రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్న రాయితీలను, సబ్సిడీలను ఉచితాలుగా ప్రకటించి... వాటిని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచనలు, సలహాలు ఇస్తూ ప్రకటన చేసింది. ఏవి ఉచితాలో, వేటిని ఉపసంహరించుకోవాలో స్పష్టంగా చెప్పలేదు. ఉచితం అంటే పూర్తి సబ్సిడీగా ఇచ్చేది. ఎలాంటి శ్రమ, ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేది. ఈరోజు దేశంలో 80 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన బతుకుతున్నారు. వారికి కనీస పౌష్టికాహారం అందుబాటులో లేదు. ఐదేళ్ల లోపు పిల్లలు వెయ్యికి 40 మంది మరణిస్తున్నారు. ఉత్పత్తి ధర చెల్లించి కొనుగోలు చేసే శక్తి ప్రజలలో లేదు. అలాంటి ప్రజలకు రాయితీలు ఇవ్వాలి. శ్రమ చేయడానికి శక్తిలేని వారు, వయస్సు మళ్లినవారు, ఆనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వం ఉచితంగా సహకారం అందించాలి. ప్రస్తుతం రాష్ట్రాలు చౌక డిపోల ద్వారా బియ్యం ఇస్తున్నాయి. వీటికి తోడు ఆసరా పింఛన్లు, భరోసా పింఛన్లు వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్నారు. వీటితోనే వీరు బతుకుతున్నారు. ఈ ఉచితాలు రద్దు చేస్తే వీరిలో చాలామంది బతకలేరు.
వ్యవసాయ రంగానికి ఎరువులు, విత్తనాలు, విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పేర్లతో రాయితీలు ఇస్తున్నారు. వ్యవసా యోత్పత్తులకు పెట్టిన పెట్టుబడిని శాస్త్రీయంగా ప్రభుత్వం లెక్కించడంలేదు. చివరికి మార్కెట్లలో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక దేశంలో ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఏదో రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన ప్రజలకు సబ్సిడీల పేరుతో రాయితీలు ఇస్తూనే ఉన్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ రాయితీలన్నింటినీ రద్దు చేయాలని సలహా ఇస్తున్నది. వార్షిక తలసరి ఆదాయం దేశంలో రూ. 1,50,326గా కేంద్రం ప్రకటించింది (2021–22). అంతకు తక్కువ వచ్చిన వారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు చెప్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రాయితీలను గమనించి ఆహార సబ్సిడీ (రూ. 2,06,831 కోట్లు), ఎరువుల సబ్సిడీ (రూ. 1,06,222 కోట్లు), గ్యాస్ (రూ. 8,940 కోట్లు), పెట్రోల్ సబ్సిడీ (రూ.3.30 లక్షల కోట్లు) ఏటా ఇస్తున్నది. ఈ మధ్య రైతు కుటుంబానికి రూ. 6,000 చొప్పున కిసాన్ సమ్మాన్ పేర రూ.68,000 కోట్లు, వడ్డీమాఫీకి రూ. 19,500 కోట్లు, పంట బీమాకు రూ. 15,500 కోట్లు... మొత్తం రూ.1,03,000 కోట్లు సబ్సిడీగా ఇస్తున్నది. దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ కార్పొరేషన్లు, ఆయా వర్గాలకు 20 శాతం సీడ్‌మనీ పేర సబ్సిడీలు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నారు. వాటితో ఉపాధి చాలామంది సంపాదించుకుంటున్నారు. రాష్ట్రాలు రాయితీలను రద్దు చేయాలంటున్న కేంద్రం ఈ రాయితీలను కూడా రద్దు చేయాల్సి ఉంటుంది! పేదలు తమ పిల్లలను బడికి పంపకుండా కూలీకి తీసుకుపోవడంతో అక్షరాస్యత పెరగడం లేదు.
అక్ష్యరాస్యతను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద కుటుంబాలకు సంవత్సరానికి ఉచితంగా రూ. 12,500 ఇవ్వడంతో వారు పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నారు. ఆ విధంగా విద్య వ్యాప్తి జరుగుతున్నది. మరి ఈ సహాయాన్ని ఆపాలంటారా? కాలేజీలలోగానీ, యూనివర్సిటీలలో గానీ పేదలకు అనేక రాయితీలు ఉన్నాయి. వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పేరుతో ఉచిత వైద్యం చేయిస్తున్నారు. ఈ ఉచితాలన్నింటినీ లెక్కవేసినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లలో 15 శాతానికి మించవు. కానీ, కార్పొరేట్ సంస్థలు ఈ రాయితీలను రద్దు చేయాలనీ, తమకు అనుకూల విధానాలు తేవాలనీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.
దీంతో ప్రభుత్వం కార్పొరేట్లకు తలొగ్గింది. సెప్టెంబర్ 2019న ఒక జీఓ ద్వారా కార్పొరేట్లు చెల్లించే 30 శాతం పన్నును 22 శాతానికి తగ్గించారు. మార్చి 2033 నాటికి 25 శాతం నుండి 15 శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. విదేశాలలో 35 నుండి 40 శాతం పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ, ఇక్కడ పన్నులు తగ్గిస్తున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటివాళ్ళు 13 రంగాలలో మోసాలు చేసి లక్షల కోట్లు ఎగనామం పెట్టారు. 2019 ఏప్రిల్ 14కు ముందు రూ. 7 లక్షల కోట్లు వారి ఖాతాల నుండి ‘రైట్ ఆఫ్’ చేశారు. నిరర్థక ఆస్తుల పేర 10 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ చేశారు. రూ. 2.11 లక్షల కోట్లు బెయిల్ ఔట్ కింద ఇచ్చారు.
జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, ఇటలీ తదితర దేశాలలో కార్పొరేట్లపై 30–40 శాతం పన్నులు వసూళ్ళు చేయడంతోపాటు నెలవారీ వేతనాలపై పన్ను వసూలు చేస్తూ ఆహార, ఇతర సంక్షేమ సబ్సిడీలు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. ఈ విషయాలు తెల్సినప్పటికీ భారత దేశంలో ఉచితాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను రద్దుచేసి, కార్పొరేట్లకు బహి రంగంగా లాభాలు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. కేంద్రం ప్రకటించిన ‘ఉచితాల రద్దు విధానాన్ని’ ఉపసంహరించుకోవాలి. (క్లిక్: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర)
- సారంపల్లి మల్లారెడ్డి
అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment