మిల్లర్లకు సర్కారు దాసోహం!
మిల్లర్లకు సర్కారు దాసోహం!
Published Mon, Oct 21 2013 12:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
సాక్షి, హైదరాబాద్: బియ్యం మిల్లర్లకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం, తద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని మిల్లర్లు ఇతర రాష్ట్రాల్లో విక్రయించే బియ్యంపై వసూలు చేసే రెండు శాతం కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్‌టీ)ను రద్దు చే సే యోచనలో ఉంది. ఈ మేరకు ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేయగా.. పౌరసరఫరాల శాఖ సంబంధిత ఫైలును ఆర్థిక శాఖ పరిశీలనకు పంపింది. ఆర్థిక శాఖ పరిశీలన పూర్తి కాగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధమైందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్రలో ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తుంటే.. సందట్లో సడేమియాలా ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు పెద్ద ఎత్తున లబ్ది చేకూర్చే నిర్ణయాలకు సిద్ధమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు కూడా ప్రయోజనం చేకూర్చడమే ఇలాంటి నిర్ణయాల పరమార్థమని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మన రాష్ట్ర మిల్లర్లు ఇతర రాష్ట్రాల్లో బియ్యం విక్రయించాలంటే వాణిజ్య పన్నుల శాఖకు రెండు శాతం సీఎస్‌టీ చెల్లించి విక్రయించే బియ్యం పరిమాణం ఎంతో తెలిపే ‘సి’ ఫార్మ్ పొందాలి. అయితే ఈ విధంగా సీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదని, అలాగే ‘సి’ ఫార్మ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసింది! కేవలం లారీ, రైల్వే, ట్రక్కు లోడింగ్ సర్టిఫికెట్‌లు సరిపోతాయని పేర్కొంది. అంటే మిల్లర్లు తమ ఇష్టానుసారం ఇతర రాష్ట్రాల్లో బియ్యం విక్రయించుకునేందుకు వీలుగా మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసిందన్నమాట. 2011 జనవరి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు అంటే 2014 మార్చి వరకు ఈ వెసులుబాటు కల్పించాలని కూడా ఉప సంఘం సూచించింది. ఈ సిఫారసు అమలైతే రాష్ట్ర ఖజానాకు రూ.327 కోట్ల నష్టం వాటిల్లుతుంది. అంటే ఆ మేరకు మిల్లర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది.
గతంలోనూ సీఎస్‌టీ రద్దు చేసిన సీఎం!
2007 ఏప్రిల్ నుంచి 2010 డిసెంబర్ వరకు ఇతర రాష్ట్రాల్లో మిల్లర్లు విక్రయించిన బియ్యంపై సీఎస్‌టీని రద్దు చేస్తూ 2011లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఉప సంఘం పేర్కొంది. అదే తరహాలో ఇప్పుడు కూడా సీఎస్‌టీని రద్దు చేయాలని సూచించింది. గతంలో ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే కనీసం ఫైలు కూడా ఆర్థిక శాఖకు వెళ్లకుండానే సీఎం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ నిర్ణయం వల్ల ఖజానాకు రూ.52 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ రూ. 52 కోట్ల సీఎస్‌టీ రద్దుకు సంబంధించి రెవెన్యూ శాఖ అంతర్గతంగా మెమో జారీ చేసి సరిపుచ్చింది. అయితే ఆ మెమోలో ‘సి’ ఫార్మ్ మినహాయింపు, సీఎస్‌టీ రద్దు 2010 డిసెంబర్ వరకే పరిమితమని, 2011 జనవరి నుంచి సీఎస్‌టీ చెల్లించాలని, ‘సి’ ఫార్మ్ తప్పనిసరని అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. అయితే 2011 తర్వాత కూడా సీఎస్‌టీ రద్దుకు తాజాగా మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసింది.
Advertisement
Advertisement