కొనుగోళ్లకు సిద్ధం
Published Mon, Oct 17 2016 2:06 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
ఉమ్మడి జిల్లా కార్యాచరణే ఖరారు
645 ధాన్యం, 31 మక్కల కేంద్రాలు
5లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం
వారంలోగా సెంటర్లు ప్రారంభం
అమ్మిన రెండు రోజుల్లోనే చెల్లింపులు
నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లా కార్యాచరణనే ఖరారు చేశారు. గత ఖరీఫ్‌లో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించారు. వారంలోగా ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటున్నారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పత్తి కొనుగోళ్లపై సీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
కరీంనగర్ అగ్రికల్చర్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 645 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 5లక్షల టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్... డీఆర్‌డీఏ, ఐకేపీ, డీసీవో, సివిల్ సప్లయిస్, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులతో ధాన్యం సేకరణ విధివిధానాలపై సమీక్షించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత ఖరీఫ్‌లో 576 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.30 లక్షల టన్నుల వరిధాన్యాన్ని సేకరించారు. ఈసారి 645 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఐకేపీ 246, పీఏసీఎస్ 396, జీసీసీ 3 కేంద్రాలున్నాయి. గ్రేడ్–1 రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1510, సాధారణ రకానికి రూ.1470 కనీస మద్దతు ధర చెల్లించనున్నారు. ప్రతి కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా పర్యవేక్షించనున్నారు. అందుకు ఒక డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని నియమించనున్నారు. నగదును రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాల్సి ఉన్నందున వారి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చే యాలని అధికారులకు జేసీ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకు ఖాతాలు లేని రైతులు వెంటనే తెరవాలని కోరుతున్నారు. నాణ్యత లేని ధాన్యం కొనుగోలు చేసినట్లయితే సదరు సెంటర్ ఇన్‌చార్జిపై చర్యలు తీసుకునేలా నిబంధనలు విధించారు.
దిగుబడిపై దిగులు
ఈ ఖరీఫ్‌లో 1.43 లక్షల హెక్టార్లలో వరి సాగుచేయగా దాదాపు సగం పంట ఎండిపోయింది. మిగిలిన పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు, వరదలు దెబ్బతీశాయి. మంథని నియోజకవర్గం మినహా అన్ని ప్రాంతాల్లో దాదాపు కోతలు కూడా మొదలవుతున్నాయి. ఈసారి దిగుబడి దాదాపు సగానికి పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అక్టోబర్ చివరి వరకు ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి.
మక్కల కొనుగోళ్లకు సై...
జిల్లావ్యాప్తంగా 31 మొక్కజొన్న కొనుగోలు కేంద్రా ల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్ సిద్ధమైంది. డీసీఎంఎస్, పీఏసీఎస్‌ల ద్వారా మక్కలను కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1365కు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గతేడాది మార్క్‌ఫెడ్ ద్వారా 40 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొనుగోలు చేశారు. వ్యాపారులు మద్దతు ధర కంటే అధికంగా చెల్లించడంతో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేపట్టలేదు. ఈసారి కూడా 31 సెంటర్లలో మక్కల కొనుగోళ్లు చేపట్టనున్నారు. ప్రస్తుతం వ్యాపారులు సైతం రూ.1400 పైచిలుకు ధర పెడుతున్నారు. మక్కల రాకను బట్టి వారంలోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మార్క్‌ఫెడ్ డీఎం శ్యాంకుమార్ తెలిపారు.
మక్కల కొనుగోలు కేంద్రాలివే..
కరీంనగర్, మానకొండూర్, హుస్నాబాద్, హుజూ రాబాద్, చొప్పదండి, జమ్మికుంట, జగిత్యాల, పెద్దపల్లి, ధర్మారం, గొల్లపల్లి, మెట్‌పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, మంథని, కాల్వశ్రీరాంపూర్ సబ్‌యార్డు, బెజ్జంకి సబ్‌యార్డు, మెట్‌పల్లి (వెల్లుల్ల), డీసీఎంఎస్ కేంద్రాలైన ఓదెల, కోహెడ, సారంగాపూర్, ఇల్లంతకుంట, చిగురుమామిడి, రాయికల్, సిరిసిల్ల, కథలాపూర్, సుల్తానాబాద్, జూలపల్లి, మేడిపల్లి, పెగడపల్లి.
Advertisement
Advertisement