డిసెంబర్ 1 నుంచి 7 దాకా పాదయాత్రలు
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణ
కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి నాయకత్వం
పార్టీలోని సకల శ్రేణులు పాల్గొనేలా కార్యాచరణ
కాంగ్రెస్ హామీలు.. సర్కారు వైఫల్యాలపై పోరాటం
ఈ నెల 16, 17 తేదీల్లో ‘మూసీ నిద్ర’కు సమాయత్తం
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ వరుస పోరాటాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు బీజేపీ వేగంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే ఈ నెల 9, 11, 13 తేదీల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు మద్దతు ప్రకటించిన ఆ పార్టీ నేతలు, 16, 17 తేదీల్లో మూసీ ప్రాజెక్టు బాధితుల సమస్యలు తెలుసుకొనేందుకు ‘మూసీ నిద్ర’కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. దానికి కొనసాగింపుగా మరో భారీ కార్యాచరణను సిద్ధం చేశారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు వారంపాటు ఈ పాదయాత్రలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నాయకత్వం వహించనుండగా, బీజేపీలోని కింది స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నేత వరకు అందరూ తప్పనిసరిగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్టీ బలోపేతమే లక్ష్యంగా: 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, ఇప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు వరుస కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపైనే పోరాట కార్యాచరణ చేపడుతున్నది.
పాదయాత్రలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపైనే బీజేపీ నేతలు దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, గ్రామాలకు చేరుకునే వీలును బట్టి ఐదు నుంచి ఏడురోజుల పాటు పాదయాత్రలు నిర్వహించనున్నారు.
రోజుకు 15 నుంచి 17 కి.మీ. యాత్ర
నియోజకవర్గాల్లో రోజుకు 15 నుంచి 17 కి.మీ. దూరం పాదయాత్ర కొనసాగేలా రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో రోజుకు అంతకంటే ఎక్కువ దూరం యాత్ర చేసే వీలుండటంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కొందరు నాయకులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేసి పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారు. ప్రతిరోజు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా యాత్ర నిర్వహించాలి? నైట్ హాల్ట్ ఎక్కడ ఉండాలి? అనే అంశాలన్నింటినీ ఈ బృందాలు చూసుకొంటాయి.
వచ్చే నాలుగేళ్లపాటు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, ప్రజాసమస్యలపై పోరాడేందుకు పార్టీ పరంగా వివిధ రూపాల్లో చేపట్టబోయే నిరసనలు, ఆందోళ నలకు ఈ పాదయాత్ర పూర్వరంగంగా ఉపయోగ పడుతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభు త్వం మొగ్గుచూపినా, చూపకపోయినా... గ్రామ, మండల స్థాయిల్లో బీజేపీ బలపడేందుకు ఈ పాదయాత్రలు దోహదపడతాయని భావిస్తున్నారు.
25 ప్రాంతాల్లో మూసీ నిద్ర
ఈ నెల 16 నుంచి 17వ తేదీ ఉదయం వరకు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని 25 ప్రాంతాల్లో మూసీ నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాష్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.
3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలతో కలిసి భోజనం చేసి బస చేస్తామని వెల్లడించారు. ప్రక్షాళన పేరుతో ఇళ్లను కూలి్చతే ఊరుకోబోమని హెచ్చరించారు. బుల్డోజర్లను తమపై నుంచి ఎక్కించిన తర్వాతే ప్రజల ఇళ్లను ముట్టుకోవాల్సి ఉంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment