చిన్నబోయిన సన్నరకం | Grain Centers Arrangement In Nizamabad | Sakshi
Sakshi News home page

చిన్నబోయిన సన్నరకం

Published Wed, Oct 24 2018 11:49 AM | Last Updated on Wed, Oct 24 2018 11:49 AM

Grain Centers Arrangement  In Nizamabad - Sakshi

జిల్లాలో 60 శాతం వరకు బీపీటీ, హెచ్‌ఎంటీ, జై శ్రీరాం, సాయిరాం తదితర సన్న రకాలను రైతులు సాగు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ‘బి’ గ్రేడ్‌ ధరను ఇవ్వడం తో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. గతంలో పెద్ద మొత్తంలో సన్న రకం వరి ధాన్యం సేకరించిన కొంద రు వ్యాపారులు బిచానా ఎత్తివేయడంతో రైతులు రూ.3 కోట్ల వరకు నష్టపోయారు. 

మోర్తాడ్‌ (బాల్కొండ): ఖరీఫ్‌ సీజనులో రైతులు పండించిన సన్న ర కం వరి ధాన్యానికి కొనుగోలు కేం ద్రాల్లో ఆశించిన ధర లేకపోవడం తో రైతులు అసంతృప్తిని వ్యక్తం చే స్తున్నారు. జిల్లాలో దాదాపు 92 వేల హెక్టార్‌లలో వరి సాగైంది. ఇందులో 60 శాతం వరకు సన్న రకాలనే పండించారు. బీపీటీ, హెచ్‌ఎంటీ, జై శ్రీరాం, సాయిరాం తదితర సన్న రకాలను రైతులు సాగు చేశారు. ఎక్కువ మంది తమ భోజనంలో సన్న రకం బియ్యం తినడానికి ఆసక్తిని చూపడంతో రైతులు కూడా సన్న రకాల సాగుకే మొగ్గు చూపారు. రబీ సీజనులో పూర్తిగా దొడ్డు రకాలనే సాగు చేయడం వల్ల ఖరీఫ్‌లో సన్న రకాల సాగుకు రైతులు ప్రాధాన్యం ఇచ్చారు. సన్న రకాలకు మార్కెట్‌లో క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.2000 వరకు ధర పలుకుతుంది.

అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ‘ఎ’ గ్రేడ్‌ రకానికి క్వింటాలుకు రూ.1,770, ‘బి’ గ్రేడ్‌ రకానికి రూ.1,750 మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలకే ఎ గ్రేడ్‌ ధరను వర్తింప చేస్తున్నారు. సన్న రకాలకు మాత్రం బి గ్రేడ్‌ ధరను కల్పిస్తున్నారు. దీంతో సన్న రకాలను సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించకుండా వ్యాపారులు, రైస్‌ మిల్లర్లకే అమ్మాల్సి వస్తోంది. కాగా వ్యాపారులు, రైస్‌ మిల్లర్ల ద్వారా మోసాలకు గురికాకుండా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్మాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అయితే సన్న రకాలకు కొనుగోలు కేంద్రాల్లో తక్కువ ధర వర్తించడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోతోంది.

సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించగా ఆచరణలో విఫలం అయ్యింది. దీంతో సన్న రకాలకు ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు కాలేదు. మార్కెట్‌లో సన్న రకాలకు ఉన్న ధరను గుర్తించి ప్రత్యేక కౌంటర్‌ల ద్వారా సేకరించి రైస్‌మిల్లర్లకు తామే విక్రయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఏ సీజనులోను సన్న రకాల కొనుగోలుకు ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు తమ వద్ద ఉన్న ధాన్యం విక్రయించడానికి వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. గతంలో పెద్ద మొత్తంలో సన్న రకం వరి ధాన్యం సేకరించిన వ్యాపారులు బిచానా ఎత్తివేయడంతో మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి, వేల్పూర్, బాల్కొండ, మెండోరా, ముప్కాల్‌ మండలాల్లోని రైతులు దాదాపు రూ.3 కోట్ల వరకు కోల్పోయారు.

ఎక్కువ ధరకు సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పిన వ్యాపారులు టోకరా ఇవ్వడంతో రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఇలా ఎన్నో మార్లు వ్యాపారులు రైతులను ముంచడంతో ప్రభుత్వమే స్పందించి ప్రత్యేక కౌంటర్‌ల ద్వారా సన్న రకాలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది.కాగా సన్న రకాల కొనుగోలుపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఫలితంగా సన్న రకాలను సాగు చేసిన రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సన్న రకాలకు మద్దతు ధరను పెంచి ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

సన్న రకాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి 
సన్న రకాలు సాగు చేసిన రైతులకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం స్పందించాలి. ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేసి సన్న రకం వరి ధాన్యంను కొనుగోలు చేయాలి. ప్రభుత్వం వీలైనంత తొందరగా స్పందిచాలి.
– కొప్పుల రాజశేఖర్, రైతు, మోర్తాడ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement