
వెబ్ ఆధారిత ట్యాక్సీ సేవలొద్దు!
రాష్ట్రాలను ఆదేశించామన్న హోంమంత్రి రాజ్‌నాథ్
అత్యాచారం ఘటనపై రాజ్యసభలో సభ్యుల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ట్యాక్సీ ప్రయాణికురాలిపై అత్యాచారం జరిగిన ఘటన మంగళవారం రాజ్యసభను కుదిపేసింది. మహిళల భద్రతపై మోదీ సర్కారు చిత్తశుద్ధిని రాజ్యసభలో కాంగ్రెస్ సహా విపక్షాల సభ్యులు ప్రశ్నించారు. నిర్భయ చట్టం అమలుపై సందేహాలను లేవనెత్తారు. విపక్ష మహిళా సభ్యులు ఈ అత్యాచార ఘటనపై తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఘటనకు సంబంధించి ప్రకటన చేశారు. ఉబర్ సహా అన్ని సంస్థల వెబ్ ఆధారిత ట్యాక్సీ సేవల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించినట్లు తెలిపారు. ట్యాక్సీ సేవలందిస్తున్న లెసైన్సులు లేని సంస్థలను నిషేధించాలని సూచించామన్నారు.
అయితే, ట్యాక్సీల కార్యకలాపాలను నియంత్రించాలనే ఆలోచనే తప్పితే.. ట్యాక్సీ సేవలను నిషేధించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ‘ఈ దారుణ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది దేశం యావత్తూ సిగ్గు పడాల్సిన ఘటన’ అన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందన్నారు. ఢిల్లీలో పీసీఆర్ వ్యాన్ల సంఖ్యను 370 నుంచి 1,000కి పెంచామని, 200 బస్సుల్లో, 3,707 బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నిందితుడిపై గతంలోనూ అత్యాచార ఆరోపణలున్నాయన్నారు. ఉబర్‌కు వినియోగదారులు చెల్లింపు జరిపే విధానం కూడా అక్రమమని తేలిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో వెల్లడించారు. కాగా, నిందితుడైన ట్యాక్సీ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌పై ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రేప్ ఘటనపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలంటూ ఢిల్లీ పోలీసులను జాతీయ మహిళాకమిషన్ ఆదేశించింది. కాగా, ట్యాక్సీలను నిషేధించడం సమస్యకు పరిష్కారం కాదు’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీవ్యాఖ్యానించారు.
ఉబర్‌పై విమర్శలు: ఢిల్లీ అత్యాచార ఘటన నేపథ్యంలో ట్యాక్సీ బుకింగ్ సేవలందిస్తున్న ఉబర్ సంస్థపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. నేర నేపథ్యం ఉన్న డ్రైవర్లను తమ సంస్థలో నిషేధించామని అవాస్తవాలతో వినియోగదారులను ఉబర్ మోసం చేసిందని లాస్ ఏంజలీస్, సాన్‌ఫ్రాన్సిస్కోల్లో ఆరోపణలు వచ్చాయి. ‘ఉబర్ డ్రైవర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు సాధారణమే’ అని టైమ్ పత్రిక వ్యాఖ్యానించింది. అక్రమంగా ట్యాక్సీ బుకింగ్ సేవలందిస్తున్న ఉబర్ సంస్థపై అమెరికాలోని పోర్ట్‌లాండ్ సిటీ స్థానిక కోర్టులో కేసు వేసింది.