన మద్దతు ధరలేక అవస్థలు పడుతున్నారు. ఒకటే ఫ్యాక్టరీ చెరుకు సాగు విస్తీర్ణం పెరుగుతున్నా చక్కెర పరిశ్రమ మా త్రం జిల్లాలో ఒకటే ఉంది. రేగిడి మండలంలోని సంకిలి ఫ్యారిస్ ప్రైవేటు చక్కెర కర్మాగారం ఒక్కటి మాత్రమే గత్యంతరంగా మారింది. ఆమదాలవలసలోని చక్కెర కర్మాగారం 2003లో మూత బడింది. దీంతో జిల్లాలో కొద్ది సంవత్సరాలుగా చెరకు సాగు తగ్గిపోయింది. తరువాత సంకిలి ఫ్యాక్టరీ ఏర్పాటు కావడంతో రైతులు మళ్లీ సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే ప్రభుత్వ మద్దతు ధర కల్పించడం లేదు. చెరుకు పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కరువైంది. ఫలితంగా రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రస్తుతం ఫ్యారిస్ చక్కెర కర్మాగారం పరిధిలోని పలు మండలాల్లో ఈ ఏడాది 18 వేల ఎకరాల్లోనే చెరుకు పంటను సాగు చేస్తున్నారు. పరిశ్రమవారి నిబంధల మేరకు చెరుకు సాగు చేసే వారికి ఎకరాకు రు.7 వేల రాయితీని, సాధారణ సాగుకు రూ. 5 వేల రాయితీని యాజమాన్యం ప్రకటించింది. క్షేత్రస్థాయిలో కర్మాగార సిబ్బంది దీన్ని విస్తారంగా ప్రచారం చేసినప్పటికీ రైతుల నుంచి అనుకున్నంత స్పందన రాలేదు శ్రమకు తగ్గ ఫలితం శూన్యం.. చెరుకు సాగు రైతుకు ఆదాయపరంగా పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. మద్దతు ధర ప్రతి ఏటా టన్నుకు రు.50 నుంచి వంద రూపాయల లోపే పెరుగుతుండగా, సాగు ఖర్చులు మాత్రం భారీగా ఉంటున్నాయి. చెరుకు టన్ను ధర ప్రస్తుతం 2750 మాత్రమే ఉంది. దీంతో ఇది ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు, రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నారు. టన్నుకు రు.4000 చెల్లిస్తే గిట్టుబాటు అవుతోందంటున్నారు. అయితే సర్కార్ మాత్రం రైతుల డిమాండ్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతేడాది పెంచిన మద్దతుధరే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఎకరా చెరుకు పంట సాగు చేయాలంటే దుక్కి, విత్తనం, గొప్పు, కలుపు తీత, చెరుకు నరకడం, రవాణా ఇతర యాజమాన్య ఖర్చులు కలిపి సుమారు రు.50 వేలు వరకు ఖర్చు అవుతుంది. ఎకరాకు సరాసరిన 25 టన్నులు మాత్రమే దిగుబడి వస్తోంది. ఈ లెక్కన చూస్తే రు.67,500 రైతుకు కర్మాగారం చెల్లిస్తోంది. ఖర్చులు పోను రైతుకు మిగిలేది రు.17,500 మాత్రమే. ఈ లెక్కన చూస్తే ఏడాది పొడుగునా చెరుకు పంట పొలంలో ఉండటంతో అపరాలు పంటను కూడా వేసుకోలేకపోవడంతో రైతు నష్టపోతున్నారు. పెరగని దిగుబడులు జిల్లాలో చెరుకు పంట దిగుబడులు చూసుకొంటే సగటున ఎకరాకు 30 టన్నులు మించడం లేదు. సాంకేతిక యాంత్రీకరణ పద్ధతులను రైతులకు అందించడంలో సైతం వ్యవసాయాదికారులు వెనకబడి ఉన్నారు. ప్రస్తుతం చెరుకు పంట దిగుబడిని పెంచేందుకు ఫ్యారిస్ చక్కెర కర్మాగారం యాజమాన్యం కృషి చేస్తోంది. మొక్కకు..మొక్కకు నాలుగు అడుగుల దూరం ఉండేలా చూడడం, యాంత్రీకరణ పద్ధతులను కూడా తెరపైకి తెచ్చినప్పటికీ దిగుబడి మాత్రం పెరగడం లేదు. దీంతో రైతుల శ్రమకు తగ్గ ఫలితం లేకుండా పోయింది. సర్కార్ ప్రోత్సాహం చెరుకు రైతుకు లేకుండా పోయింది. గిట్టుబాటు కావడం లేదు చెరుకు సాగు చేద్దామని ఆశపడిన ప్రయోజనం ఉండడం లేదు. పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. రాబడి తక్కువుగా ఉంది. ప్రభుత్వం నుంచి స్పందన, ప్రోత్సాహం పూర్తిగా లేదు. చల్లా రాజరత్నంనాయుడు, రైతు,వండానపేట, రేగిడి మండలం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది మార్కెట్లో అమ్మిన పంచదారకు ధర ఎక్కువుగా ఉంది. రైతు పండించిన చెరకు పంటకు ధర ఉండటంలేదు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు అయ్యేలా టన్నుకు రూ. 4000 ధరను అందజేయాలి. -కరణం గోవిందరావు, రైతు, ఉప్పర్నాయుడువలస, రేగిడి మండలం -
మద్దతు మాటే మరిచారు
భూమి మనదే... కష్టం మనదే... దానిపై పండే పంటకు మద్దతుధర మాత్రం మనది కాదు. ఎక్కడో నాలుగు గోడల మధ్య అధికారులే నిర్ణయిస్తారు. అదైనా క్షేత్రస్థాయిలో అమలవుతుందా అంటే దానికీ లేనిపోని సాంకేతిక కారణాలు చూపి వర్తింపజేయట్లేదు. ఏటా సాగు వ్యయం పెరుగుతోంది. ఎరువులు... విత్తనాలు... పురుగుమందుల ధరలతోపాటు కూలిమొత్తాలూ పెరుగుతున్నాయి. కానీ పండించిన పంటకు ఆ స్థాయిలో ధర నిర్థారించకపోవడమే ఇక్కడున్న సమస్య. ఫలితం ఏటా రైతాంగం అప్పుల్లో కూరుకుపోతోంది. వారి కష్టం మట్టిపాలవుతోంది. గరుగుబిల్లి(కురుపాం): దేశానికి రైతే వెన్నెముక అంటారు. వారిని ఆదుకోవడమే తమ ప్రధాన కర్తవ్యం అంటారు. కానీ వారు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించరు. ప్రకృతి విపత్తులవల్లో... మరే కారణాలవల్లో పంట నష్టపోతే కనీసం పరిహారం న్యాయబద్ధంగా అందించరు. అలా రైతు వెన్ను విరిచేస్తున్నారు. ఆరుగాలం కష్టించి... ఎన్నో సమస్యలకు ఎదురీది... ఎలాగోలా పండించిన పంటకు మద్దతు ధర పెంచాలని వేడుకుంటున్నా సర్కారు మా త్రం చేతులు విదల్చడం లేదు. ఈ ఏడాదైనా మద్దతుధర పెరుగుతుందని ఆశగా ఎదురుచూసే అన్నదాతకు తీవ్ర నిరాశే మిగిలింది. క్వింటాలుకు రూ.200లు మాత్రమే పెంచి చేతులు దులుపు కున్నారు. అమలు కాని ఎన్నికల హామీలు 2014 ఎన్నికల్లో రైతులు పండించే పంట ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా చెల్లిస్తామని తెలు గుదేశం నాయకులు హామీలు గుప్పించారు. వరి పంట ఉత్పత్తి చేసేందుకు క్వింటాలుకు రూ.2వేల వరకు వ్యయం అవుతుందని ప్రభుత్వం చెబుతున్న లెక్క. కానీ ప్రభుత్వమే కేవలం రూ.1,770లుగా మద్దతు ధర నిర్ణయించి విశేషం. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా రైతుకు క్వింటాలుకు రూ.300వరకు నష్టం వస్తోంది. ఉత్పత్తి వ్యయంకన్నా 50 శాతం పెంచడం అటుంచితే పెట్టిన వ్యయం కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. వరికి కనీస మద్దతుధర క్వింటాలుకు రూ.2,800లు ఉంచాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోనే నాథుడే కరువయ్యారు. ’రైతులను పట్టించుకోని ప్రభుత్వం ధాన్యం మద్దతు« ధరన పెంచాలని రైతులు, సంఘాలుచేసిన పోరాటాలు ప్రభుతాన్ని కదిలించలేకపోతున్నాయి. కంటితుడుపుగా మద్దతు ధరను ప్రకటించి ప్రభుత్వాలు మమ అనిపించాయి. ఎరువుల ధరలను పెంచిన ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచకపోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల ధరలు రెట్టింపు అవడంతో పెట్టుబడులకోసం అధిక వడ్డీలకు అప్పుచేయాల్సి వస్తోంది. ఇంత జరిగినా ప్రకృతి సహకరించకపోతే ఆశించిన దిగుబడి కూడా రావడం లేదు. తీరా వచ్చిన పంటను సైతం గిట్టుబాటు ధరకు అమ్ముకోలేకపోతున్నారు. దళారీల దందా ప్రభుత్వం తరఫున సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆర్థిక అవసరాల నిమిత్తం రైతులు ముందుగా కళ్లాల్లో వాలిపోతున్న ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వారు ప్రభుత్వ ధరతో నిమిత్తం లేకుండా వారు తమ ఇష్టానుసారం రేటు నిర్ణయించి రైతాంగాన్ని దోచుకుంటున్నారు. పల్లెల్లో సాగుతున్న ఈ దందాను అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక సాగు చేయడమంటేనే భయంగా మారి సాగుకు విరామం ప్రకటించాల్సి వస్తుందేమోనన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. రైతు వ్యతిరేక ప్రభుత్వాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకులుగా ముద్రవేసుకున్నాయి. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం కూడా రైతుల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. వరికి కనీసం రూ.2,500 మద్దతు ధరవుంటే రైతుకు నష్టాలు తగ్గుతాయి. ప్రభుత్వాలు రైతులపై చిన్నచూపు వల్ల తీరని అన్యాయం చేస్తున్నాయి. – గొట్టాపు త్రినాథస్వామి, కొత్తపల్లి, గరుగుబిల్లి మండలం కార్పొరేట్లకే రాయితీలు ఏటా లాభనష్టాలను ఆలోచించకుం డా సాగుచేస్తున్న అన్నదాతలకు వివిధ రకాల సాకులు చూపి కనీస మద్దతు ధర కల్పించని కేంద్రం బ డా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్లకు రకరకాల రాయితీలు కల్పిస్తోంది. కేవలం రైతుల విషయానికి వచ్చేసరికే ఆర్థిక సంక్లిష్టతలను చూపి గొంతు నొక్కేస్తోంది. ప్రభుత్వాలు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. – కె.రవీంద్ర, సీపీఎం నాయకుడు, గరుగుబిల్లి -
చిన్నబోయిన సన్నరకం
జిల్లాలో 60 శాతం వరకు బీపీటీ, హెచ్ఎంటీ, జై శ్రీరాం, సాయిరాం తదితర సన్న రకాలను రైతులు సాగు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ‘బి’ గ్రేడ్ ధరను ఇవ్వడం తో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. గతంలో పెద్ద మొత్తంలో సన్న రకం వరి ధాన్యం సేకరించిన కొంద రు వ్యాపారులు బిచానా ఎత్తివేయడంతో రైతులు రూ.3 కోట్ల వరకు నష్టపోయారు. మోర్తాడ్ (బాల్కొండ): ఖరీఫ్ సీజనులో రైతులు పండించిన సన్న ర కం వరి ధాన్యానికి కొనుగోలు కేం ద్రాల్లో ఆశించిన ధర లేకపోవడం తో రైతులు అసంతృప్తిని వ్యక్తం చే స్తున్నారు. జిల్లాలో దాదాపు 92 వేల హెక్టార్లలో వరి సాగైంది. ఇందులో 60 శాతం వరకు సన్న రకాలనే పండించారు. బీపీటీ, హెచ్ఎంటీ, జై శ్రీరాం, సాయిరాం తదితర సన్న రకాలను రైతులు సాగు చేశారు. ఎక్కువ మంది తమ భోజనంలో సన్న రకం బియ్యం తినడానికి ఆసక్తిని చూపడంతో రైతులు కూడా సన్న రకాల సాగుకే మొగ్గు చూపారు. రబీ సీజనులో పూర్తిగా దొడ్డు రకాలనే సాగు చేయడం వల్ల ఖరీఫ్‌లో సన్న రకాల సాగుకు రైతులు ప్రాధాన్యం ఇచ్చారు. సన్న రకాలకు మార్కెట్లో క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.2000 వరకు ధర పలుకుతుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ‘ఎ’ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.1,770, ‘బి’ గ్రేడ్ రకానికి రూ.1,750 మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలకే ఎ గ్రేడ్ ధరను వర్తింప చేస్తున్నారు. సన్న రకాలకు మాత్రం బి గ్రేడ్ ధరను కల్పిస్తున్నారు. దీంతో సన్న రకాలను సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించకుండా వ్యాపారులు, రైస్ మిల్లర్లకే అమ్మాల్సి వస్తోంది. కాగా వ్యాపారులు, రైస్ మిల్లర్ల ద్వారా మోసాలకు గురికాకుండా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్మాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అయితే సన్న రకాలకు కొనుగోలు కేంద్రాల్లో తక్కువ ధర వర్తించడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోతోంది. సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించగా ఆచరణలో విఫలం అయ్యింది. దీంతో సన్న రకాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు కాలేదు. మార్కెట్లో సన్న రకాలకు ఉన్న ధరను గుర్తించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేకరించి రైస్‌మిల్లర్లకు తామే విక్రయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఏ సీజనులోను సన్న రకాల కొనుగోలుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు తమ వద్ద ఉన్న ధాన్యం విక్రయించడానికి వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. గతంలో పెద్ద మొత్తంలో సన్న రకం వరి ధాన్యం సేకరించిన వ్యాపారులు బిచానా ఎత్తివేయడంతో మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, వేల్పూర్, బాల్కొండ, మెండోరా, ముప్కాల్ మండలాల్లోని రైతులు దాదాపు రూ.3 కోట్ల వరకు కోల్పోయారు. ఎక్కువ ధరకు సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పిన వ్యాపారులు టోకరా ఇవ్వడంతో రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఇలా ఎన్నో మార్లు వ్యాపారులు రైతులను ముంచడంతో ప్రభుత్వమే స్పందించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా సన్న రకాలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది.కాగా సన్న రకాల కొనుగోలుపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఫలితంగా సన్న రకాలను సాగు చేసిన రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సన్న రకాలకు మద్దతు ధరను పెంచి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. సన్న రకాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి సన్న రకాలు సాగు చేసిన రైతులకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం స్పందించాలి. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సన్న రకం వరి ధాన్యంను కొనుగోలు చేయాలి. ప్రభుత్వం వీలైనంత తొందరగా స్పందిచాలి. – కొప్పుల రాజశేఖర్, రైతు, మోర్తాడ్ -
రూ. 3000 నిరుద్యోగ భృతి : ఉత్తమ్
సాక్షి, మణుగూరు : తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతినిస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీయిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. వరి మొక్క జొన్నలు, సజ్జలు, రెండువేల రూపాయల మద్ధతు ధర ఇస్తామన్నారు. పత్తికి రూ. 6000, మిర్చికి రూ. 10 వేలకు పైగా మద్దతు ధరను కల్పిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీయిచ్చారు. -
కర్షకుడికి మేలు జరిగితే కన్నెర్ర
అదే రైతులకు లాభసాటి ధరలను అమలు చేయడం గురించి మాట్లా డితే మరుక్షణం ఆర్థికవేత్తల కనుబొమలు ముడిపడతాయి. కనీస మద్దతు ధర నుంచి కేవలం కొద్దిమంది రైతులే లబ్ధి పొందుతారు. అయితే కనీస మద్దతు ధరను సక్రమంగా అమలు చేస్తే ఏటా రూ. 45,000 కోట్లు అదనపు వ్యయం అవుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏడో వేతన సంఘం కోసం 4.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ఎవరూ అడగడం లేదు. దాదాపు పదేళ్ల నుంచి రైతుల నిజ ఆదాయం (కొనుగోలు శక్తిని ద్రవ్యో ల్బణం ప్రభావితం చేసినప్పుడు నిర్ణయించేది) స్తంభించిపోయింది. ఇది అధికారిక సమాచారమే. ఔను! మీరు సరిగానే విన్నారు, రైతు నిజ ఆదాయం స్తంభించింది. ఒక సేద్యగాడి నిజ ఆదాయంలో ఐదేళ్ల నుంచి, అంటే 2015– 16 ఆర్థిక సంవత్సరం వరకు ఏటా 0.44 శాతం పెరుగుదల మాత్రమే కని పించింది. మరోమాటలో చెప్పాలంటే వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం ఎదుగూబొదుగూ లేకుండా స్తబ్దంగా ఉంది. రైతులకు మిగిలేది చేదు ఫలమే ఈ పరిణామానికి తోడు 2016 నాటి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా పరిణమించింది. అంతే కాకుండా తమ పంటను తెగనమ్ముకోవలసిన పరిస్థితులు, ఒత్తిడి తలెత్త డంతో ధరలు దారుణంగా పడిపోయాయి. దీనితో చాలామంది రైతులు తాము పండించిన పంటను రోడ్ల మీద పడేసి పోవడం దేశమంతటా కని పించింది. ఇలాంటి దెబ్బ టొమేటో, బంగాళదుంప, ఉల్లి పంటలకు గట్టిగా తగిలింది. ఈ ప్రభావం నుంచి ఇంకా వ్యవసాయ రంగం బయటపడలేదు. ఇందుకు మహారాష్ట్ర రైతులే మంచి ఉదాహరణ. ఇటీవల ఆగ్రోవాన్ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం వ్యవసాయోత్పత్తు లను ప్రతిసారీ తక్కువ ధరకే అమ్ముకోవడం వల్ల ఆ రాష్ట్ర రైతులు ఒక్క తృణధాన్యాలలోనే రూ. 2,579 కోట్లు నష్టపోయారు. ఈ ఒక్క సీజన్లోనే చమురు గింజలను తెగనమ్ము కోవడం వల్ల రూ. 769 కోట్లు నష్టం వాటి ల్లింది. మిగిలిన ప్రాంతాలలో కూడా ఇదే పునరావృతమవుతూ ఉంటుంది. స్వరాజ్ అభియాన్ కూడా ఇలాంటి నష్టాలు ఏ రీతిలో ఉన్నాయో వెల్ల డిం చింది. బార్లీ పండించే రైతులు ఆ విధంగా రూ. 325 కోట్లు నష్ట పోతున్నారు. సేకరణ ధర క్వింటాల్‌కు రూ. 4,410 ఉండగా పద్ధతి ప్రకారం చెల్లించవలసిన ధర కంటే 15 శాతం తక్కువే ఉంటున్నది. ఉదాహరణకు శనగపప్పు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో దీని ధర నాటకీ యంగా పడి పోయింది. గత సంవత్సరం దక్కిన ధరతో పోల్చుకుంటే శనగపప్పు మార్కెట్ ధర 30 నుంచి 38 శాతం పతనమైంది. ఆవాల మొత్తం దిగుబడిని మార్కెట్లకు తరలించడం పట్ల రైతులు నిరసన ప్రకటించారు. ఈనామ్ మార్కెట్ల పరిస్థితి కూడా ఇంతకంటే మెరుగ్గా లేదు. ఈనామ్ మార్కెట్ల విషయంలో జరిగిన పటాటోపాన్ని పక్కన పెడితే, ప్రతిపాదిత 585 ఈనామ్ మార్కెట్లు ఏవీ కూడా వ్యవసాయోత్పత్తులను కనీస మద్దతు ధరకు కొను గోలు చేసే స్థితిలో లేవు. ఈనామ్ మార్కెట్లలో పద్ధతి ప్రకారం చెల్లిం చవలసిన ధరలను చెల్లించాలనే ప్రతిపాదించారు. ఈ ధరలను రోజువారీ వాణిజ్యంలో సగటు ద్వారా నిర్ణయిస్తారు. అయితే ఆ ధరలు కూడా న్యాయ బద్ధంగా లేవని తేలింది. ఇదంతా రైతులకు చేదు ఫలమే. రైతులలో పెల్లుబుకుతున్న ఆగ్రహం భయానకమైన ఈ వ్యావసాయిక సంక్షోభమే రైతులను ఆగ్రహంతో రోడ్డు ఎక్కేటట్టు చేస్తున్నది. గడచిన సంవత్సర కాలంగా రైతుల ఆగ్రహావేశాలు రోడ్ల మీద కనిపిస్తున్నాయి. 2014–2016 – కేవలం ఈ రెండు సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే రైతుల నిరసన కార్యక్రమాలు అనూహ్యంగా పెరిగి పోయిన సంగతి అర్థమవుతుంది. దేశం మొత్తం మీద ఆ రెండేళ్లలోనే రైతు నిరసన కార్యక్రమాలు 680 శాతం పెరిగాయి. 2016 సంవత్సరంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నమోదు చేసిన నిరసనల సంఖ్య 4,837. అంటే ఇంచు మించు రోజుకు 14 నిరసనలు. అప్పటి నుంచి రైతుల నిరసన ప్రదర్శనలు కొన్ని రెట్లు పెరిగిపోయాయి. నా అభిప్రాయం ఒక్కటే. ఎన్నికల ఫలితాల మీద రైతాంగ సంక్షోభం తన ప్రభావాన్ని చూపించగలిగితే తప్ప రాజకీయ నాయకత్వానికి ఆర్థిక, సామాజిక పతనంలోని తీవ్రత గురించి తలకెక్కదు. ఆర్థిక వృద్ధిని సాధించడానికి వ్యవసాయాన్ని త్యాగం చేయాలని చాలామంది ఆర్థికవేత్తల ప్రబల ఆలోచన. కాబట్టి సంస్కరణలకు అనుకూలమైన వాతా వరణం నెలకొనడం కోసం వ్యవసాయాన్ని మరింత లేమి వైపు నెట్టుతు న్నారు. రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్ ఒక మాట పదే పదే చెబుతూ ఉంటారు. అదేమిటంటే, చౌకగా కూలీల అవసరం ఉన్న పట్టణాలకు వ్యవ సాయ రంగం నుంచి గణనీయమైన సంఖ్యలో జనాభా తరలిపోవాలి. అదే నిజమైన సంస్కరణ అంటారాయన. 1996లో ప్రపంచ బ్యాంక్ ఆదేశించినది కూడా ఇదే. రాబోయే (అప్పటికి) ఇరవై ఏళ్లలో, అంటే 2015 నాటికి గ్రామీణ ప్రాంతాల నుంచి నలభై కోట్ల మంది తరలిపోవాలని ప్రపంచ బ్యాంక్ ఆకాం క్షించింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ఆర్థిక విధానాన్ని అనుసరిం చాయి. కుడి లేదా ఎడమ లేదా మధ్యేమార్గం అనుసరించే ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు. విధానం మాత్రం అదే. ప్రభుత్వ రంగ సంస్థలలో మదుపు కోసం వ్యవసాయ రంగాన్ని పస్తులు ఉంచడమే. అలాగే సేద్యాన్ని లాభసాటి వ్యవహారం కాదంటూ, అందుకు పరిష్కారం వ్యవసాయ రంగం నుంచి జనా భాను బయటకు నెట్టడమేనని భావించారు. తనను తాను పునరావిష్కరించుకోవాలి ఇలాంటి నిరాశాపూరిత వాతావరణంలో వ్యవసాయం తనను తాను పునరా విష్కరించుకోవలసిన అవసరం ఉంది. వ్యవసాయాభివృద్ధికి మామూలు మోతాదులో ఇచ్చే ప్రోత్సాహం చాలదు. వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవా లని నిజంగా భావిస్తే అసలు ఆర్థికరంగంలో మౌలిక మార్పు తేవడం ద్వారానే సాధ్యమన్న సంగతిని గుర్తించాలి. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచు కుంటూనే, గడచిన కొన్నేళ్లుగా పట్టణాలలో ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్న సంగతిని కూడా గమనించాలి. కాబట్టి మిగిలివున్న ఏకైక ప్రత్యా మ్నాయం వ్యవసాయ రంగం తనని తాను పునరావిష్కరించుకోవడమే. దీని గురించి కొంచెం వివరిస్తాను. 2004–14 నుంచి చూస్తే స్థూల జాతీయోత్పత్తి రేటు ఎక్కువగానే ఉన్నా, అది సంవత్సరానికి 1.25 కోట్ల ఉద్యోగాలను సృష్టించ గలిగినది కాదు. కేవలం కొలది ఉద్యోగాలను మాత్రమే సృష్టించడం జరిగింది. మరొకమాటలో చెప్పాలంటే 17.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించడం జరుగుతుందని అంచనా వేశారు. కానీ సృష్టించినవి మాత్రం 1.6 కోట్ల ఉద్యో గాలే. కాబట్టి వ్యవసాయం నుంచి జనాభాను తరలించాలన్న ఆలోచన ఆర్థిక శాస్త్ర పరమైన స్పృహతో చేసినది కాలేదు. ఉద్యోగావకాశాల మార్కెట్ ఒట్టి పోయింది. అందుచేత వ్యవసాయాన్ని ఆర్థికంగా సానుకూలమైనది, పర్యావ రణపరంగా నిలకడైనదని మన ఇంగితజ్ఞానం గ్రహించాలి. 52 శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. అంటే దాదాపు 60 కోట్ల జనాభా. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో లాభదాయకమైన ఆదాయ మార్గాలు చూపించాలి. పట్టణాలలో, నగరాలలో ఉన్న కార్మికులను వ్యవసాయ రంగాన్ని పునర్నిర్మించేందుకు గ్రామాలకు తరలేటట్టు చేసే విధంగా ఆర్థిక నిపుణుల ఆలోచనా ధోరణి మారినప్పుడే అది సాధ్యమవుతుంది. రైతుకు మేలు చేస్తే కన్నెర్ర దేశంలో పేదలకు ఉన్న ఏకైక ఆర్థిక భద్రత భూమి. పేదల దగ్గర ఉండే కొద్దిపాటి భూమిని లాక్కోవాలని అనుకోవడం సరైన ఆర్థికశాస్త్ర చింతన కాలేదు. కానీ భూమిని లాక్కోవడమే ఇప్పుడు ప్రపంచమంతటా ఒక ధోర ణిగా మారిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో కూడా అత్యధిక సంఖ్యలో రైతులు భూమిలేని నిరుపేద శ్రామికులుగా మారిపోయారు. వీరికి కొద్దిపాటి భూమి ఇస్తే కనుక, ఆ చర్య ఆర్థిక పతనానికి దారి తీస్తుంది. కానీ ఇక్కడ నాకు అర్థం కాని తర్కం ఒకటి ఉంది. వ్యాపార వర్గాలకు మాత్రం చదరపు మీటరు ఒక రూపాయి నామమాత్రపు ధరకు ధారాదత్తం చేయడమేమిటో అర్థం కాదు. అలా వ్యాపార వర్గాలకు కట్టబెడుతున్న భూఖండాలను లక్షలాదిగా ఉన్న భూమిలేని నిరుపేదలకు చదరపు మీటరు రూపాయికి ఇస్తే గ్రామీణ ఆర్థిక దృశ్యం గుర్తు పట్టలేనంతగా మారిపోతుంది. ఇదే వ్యవసాయరంగాన్ని పునర్నిర్మించడంలో తొలి అడుగు అవుతుంది. దీనికి కనీసంగా జీవించడానికి అవకాశం కల్పించే నెలవారీ వ్యవసాయ ఆదాయ విధానం కూడా తోడుగా ఉండాలి. అసమ ఆర్థిక విధానం ఇది ప్రాథమ్యాలకు సంబంధించిన ప్రశ్న. ఏడో వేతన సంఘం సిఫారసుల వల్ల 45 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, 50 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి చేకూరగలదని అంచనా వేస్తున్నారు. ఇందువల్ల ఏటా ప్రభుత్వానికి రూ. 1.02 లక్షల కోట్లు భారం పడుతుందని ఆర్థికమంత్రి తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కళాశాలలు దేశ వ్యాప్తంగా ఆ సిఫా రసులను అమలు చేస్తే అదనపు భారం రూ. 4.5 లక్షల కోట్లు ఉంటుందని క్రెడిట్ సుయిస్సే బ్యాంక్ చెబుతుంది. ఇదంతా దేశంలో ఒకటి నుంచి రెండు శాతం ఉన్న ఉద్యోగవర్గాలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. చిత్రం ఏమి టంటే ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందని ఏ ఆర్థికవేత్త ఎప్పుడూ ప్రశ్నించడు. లేదా పెరుగుతున్న ఆర్థికలోటు గురించి కూడా ఎవరూ నిలదీ యరు. కానీ పారిశ్రామికరంగం మాత్రం దీనిని ప్రోత్సాహక మోతాదుగా పేర్కొంటుంది. ఎందుకంటే జనం చేతిలో అదనపు ధనం ఉంటే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. అదే రైతులకు లాభసాటి ధరలను అమలు చేయడం గురించి మాట్లా డితే మరుక్షణం ఆర్థికవేత్తల కనుబొమలు ముడిపడతాయి. కనీస మద్దతు ధర నుంచి కేవలం కొద్దిమంది రైతులే లబ్ధి పొందుతారు. అయితే కనీస మద్దతు ధరను సక్రమంగా అమలు చేస్తే ఏటా రూ. 45,000 కోట్లు అదనపు వ్యయం అవుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏడో వేతన సంఘం కోసం 4.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని మాత్రం ఎవరూ అడగడం లేదు. మన ఆర్థిక విధానం ఇలా అన్యాయంగా, అసమ దృష్టితో రూపొం దింది. నిజానికి గ్రామీణ ప్రాంతాలలో డిమాండ్‌ను పెంచితే ఆర్థిక వ్యవస్థకు అది వేగవంతమైన మోతాదు అందించినట్టవుతుంది. ఇది మంచి రాజ కీయమే కాదు, మంచి ఆర్థికశాస్త్రం కూడా. దేవిందర్‌శర్మ, వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
మద్దతు ధరల కోసమే కొనుగోలు కేంద్రాలు
మెట్పల్లి(కోరుట్ల): రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందించడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం మినుముల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మినుములకు బహిరంగ మార్కెట్లో తక్కువ ధర ఉన్నందున రైతుల విజ్ఞప్తి మేరకు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. క్వింటాల్‌కు రూ.5400 మద్దతు ధర అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్‌చైర్మన్ నల్ల తిరుపతిరెడ్డి, సహకార సంఘం చైర్మన్ మారు మురళీధర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ చీటీ వెంకట్రావు, మార్క్‌ఫెడ్ డీఎం శ్యాంకుమార్, నాయకులు మారు సాయిరెడ్డి, ఇల్లెందుల శ్రీనివా స్, గురిజెల రాజిరెడ్డి, జావీద్ తదితరులున్నారు. -
కొనుగోళ్లకు సిద్ధం
ఉమ్మడి జిల్లా కార్యాచరణే ఖరారు 645 ధాన్యం, 31 మక్కల కేంద్రాలు 5లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం వారంలోగా సెంటర్లు ప్రారంభం అమ్మిన రెండు రోజుల్లోనే చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లా కార్యాచరణనే ఖరారు చేశారు. గత ఖరీఫ్‌లో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించారు. వారంలోగా ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటున్నారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పత్తి కొనుగోళ్లపై సీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కరీంనగర్ అగ్రికల్చర్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 645 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 5లక్షల టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్... డీఆర్డీఏ, ఐకేపీ, డీసీవో, సివిల్ సప్లయిస్, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులతో ధాన్యం సేకరణ విధివిధానాలపై సమీక్షించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత ఖరీఫ్‌లో 576 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.30 లక్షల టన్నుల వరిధాన్యాన్ని సేకరించారు. ఈసారి 645 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఐకేపీ 246, పీఏసీఎస్ 396, జీసీసీ 3 కేంద్రాలున్నాయి. గ్రేడ్–1 రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1510, సాధారణ రకానికి రూ.1470 కనీస మద్దతు ధర చెల్లించనున్నారు. ప్రతి కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా పర్యవేక్షించనున్నారు. అందుకు ఒక డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని నియమించనున్నారు. నగదును రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాల్సి ఉన్నందున వారి వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చే యాలని అధికారులకు జేసీ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకు ఖాతాలు లేని రైతులు వెంటనే తెరవాలని కోరుతున్నారు. నాణ్యత లేని ధాన్యం కొనుగోలు చేసినట్లయితే సదరు సెంటర్ ఇన్చార్జిపై చర్యలు తీసుకునేలా నిబంధనలు విధించారు. దిగుబడిపై దిగులు ఈ ఖరీఫ్‌లో 1.43 లక్షల హెక్టార్లలో వరి సాగుచేయగా దాదాపు సగం పంట ఎండిపోయింది. మిగిలిన పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు, వరదలు దెబ్బతీశాయి. మంథని నియోజకవర్గం మినహా అన్ని ప్రాంతాల్లో దాదాపు కోతలు కూడా మొదలవుతున్నాయి. ఈసారి దిగుబడి దాదాపు సగానికి పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అక్టోబర్ చివరి వరకు ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. మక్కల కొనుగోళ్లకు సై... జిల్లావ్యాప్తంగా 31 మొక్కజొన్న కొనుగోలు కేంద్రా ల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్ సిద్ధమైంది. డీసీఎంఎస్, పీఏసీఎస్‌ల ద్వారా మక్కలను కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1365కు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గతేడాది మార్క్‌ఫెడ్ ద్వారా 40 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొనుగోలు చేశారు. వ్యాపారులు మద్దతు ధర కంటే అధికంగా చెల్లించడంతో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేపట్టలేదు. ఈసారి కూడా 31 సెంటర్లలో మక్కల కొనుగోళ్లు చేపట్టనున్నారు. ప్రస్తుతం వ్యాపారులు సైతం రూ.1400 పైచిలుకు ధర పెడుతున్నారు. మక్కల రాకను బట్టి వారంలోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మార్క్‌ఫెడ్ డీఎం శ్యాంకుమార్ తెలిపారు. మక్కల కొనుగోలు కేంద్రాలివే.. కరీంనగర్, మానకొండూర్, హుస్నాబాద్, హుజూ రాబాద్, చొప్పదండి, జమ్మికుంట, జగిత్యాల, పెద్దపల్లి, ధర్మారం, గొల్లపల్లి, మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, మంథని, కాల్వశ్రీరాంపూర్ సబ్‌యార్డు, బెజ్జంకి సబ్‌యార్డు, మెట్పల్లి (వెల్లుల్ల), డీసీఎంఎస్ కేంద్రాలైన ఓదెల, కోహెడ, సారంగాపూర్, ఇల్లంతకుంట, చిగురుమామిడి, రాయికల్, సిరిసిల్ల, కథలాపూర్, సుల్తానాబాద్, జూలపల్లి, మేడిపల్లి, పెగడపల్లి.