రేవంత్ మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బుల మూటలుపంపుతున్నారు: హరీశ్‌రావు
సన్న వడ్లను కొనడంలోప్రభుత్వం విఫలం... రైతులను సమీకరించి ఉద్యమాలు చేస్తాం
మర్రిగూడ: రాష్ట్రంలో రైతుల వడ్ల లోడ్ ఎత్తమంటే సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోట్ల కట్టల లోడ్ ఎత్తుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గత సంవత్సరం నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈ సంవత్సరం కృష్ణా నదిలో పుష్కలంగా నీరు రావడం వల్ల 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగైందన్నారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం వల్ల నల్లగొండలో కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు.
హరీశ్‌రావు బుధవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని, రైతులకు అవసరమైనన్ని గన్నీ బ్యాగులను అందించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం రైతులను పట్టించు కోకపోవడంతో రైతులు రూ.1,800కే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటివర కు నల్లగొండ జిల్లాలో ఒక కిలో సన్న వడ్లనూ కొన్న పాపాన పోలేదన్నారు. వడ్లు కొనకపోతే అధికారులను ఎందుకు కొనట్లేదని అడగడం లేదు కాని మ ద్యం తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మా త్రం మెమోలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదన్నారు. పక్క రాష్ట్రం నుంచి దళారులు వచ్చి తెలంగాణ రైతుల వద్ద తక్కువ రేటుకు ధాన్యాన్ని కొంటున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి రాజ్యంలో రైతులు రోదిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులను సమీకరించి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
కాగా, గతంలో ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకల్లో రూ.48 లక్షలు అవినీతి చోటుచేసుకోగా.. కొనుగోలు డబ్బులు నేటికీ రైతుల ఖాతాలో జమ కాలేదని రైతు మోదుగు రాజేందర్.. హరీశ్‌రావుకు చెబుతుండగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment