cst
-
సీఎస్టీ యాప్.. ట్యాక్స్‌లో టాప్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ దేశంలోనే తొలిసారిగా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్టీ) విధానానికి శ్రీకారం చుట్టింది. అంతర్రాష్ట అమ్మకాల పన్ను వసూళ్లకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దేశ పన్ను వసూళ్ల వ్యవస్థకు ఆదర్శంగా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కమిషనర్ అనిల్ కుమార్ మార్గదర్శకాలతో ఉన్నత అధికారుల రూపొందించిన సీఎస్టీ యాప్‌తో పన్ను వసూళ్ల ప్రక్రియ ఎంతో సులభతరమైందని అధికారులు చెబుతున్నారు. యాప్‌లో అంతర్రాష్ట అమ్మకాలు, డీలర్లకు సంబంధించిన వివరాలతో పాటు వారు సమర్పించాల్సిన సీ, ఎఫ్, ఐ ఫారాలతో పాటు బిల్ ఆఫ్ ల్యాండింగ్‌కు సంబంధించిన దస్తావేజులను ఉంచారు. దీంతో పాటు డీలర్లు పన్ను మినహాయింపునకు అందించాల్సిన ఫారాలు సమర్పించారా..? అమ్మకాలకు తక్కువ ధరల కోసం నివేధికలు అందింOచారా..? అనే సమాచారం యాప్‌లో పొందుపర్చారు. పన్ను వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు యాప్‌లో ఉండడంతో అధికారులకు విధులు సులభతరమయ్యాయి. యాప్‌తో అన్ని ప్రక్రియలూ సులువు.. సీఎస్టీ యాక్ట్ కింద ఈ ఏడాది జూన్ వరకు అంతర్రాష్ట్ర అమ్మకాలపై డీలర్లు కోరిన పన్ను మినహాయింపులు, తక్కువ ధరలకు సంబంధించి సీ, ఎఫ్, ఐ ఫారాల బిల్ ఆప్ ల్యాండింగ్ దస్తావేజులు సమర్పించాల్సి ఉంటుంది. ఒక త్రైమాసికంలో జరిగిన అమ్మకాలపై కోరిన మినహాయింపులు, అంతర్రాష్ట్ర, తక్కువ పన్ను రేట్లను తర్వాత త్రైమాసికం లోపు దస్తావేజులు రుజువులు, పత్రాలు వాణిజ్య పన్నుల శాఖకు డీలర్లు సమర్పించాలి. ఒకవేళ వారు సమర్పించని పక్షంలో.. సమర్పించని అమ్మకాల వివరాలను సాధారణ అమ్మకాలుగా పరిగణించి పన్ను మదింపు చేస్తారు. దీనికిగాను వాణిజ్య పన్నుల శాఖకు నాలుగేళ్లలోపు మదింపు చేయాల్సి ఉంటుంది. కానీ వాణిజ్య పన్ను శాఖ మదింపు చేయడానికి ఎక్కువ మంది సిబ్బంది, సమయం కావాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో సీఎస్టీ యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా అన్ని సీఎస్టీ నోటీసులు గత సంవత్సరాలకు సంబంధించినవన్నీ డీలర్ల నమోదు చేసిన ఈ మెయిల్ అడ్రస్‌కు ఒకే క్లిక్‌తో వెళ్లిపోయే వెసులుబాటు కలిగింది. ఈ ప్రక్రియతో వాణిజ్య పన్నుల శాఖకు సమయం ఆదా అవుతుంది. సిబ్బంది కూడా ఎక్కువ మంది అవసరం ఉండదు. నోటీస్ అందిన డీలర్లు వాటిలో ఉన్న ఒక లింక్ ద్వారా అభ్యంతరాలు, రుజువులు, పత్రాలను, ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించిన తర్వాత డీలర్లు ఈ– మెయిల్ ద్వారా వ్యక్తిగత వివరణ పత్రం చేరుతుంది. దీనిని ఆన్లైన్లో పూర్తి చేసి అధికారులు ఇచ్చిన తేదీల్లో వ్యక్తిగతంగా హాజరై అందజేయాలి. పారదర్శకతకు అవకాశం.. సీఎస్టీ పన్ను వసూళ్లకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కంప్యూటర్, ఆన్లైన్ ద్వారా కొనసాగుతుంది. ఇటు శాఖ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న కార్యకలాపాలు, అటు డీలర్లు సమర్పిస్తున్న వివరాలు అన్ని ఆన్లైన్లో జరుగుతున్నాయి. డీలర్లు సమర్పించాల్సిన పత్రాలు, రుజువులు, వివరాలు అన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించడంతో ఎలాంటి అక్రమాలకు తావు ఉండదు. ఒకవేళ ఏవైనా దస్తావేజు పత్రాలు సమర్పించకపోతే ఆన్లైన్లో తెలిసిపోతుంది. దీంతో పన్ను వసూళ్ల ప్రక్రియా మొత్తం పారదర్శంగా కొనసాగుతోంది. ఈ యాప్‌తో పన్ను వసూళ్ల ప్రక్రియ సులభంగా మారింది. ఒక్కో అధికారికి 50 మంది డీలర్లు లక్ష్యంగా.. సీఎస్టీ పన్ను వసూళ్ల కోసం కేంద్ర కార్యాలయం ద్వారా సర్కిల్లోని ఒక్కో అధికారికి 50 మంది డీలర్ల పన్ను వసూళ్లకు టార్గెట్ ఇస్తున్నారు. దీంతో కేంద్ర కార్యాలయం సీ, ఎఫ్, ఐ ఫారాలు, నివేదికలు అందజేసే డీలర్ల వివరాలను అధికారులకు టార్గెట్‌గా ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు తొలుత ఫోన్ ద్వారా సమాచారం తీసుకుంటున్నారు. డీలర్ల వివరాలు అందజేయనివారికి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న డీలర్లు వివరాలను ఆన్లైన్లో అందించి పన్నులు చెల్లిస్తున్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.2వేల కోట్ల ఆదాయం సమకూర్చేందుకు ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకెళ్తున్నారు. -
సెల్ఫీ స్పాట్ కోసం.. 80 లక్షల ఖర్చు!
సెల్ఫీ తీసుకోవాలంటే అందుకు మంచి మూడ్ ఉండాలి, దానికి తగ్గట్టు మంచి ప్రదేశం కూడా ఉండాలి. అది లేకపోతేనే ఎక్కడెక్కడికో వెళ్లి రిస్క్ తీసుకుని సెల్ఫీలు తీసుకోవడం, ఆ ప్రయత్నంలో కొంతమంది ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లడం తెలిసిందే. ఇలాంటి ఇబ్బందులు లేకుండా, మంచి సెల్ఫీలు తీసుకోడానికి వీలుగా ముంబై మహానగరంలో ఓ మంచి ఆకర్షణీయమైన సెల్ఫీ పాయింట్‌ను రూపొందించారు. నగరంలోనే అత్యంత చరిత్రాత్మకమైన ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించేలా ఈ పాయింట్‌ను సిద్ధం చేశారు. శివసేన యువ నాయకుడు ఆదిత్య ఠాక్రే దీన్ని ప్రారంభించి అక్కడ సెల్ఫీలు తీసుకున్నారు. వాటిని వెంటనే ఆయన ట్వీట్ చేశారు. 128 సంవత్సరాల చరిత్ర కలిగిన ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ను చూసేందుకు పర్యాటకులు మామూలుగానే వెల్లువెత్తుతుంటారు. అయితే ఈ స్టేషన్ వద్ద ప్రయాణికుల రద్దీతో పాటు ఫొటోలు తీసుకోడానికి వచ్చే జనాల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉండటంతో.. దానికి ప్రత్యామ్నాయంగా దీన్ని సిద్ధం చేశారు. సెల్ఫీలు తీసుకోడానికి ఇది చాలా సురక్షితమైనదని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ శ్రీరామ్ సుందరం, ఆయన కుమార్తె తరిణి చెప్పారు. ప్రజలు ఇక్కడ చాలా సురక్షితంగా సెల్ఫీలు తీసుకోవచ్చని అన్నారు. తరిణి ఇక్కడ చాలా ఫొటోలు తీసుకున్నారు. -
రైల్వే బుకింగ్ కౌంటర్లోనే నోట్లు మార్చాడు!
ముంబై: నోట్ల రద్దు నేపధ్యంలో అవకాశం ఉన్న ప్రతిచోటా అక్రమాలు జరిగిన ఘటనలు ప్రజలను విస్మయపరుస్తున్నాయి. కొంత మంది బ్యాంకు అధికారులే స్వయంగా బడాబాబులు డబ్బు మార్చుకోవడానికి మధ్యవర్తులుగా వ్యవహరించిన తీరును గమనిస్తూనే ఉన్నాం. తాజాగా ఓ రైల్వే అధికారి టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్దే నోట్ల మార్పిడి చేసి బుక్ అయ్యాడు. ముంబైలోని సీఎస్టీ రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఎల్కే బోయర్‌పై సీబీఐ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. రైల్వే బుకింగ్ కౌంటర్ వద్దే ఈయన పాత నోట్ల మార్పిడి కార్యక్రమం చేపట్టాడు. సుమారు 8.22 లక్షల విలువగల 1000, 500 రూపాయల పాత నోట్లను.. 100, 2000 రూపాయల నోట్లతో బోయర్ మార్చినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోంది. -
సీఎస్టీ-పన్వేల్ ఫాస్ట్ కారిడార్‌కు యత్నాలు
సాక్షి, ముంబై : కొద్ది సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన ‘ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)-పన్వేల్ ఫాస్ట్ కారిడార్’ ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు అమలుపై రైల్వే పరిపాలన విభాగం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలు వేగవంతమయ్యాయి. ప్రాజక్టుకు రూ. 11 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాజెక్టు పూర్తయేనాటికి వ్యయం రూ.13-14 వేల కోట్లకు చేరుతుందని నిపుణులు అంటున్నారు. ప్రాజెక్టులో పెట్టుబడులపై రెండు విభాగాలు చర్చించినట్లు సమాచారం. సీఎస్టీ-పన్వేల్ మధ్య లోకల్ రైలులో ప్రయాణానికి ప్రస్తుతం 80 నిమిషాల సమయం పడుతోంది. కాగా, ఫాస్ట్ కారిడార్ వినియోగంలోకి వస్తే 45 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. మొత్తం పది స్టేషన్లు ఉండే ఈ ప్రాజెక్టు పనులను ఐదేళ్లలో పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. గంటకు 110 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లను ప్రతి ఐదు నిమిషాలకు ఒకటి నడపనున్నారు. ప్రతి బోగీలో 350 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ప్రాజెక్టు ప్రత్యక్షంగా వినియోగంలోకి వస్తే రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు సాగించే వారి సంఖ్య 20 శాతానికి పైగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీ తగ్గించడానికే.. కాగా, సీఎస్టీ-పన్వేల్ హార్బర్ మార్గంలో అప్,డౌన్ రైలు మార్గాలు ఉన్నందున ఫాస్ట్ రైళ్లు నడిపే అవకాశం లేదు. ప్రస్తుతం సెంట్రల్ మార్గంలో సీఎస్టీ నుంచి కల్యాణ్ వరకు పశ్చిమ రైల్వే మార్గంలో చర్చిగేట్ నుంచి విరార్ వరకు నాలుగు రైల్వే లేన్లు ఉన్నాయి. వీటిలో రెండు స్లో, రెండు ఫాస్ట్ మార్గాలున్నాయి. హార్బర్ మార్గంలో రెండు రైల్వే లేన్లు మాత్రమే ఉండటంతో ఫాస్ట్ లోకల్ రైళ్లు నడపడం సాధ్యమవడంలేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో లోకల్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ రైళ్లు నడిపితే ప్రయాణికులకు రద్దీ తగ్గుతుందని రైల్వే భావించింది. దీంతో ఫాస్ట్ కారిడార్ ప్రాజెక్టు తెరమీదకు తెచ్చింది. అయితే ప్రాజెక్టుకు రైల్వే బోర్డు నుంచి అధికారికంగా అనుమతి లభించలేదు. మంజూరు కోసం ప్రయత్నాలు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. -
మేమేం చేయలేం
♦ ఐటీ సీజ్ చేసిన రూ.1,274 కోట్ల నిధులపై కేంద్రం నిస్సహాయత ♦ విఫలమైన తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ♦ పాత బకాయిలపై ప్రతిపాదనలు పంపాలని సూచన ♦ సీఎస్టీ, ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని రాష్ర్ట సర్కారు లేఖ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సర్కారు ఖజానా నుంచి ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసిన రూ.1,274 కోట్ల వ్యవహారంపై కేంద్రం చేతులెత్తేసింది. తామేమీ చేయలేమంటూ కేంద్ర ఆర్థిక శాఖ నిస్సహాయతను వ్యక్తం చేసింది. హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సర్కారు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లయింది. ఐటీ శాఖ నుంచి నిధులు తిరిగి ఇప్పించటం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులు, పాత బకాయిలు ఉంటే ప్రతిపాదనలు పంపించాలని సూచించింది. ప్రత్నామ్నాయంగా వాటిని విడుదల చేయిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారుల బృందంతో ఢిల్లీకి వెళ్లి ఈ నిధుల అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. మూడు రోజులుగా అధికారుల స్థాయిలో తన వంతు ప్రయత్నాలు చేసిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర రాష్ట్రానికి తిరిగి వచ్చారు. సీఎస్టీ బకాయిలపై కేంద్రానికి లేఖ.. మరోవైపు ఆర్థిక శాఖ సూచనల మేరకు కేంద్రం నుంచి రావాల్సిన పాత బకాయిలు రాబట్టుకునే ప్రయత్నాలను ప్రభుత్వం వేగవంతం చేసింది. తెలంగాణకు రావాల్సిన సీఎస్టీ బకాయిలు, 13వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని కోరుతూ బుధవారం కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. గతేడాది డిసెంబర్ నాటికి కేంద్రం నుంచి రూ.6,600 కోట్లు సీఎస్టీ బకాయిలు రావాల్సి ఉంది. మొత్తం బకాయిల్లో మూడో వంతు నిధులు మార్చిలో చెల్లిస్తామని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ సమావేశంలో అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ నిధులు రాలేదు. దీనికి తోడు నెలనెలా మరో రూ.250 కోట్లు సీఎస్టీ బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం నిధుల్లో మూడో వంతు రూ.2,200 కోట్లు వెంటనే విడుదల చేయాలని లేఖలో ప్రభుత్వం కోరింది. ఏడాదిగా కేంద్రం దాటవేత ధోరణి రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్టీ) బకాయిలపై ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం ఏడాదిగా దాటవేస్తోంది. సీజ్ చేసిన నిధులు ఇప్పించాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బకాయిలకైనా మోక్షం కలుగుతుందేమోనని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. అందుకే సీఎస్టీ బకాయిలతో పాటు ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. గత ఆర్థిక సంవత్సరం చివరికి 13వ ఆర్థిక సంఘం గడువు ముగిసింది. ముందుగా నిర్దేశించిన కేటాయింపుల ప్రకారం తెలంగాణకు రావాల్సిన రూ.1,129 కోట్లువిడుదల కాలేదు. ఆర్థిక సంఘం గడువు ముగియటంతో ఇవి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. -
సీఎస్టీ చెల్లించాకే జీఎస్టీ
ఆర్థిక మంత్రులతో సదస్సులో తెలంగాణ మంత్రి ఈటల కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశంలో తెలంగాణకు స్పెషల్ స్టేటస్, అభివృద్ధి నిధులపై చర్చ కేంద్ర వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రులతో భేటీ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు చెల్లించాల్సిన సీఎస్టీ బకాయిలు చెల్లించిన తర్వాతే వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ)ను అమలు చేయాలని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 2016 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలు చేయాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం, మొదట రాష్ట్రాలకు చెల్లించాల్సిన సీఎస్టీ బకాయిలు ఇస్తే భరోసా కలుగుతుందని అన్నారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో బుధవారం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపవర్డ్ కమిటీ సమావేశానికి తెలంగాణ తరఫున ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ అమలును స్వాగతిస్తోందని, అయితే పొగాకు ఉత్పత్తులు, పెట్రోల్ ఉత్పత్తులు, ఎకై్సజ్, ప్యాడీ ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి నిధులపై చర్చించారు. ఒక్క రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌తోనూ ఈటల సమావేశమయ్యారు. అంతకుముందు ఢిల్లీ ఏపీభవన్ గురజాడ సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు సీఎస్టీ బకాయి మొత్తం రూ.7,049 కోట్లు రావాల్సి ఉండగా, మొదటి విడతగా 2010-11 బకాయి రూ. 454.6 కోట్లు బుధవారం విడుదల చేసినట్టు ఈటల పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని మరో రెండు విడతల్లో విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినా, కేంద్ర పథకాల నిధుల్లో కోత విధించడంతో తెలంగాణకు ఏటా రావాల్సిన ఆదాయానికి రూ. 2,389 కోట్లమేర గండి పడిందన్నారు. గతేడాదితో పోలిస్తే తెలంగాణకు ఈ ఏడాది కేంద్ర నుంచి వచ్చే నిధులు రూ. 4,622 కోట్లు తగ్గాయని పేర్కొన్నారు. పేదలను 1.91 కోట్లుగా గుర్తించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లెక్కల ప్రకారం తెలంగాణలో పేదల సంఖ్య 1.91 కోట్లుగా గుర్తించారని, తెలంగాణలో పేదల సంఖ్య వాస్తవానికి 2.86 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ కేంద్ర నుంచి బియ్యం కోటా ఇవ్వాలని ఈటెల కేంద్ర మంత్రి పాశ్వాన్‌ను కోరారు. సంక్షేమ హాస్టళ్లకు బియ్యం కోటా పెంచాలని, చౌకధరల దుకాణాల్లో బియ్యం పంపకంలో అక్రమాలకు తావు లేకుండా ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు అయ్యే రూ. 225 కోట్లు కేటాయించాలని, హమాలీ చార్జీలను పెంచాలని, పాత లెవీ విధానాన్ని అమలు చేసేలా పునరాలోచించాలని కోరారు. కేంద్ర సాయం అందేవరకు రాష్ట్ర నిధులు వాడుకోండి అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర సాయం వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోవాలని కేంద్ర వ్యవ సాయ శాఖ మంత్రి రాధామోహ న్సింగ్ సూచించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన తెలంగాణ రైతులను ఆదుకోవాలంటూ తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్రమంత్రిని బుధవారం ఢిల్లీలో కలసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులను రూ.100 కోట్ల నుంచి రూ.250 కోట్లకు పెంచామని, అప్పటి వరకు ఆ నిధులను వాడుకోవాలని ఆయన సూచించారు. త్వరలో బిల్లు తెస్తాం: జైట్లీ జీఎస్టీపై బుధవారం రాష్ట్రాలతో జరిగిన సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ...త్వరలోనే పార్లమెం టులో బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. దాదాపుగా ఏకాభిప్రాయం వచ్చిందని, అందరికీ లాభదాయకమైన ఏకీకృత జీఎస్టీని ప్రవేశపెట్టడానికి వీలుగా రెండు, మూడు రోజుల్లో రాజ్యాంగసవరణ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. జీఎస్టీ మూలంగా తమకు వాటిల్లే ఆదాయ నష్టానికి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పరిహారమివ్వాలని కొన్ని రాష్ట్రాలు కోరాయి. మహారాష్ట్ర, గుజ రాత్ లాంటి రాష్ట్రాలు జీఎస్టీపై అదనంగా 2 శాతం పన్ను వేసుకునేందుకు రాష్ట్రాలకు వీలుండాలని కోరాయి. ప్రస్తుత జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లులో రాష్ట్రాలకు ఒక శాతం మాత్రమే అదనంగా పన్ను వేసుకునే అధికారం ఉంది. -
అమరులకు ఘననివాళి
సాక్షి, ముంబై: ముంబైలో జరిగిన 26/11 ఘటనలో ముష్కరుల దాడిలో బలైన అమాయకులకు, అమరవీరులకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తోపాటు ఇతర మంత్రులు, రాజకీయనాయకులు, సామాన్య ప్రజలు నివాళులర్పించారు. ముంబైనగరంపై ముష్కరుల దాడులు జరిగి బుధవారం నాటికి ఆరేళ్లు పూర్తిఅయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై, ఠాణే, పుణేలతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నివాళి అర్పించారు. అదే విధంగా రక్తదాన శిబిరాలు, ర్యాలీలు నిర్వహించారు. పుణేలో ఉన్న దేవేంద్ర ఫఢ్నవిస్ అమరులకు నివాళులర్పించిన అనంతరం ఇచ్చిన సందేశంలో పోలీసు శాఖను మరింత ఆదునికీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలను అందిస్తామన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పుణే పర్యటనలో ఉన్నందున ప్రొటోకాల్‌లో భాగంగా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతోపాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవిస్ కూడా ఆయన వెంటే ఉన్నారు. మరోవైపు ముంబై మరీన్లైన్స్ పోలీసు జింఖానాలో పోలీసు అమరవీరుల స్మారకం వద్ద ఉదయం 10 గంటలకు అనేక మంది నివాళులు అర్పించారు. విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే, ప్రకాష్ మెహతాతోపాటు మహారాష్ట్ర డీజీపీ సంజీవ్ దయాల్, ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. అదే విధంగా అమరువీరుల కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అమరవీరులను మరచిపోయారంటూ ఎన్సీపీ నాయకులు అజిత్ పవార్ ఆరోపించారు. -
వ్యయాల కారణంగానే ధర పెరిగింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ వ్యయాలు దూసుకెళ్లడం వల్లే సిమెంటు ధర పెరుగుతోందని కంపెనీలు అంటున్నాయి. వ్యయంలో 80-90 శాతం మేర తమ చేతుల్లో లేదని పరిశ్రమల ప్రతినిధులు మంగళవారమిక్కడ మీడియాకు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక్కో బ్యాగు తయారీకి రూ.335 అవుతోంది. అమ్మకం ధర ఇంత కంటే తగ్గితే కంపెనీలు నష్టాలను చవిచూస్తాయని స్పష్టం చేశారు. సిమెంటు ధర వ్యయాలకు అనుగు ణంగా స్థిరీకరణ జరిగిందని వారు చెప్పారు. మీడియా సమావేశంలో సాగర్ సిమెంట్స్ జేఎండీ ఎస్.ఆనంద్ రెడ్డి, మై హోం ఇండస్ట్రీస్ ఈడీ ఎస్.సాంబశివరావు, ఇండియా సిమెంట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె.సాయి ప్రకాశ్, భవ్య సిమెంట్స్ ఎండీ వి.ఆనంద ప్రసాద్, పరాశక్తి సిమెంట్ ఈడీ యశ్వంత్ కృష్ణ, పెన్నా సిమెంట్స్ డెరైక్టర్ ఆర్.పి.సింగ్ మాట్లాడారు. నిర్మాణంలో సిమెంటు వ్యయం..: ఖరీదైన భవంతి నిర్మాణంలో సిమెంటుకు అయ్యే వ్యయం కేవలం 2-3 శాతమే. సాధారణ భవంతికి ఈ వ్యయం 4-5 శాతానికి మించదు. ఒక్కో బ్యాగు ధర రూ.50-60 పెరిగినా, నిర్మాణంలో ఒక్కో చదరపు అడుగుకు రూ.15-20 కంటే వ్యత్యాసం రాదన్నారు. ‘బిల్డర్లు సిమెంటును 2 శాతం సీఎస్టీ చెల్లించి కర్నాటక, మహారాష్ట్ర నుంచి తెప్పిస్తున్నారు. తెలంగాణలో వ్యాట్ 14.5 శాతముంది. ఇతర రాష్ట్రాల నుంచి బిల్డర్లు సిమెంటు కొనుగోలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.200 కోట్ల దాకా ఆదాయం కోల్పోతోంది’ అన్నారు. అన్నీ పెరిగాయి..: 2010లో ఒక టన్ను బొగ్గును సింగరేణి గనులు రూ.2,553కు విక్రయించాయి. ప్రస్తుతం ఇది రూ.5,459 ఉంది. విద్యుత్ చార్జీలు రెండేళ్లలో 60-70 శాతం పెరిగాయి. డీజిల్, రైల్వే రవాణా చార్జీలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రభావంతో సిమెంటు రవాణా చార్జీలు కూడా పెరిగాయని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక్కో బ్యాగు ధర రూ.315-330, వైజాగ్‌లో రూ.325 ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రూ.395 వరకు ఉందన్నారు. 2013 జూలైలో బ్యాగు ధర రూ.325-340 ఉందని గుర్తు చేశారు. బిల్డర్లు సిమెంటు ప్లాంటు పెట్టాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తన ప్లాంటును వారు ఉచితంగా తీసుకోవాల్సిందిగా భవ్య సిమెంట్స్ ఎండీ వి.ఆనంద ప్రసాద్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. లాభంలో 10% తనకు ఇస్తే చాలన్నారు. -
తెలంగాణలో ఉంటాం.. సీమాంధ్రకూ విస్తరిస్తాం
* వ్యాపారావకాశం ఉన్నచోటుకే విస్తరణ * పారిశ్రామికవాడల్లో అయితే పెట్టుబడికి సిద్ధం * ఒకే దరఖాస్తుతో అన్ని అనుమతులు ఇవ్వాలి * రెండు రాష్ట్రాలు సీఎస్టీ మినహాయించాలి * ఇవీ పారిశ్రామిక ప్రతినిధుల డిమాండ్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార పరంగా మేం ఎదగాలి. అందుకు విస్తరణే ఎకైక మార్గం. నూతన వ్యాపార అవకాశాలు ఉన్నచోటే ప్లాంట్లు పెడతామని అంటున్నారు వివిధ పరిశ్రమల ప్రతినిధులు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్లాంట్లు అలాగే కొనసాగుతాయని వారు అంటున్నారు. ఇక్కడి ప్లాంట్లను మూసివేసి మరోచోటుకు తరలించే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. కొత్త ప్లాంట్లు మాత్రం సీమాంధ్రతోసహా వివిధ రాష్ట్రాల్లో స్థాపిస్తామని చెబుతున్నారు. మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపారంపై కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్టీ) మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎస్టీ మినహాయిస్తే తెలంగాణ నుంచి ప్లాంట్లు తరలిపోవని మరీ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాపార అవకాశాలపై వివిధ అభిప్రాయాలను పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేశారు. అవి..పన్ను మినహాయిస్తే.. తెలంగాణ, సీమాంధ్ర మధ్య జరిగే వ్యాపారంపై 2 శాతం సీఎస్టీని వ్యాపారులు చెల్లించాల్సి వస్తోంది. ఈ అంశమే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. 2-3 శాతం మార్జిన్లతో వ్యాపారాలు చేస్తున్నాం. అలాంటప్పుడు సీఎస్టీకే 2% పోతే ఎలా అని అంటున్నారు ఈటా బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేస్తున్న కిషోర్‌సన్స్ డిటర్జెంట్స్ ఎండీ గౌతమ్ చంద్ జైన్. ‘మా వ్యాపారంలో 80 శాతం వాటా సీమాంధ్ర నుంచే. ప్లాంటేమో తెలంగాణలో ఉంది. మాలాంటి కంపెనీలు ఇక్కడ చాలా ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఫార్మా కంపెనీలు పన్ను ప్రయోజనాలు అందుకోవడానికి ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు వెళ్లాయి. ఇదే మాదిరిగా ఇప్పుడు సీమాంధ్రకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది’ అని గుర్తు చేశారు. 5 ఏళ్లపాటు ఇరు రాష్ట్రాల మధ్య సీఎస్టీ లేకుండా చేయాలన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ మాదిరిగా పన్ను ప్రయోజనాలు ఇస్తే ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లింగ్ ప్లాంటు పెడతామని సెల్కాన్ సీఎండీ వై.గురు పేర్కొన్నారు. పారిశ్రామికవాడలైతేనే...: విద్యాలయాలు, సేవా రంగంలో ఉన్న కంపెనీలు ఎంత ధరైనా స్థలానికి వెచ్చిస్తాయి. తయారీ కంపెనీలు అలా చేయలేవు. నిరంతరం ముడిపదార్థాలను కొనుగోలు చేయాలి. అటు పోటీ ఉంటుంది కాబట్టి లాభాలను కుదించుకుని తక్కువ ధరకు ఉత్పత్తులను విక్రయించాలి. ఈ పరిస్థితుల్లో స్థలానికే అధిక వ్యయం చేయలేవని సుధాకర్ పైప్స్ ఎండీ ఎం.జయదేవ్ తెలిపారు. రాజధాని మా జిల్లాలో అంటే మా జిల్లాలో అంటూ ప్రచారం జరగడంతో సీమాంధ్రలో స్థలాల ధరలు ఊహించనంతగా ఆకాశాన్నంటాయని వివరించారు. పారిశ్రామిక వాడలే ఇందుకు పరిష్కారమని చెప్పారు. చిన్న కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో స్థలం కొనే అవకాశాలే లేవని తెలిపారు. ఇటువంటి కంపెనీలకు తక్కువ ధరకు భూములను అద్దెకు ఇవ్వాలని కోరారు. అందుబాటు ధరలో స్థలం, ఒకే దరఖాస్తుకు అన్ని అనుమతులు, నిరంతర విద్యుత్, కార్మికులకు నివాస గృహాలు, మంచి రోడ్లు ఇవీ సగటు పారిశ్రామికవేత్తల డిమాండ్లని పేర్కొన్నారు. ఇక అమ్మకం పన్ను, విద్యుత్ చార్జీల్లో సబ్సిడీ మొత్తాల విషయంలో రీయింబర్స్మెంట్ విధానాన్ని తీసేయాలని, నేరుగా ప్రయాజనం కల్పించాలని ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్, నయాస్ట్రాప్ ఎండీ వెన్నం అనిల్‌రెడ్డి కోరారు. వ్యాపారావకాశాలు.. ముడి పదార్థాల లభ్యత, మౌలిక వసతుల కల్పన, వ్యాపార అవకాశాలు.. ఈ మూడు అంశాలే పారిశ్రామికవేత్తలకు అత్యంత ప్రధానమైనవని ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రుంగ్టా గ్లాస్ ఎండీ శివ్‌కుమార్ రుంగ్టా పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలు ప్రకటించబోయే పారిశ్రామిక విధానాల కోసం వ్యాపారవేత్తలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వెలుపల, ఇతర ప్రాంతాల్లో పారిశ్రామికవాడల ఏర్పాటు, అలాగే పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక సీమాంధ్రలో కొత్త వ్యాపార అవకాశాలు ఉత్పన్నమవుతాయి కాబట్టి విస్తరణకు అక్కడికి వెళ్లేందుకు పారిశ్రామికవేత్తలు చూస్తున్నారని వివరించారు. రూ.2,500 కోట్ల పెట్టుబడి.. ప్లాస్టిక్ కంపెనీలు హైదరాబాద్ సమీపంలో ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేయాలని చాలా ఏళ్లు శ్రమించాయి. అది సాధ్యం కాలేదు. ఇప్పుడు అన్ని వసతులతో సీమాంధ్రలో పార్కు ఏర్పాటైతే వెళ్లేందుకు దాదాపు 1,000 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ చెబుతోంది. పార్కులో రెండేళ్లలో రూ.2,500 కోట్ల పెట్టుబడి ఖాయమని అసోసియేషన్ అంటోంది. కొత్త అవకాశాలు అందుకోవడానికైనా కంపెనీలు సీమాంధ్రలో విస్తరిస్తాయని అసోసియేషన్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్‌రెడ్డి చెప్పారు. కాగా, సుధాకర్ పైప్స్ రూ.100 కోట్లతో 30 ఎకరాల్లో కేబుల్స్ తయారీ ప్లాంటు పెట్టాలని భావిస్తోంది. గుజరాత్ లేదా సీమాంధ్రలో ఇది రానుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభించనుంది. రుంగ్టా గ్లాస్ రూ.20 కోట్లతో నిర్మాణ రంగానికి అవసరమయ్యే గ్లాస్, ల్యామినేటెడ్ గ్లాస్ ఉత్పత్తుల తయారీ యూనిట్ పెట్టనుంది. కిషోర్‌సన్స్ రోజుకు 300 టన్నుల సామర్థ్యం గల తయారీ యూనిట్ ఏర్పాటుకు యోచిస్తోంది. రూ.10 కోట్లదాకా వ్యయం చేయనుంది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీకై నయాస్ట్రాప్ రూ.10 కోట్లతో ప్లాంటు స్థాపించే పనిలో ఉంది. దాదాపు 60 ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మొత్తం రూ.1,200 కోట్ల దాకా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం. -
జూన్ 2 నుంచి సీఎస్టీ పిడుగు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటే వ్యాపార లావాదేవీలపై పన్ను సాక్షి, హైదరాబాద్: మరో పదిరోజుల్లో అపాయింటెడ్ డే జూన్ 2. ఆ రోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అధికారికంగా అవతరించబోతున్నాయి. అదే సమయంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పేరు మీద సాగిన వాణిజ్య, వ్యాపారాలు కూడా రెండు రాష్ట్రాల్లో సాగబోతున్నాయి. ప్రస్తుతం రెండు ప్రాంతాల్లోని చిరు వ్యాపారులను మొదలుకొని బడా పారిశ్రామిక వేత్తల వరకు ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఇదే. ఇప్పటి వరకు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ మొదలైన రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కు ఉన్న వ్యాపార సంబంధాలే... ఇక ముందు ఆంధ్రప్రదేశ్- తెలంగాణల మధ్య ఉండబోతున్నాయనే ఆలోచనే వ్యాపార, వాణిజ్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణ, సీమాంధ్ర సరిహద్దులు దాటే ఏ వస్తువు కైనా 2 శాతం సీఎస్టీ(కేంద్ర అమ్మకపు పన్ను) చెల్లించాల్సిన పరిస్థితి రావడమే అందుకు కారణం. సరిహద్దులు దాటే ప్రతిసరకుపైనా 2 శాతం సీఎస్టీ వసూలు చేసేవిధంగా వాణిజ్యపన్నుల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జూన్ 2వ తేదీ నుంచే ఇది అమలులోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది. మారిన టిన్ కోడ్... ఉత్పత్తి సంస్థలు మొదలుకొని వ్యాపారులు, ఎగుమతి,దిగుమతి దారులు, డీలర్లకు ‘టిన్’ తప్పనిసరి. టాక్స్‌పేయర్ ఐడెంటిఫికేషన్ నంబర్‌గా పిలిచే 11 అంకెల ఈ టిన్‌లో మొదటి రెండు అంకెలు ఆయా రాష్ట్రాల కోడ్‌గా ఉంటాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ టిన్ కోడ్ 28. రాష్ట్రం రెండుగా విడిపోతున్నందున వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికే రెండు రాష్ట్రాలకు వేర్వేరు కోడ్లు ఏర్పాటు చేసింది. తెలంగాణ టిన్ కోడ్ 36 కాగా, ఆంధ్రప్రదేశ్ కోడ్ 37. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా టిన్ మార్పు కోసం దరఖాస్తులను వాణిజ్య పన్నులశాఖ ఇప్పటికే ఆహ్వానించగా, చాలా వరకు అప్‌గ్రేడ్ అయ్యాయి. జూన్ 2 నుంచి ఇవే అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఒకే రాష్ట్రం కోణంలో లావాదేవీలు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రాంతాలుగా అప్పట్లో ప్రభుత్వం హైదరాబాద్ పరిసర ప్రాంతాలను గుర్తించింది. దీంతో సమైక్య రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు ఉత్పత్తి సంస్థలను మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పరిధుల్లో ఎక్కువగా ఏర్పాటు చేశారు. గోడౌన్లను సీమాంధ్ర ప్రాంతంలో నెలకొల్పి అక్కడి నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేవారు. 23 జిల్లాలుగా ఉన్న రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా సీఎస్టీ, వే బిల్లులతో అవసరం ఉండేది కాదు. సీ ఫారాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి కర్నూలు కేంద్రంగా వ్యాపారం సాగించే పారిశ్రామిక వేత్తలు సైతం ఈ రెండు ప్రాంతాలకు మధ్య ఉన్న 8 కిలోమీటర్ల దూరంలో రాకపోకలకు 2 శాతం సీఎస్టీ చెల్లించాల్సిందే. బీడీ నుంచి బీరు వరకు లిక్కర్ వ్యాపారంలో కీలకమైన బీరు తయారు చేసే బ్రూవరేజెస్ హైదరాబాద్ చుట్టుపక్కలే ఆరు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతినెలా 10 లక్షల కేసుల బీర్లు సీమాంధ్రకు రవాణా అవుతున్నాయి. సీఎస్టీ అమలులోకి వస్తే ఒక్కో బీరుకేసు మీద 2 శాతం చొప్పున రూ. 15.60 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 10 లక్షల కేసులకు రూ. 1.56 కోట్లు సీఎస్టీ గా చెల్లించాల్సిన పరిస్థితి. అయితే ఈ మొత్తాన్ని బ్రూవరేజెస్ సంస్థలు ఎందుకు చెల్లిస్తాయన్నదే ప్రశ్న. అలాగే డిస్టిలరీస్ కంపెనీలు రెండు రాష్ట్రాల్లో చెరో 15 చొప్పున ఉన్న నేపథ్యంలో వీటి ఎగుమతి దిగుమతి కూడా తప్పనిసరి. డిస్టిలరీస్ విషయంలో ఒక్కో కేసు(పెట్టె)కు ఏకంగా రూ. 18 చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని ఏపీబీసీఎల్‌కు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. మార్జిన్ తక్కువగా ఉండే బ్రెడ్, బిస్కెట్ల తయారీకి ఉపయోగించే మైదా, గోధుమ పిండి ఉత్పత్తులకు సంబంధించి సీఎస్టీ వసూలు చేస్తే అనేక చిన్న కంపెనీలు మూసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మిర్చి, పత్తి వంటి ఉత్పత్తులు నల్గొండ, రంగారెడ్డి వంటి జిల్లాల నుంచి గుంటూరు మిరప మార్కెట్‌కు ప్రతిఏటా పెద్ద ఎత్తున తరలివెళ్తాయి. జూన్ 2 తరువాత ఈ అమ్మకాలపై కూడా సీఎస్టీ వసూలు చేస్తే రైతులకు మిగిలేదేంటన్నదే ప్రశ్న. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉన్న బీడీల తయారీదార్ల నుంచి సేకరించే బీడీలను వివిధ పేర్లతో వ్యాపారులు అన్ని జిల్లాలకు తరలిస్తారు. ఇప్పుడు ఈ జిల్లాల్లో తయారయ్యే బీడీలు సీమాంధ్ర జిల్లాలకు వెళ్లాలంటే 2 శాతం సీఎస్టీ చెల్లించాలి. బహుళ జాతి కంపెనీలు కాకుండా హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి అయి 23 జిల్లాల్లో మార్కెటింగ్ జరిగే సిగరెట్లు, చుట్టలు, ఇతర నిత్యావసర ఉత్పత్తులపై కూడా ఇదే రీతిన పన్ను వసూలు చేయడం జరుగుతుందని వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. వినియోగదారులపై అదనపు భారం..? రెండు రాష్ట్రాల మధ్య పన్ను వసూళ్లు మొదలైతే ఆ భారం చివరికి వినియోగదారుడిపైనే పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ కంపెనీ అయినా, వ్యాపారైనా తాను నష్టంతో కూడిన వ్యాపారం చేయడు కాబట్టి... సర్కారుకు చెల్లించే సీఎస్టీని వినియోగదారుడి నుంచే వసూలు చేసే అవకాశం ఉంది. తద్వారా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్ని ఉత్పత్తులకు రెక్కలు వస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. జీఎస్టీ వచ్చే వరకు ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలి ఒకే రాష్ట్రం యూనిట్‌గా ఇప్పటి వరకు ఉత్పత్తి, మార్కెటింగ్, ఎగుమతి, దిగుమతులు జరిగాయి. ఇప్పుడు అకస్మాత్తుగా రాష్ట్రం రెండుగా విడిపోతోంది. సీఎస్టీ అమలులోకి వస్తే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయాన్ని ఫ్యాప్సీ తరపున ప్రభుత్వానికి తెలియజేశాం. దేశ వ్యాప్తంగా జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) త్వరలోనే వస్తుందంటున్నారు. అది వస్తే సీఎస్టీ ఉండదు. జీఎస్టీ వచ్చే వరకు రెండు రాష్ట్రాల్లో పాత విధానాన్నే అమలు చేయాలి. - శివ్‌కుమార్ రుంగ్టా, ఫ్యాప్సీ సీనియర్ ఉపాధ్యక్షుడు -
సీఎస్టీ స్టేషన్లో వైఫై సేవలు
సాక్షి, ముంబై: చరిత్రాత్మక ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)లో ప్రయాణికులకు రైల్వే అధికారులు కొత్త సంవత్సర కానుక ప్రకటించారు. వినియోగదారుల సౌకర్యార్థం వైఫై (వైర్లెస్ ఫిడిలిటీ) సేవలు అందుబాటులోకి తేనున్నారు. మరో రెండు నెలల తరువాతే ప్రయాణికులు ఈ స్టేషన్లో వైఫై సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే మొదటి 20 నిమిషాలపాటు వైఫై సేవలను ప్రయాణికులకు ఉచితంగా అందించేందుకు రైల్వే అధికారులు యోచిస్తున్నారు. తదనంతరం ఈ సేవలకు చార్జీ వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై సెంట్రల్ రైల్వే అధికారులు టెలికం కంపెనీలతో గత కొన్ని నెలలుగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. వైఫై సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పుడు ప్రయాణికులకు ఉచితంగానే అందివ్వాలని రైల్వే అధికారులు భావించారు. అయితే ఈ ప్రయోగం చాలా ఖరీదుతో కూడుకున్నది కావడంతో మొదటి 20 నిమిషాలపాటు ప్రయాణికులకు ఉచితంగా అందజేసి, ఆ తర్వాత చార్జీలు వసూలు చేయాల్సిందిగా టెలికం కంపెనీలు రైల్వే అధికారులకు సూచించాయి. ఇదిలా వుండగా వైఫై సేవలు ప్రారంభించిన మూడునెలల పాటు ప్రయాణికులకు ఉచితంగానే సేవలను అందించేందుకు ప్రయత్నించామని టెలికం కంపెనీల అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకున్న 20 నిమిషాల తర్వాత చార్జీ వసూలు చేస్తామని వారు పేర్కొన్నారు. దీనివల్ల తాము 20 శాతం ఆదాయాన్ని పొందుతామని సెంట్రల్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎస్టీ రైల్వే స్టేషన్లో రోజుకు అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అందుకే వారి సౌకర్యార్థం వైఫై సేవలను అందజేసేందుకు సెంట్రల్ రైల్వే నిర్ణయించిందన్నారు. ఈ సేవలు అందుబాటులోకి రావడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతోందని చెప్పారు. నగర శివారు ప్రాంతాల నుంచే కాకుండా ఇతర నగరాలకు వెళ్లే ప్రయాణికులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్ (ఎమ్మార్వీసీ) ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. సీఎస్టీ నుంచి రోజుకు 6.36 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. స్థానికులే కాకుండా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇక్కడికి వస్తుంటారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే రైళ్ల ట్రాకింగ్, రైళ్లు ఆలస్యంగా వచ్చే సమాచారం, షెడ్యూల్ తదితర వివరాలను ప్రయాణికులు మొబైల్ఫోన్లు, ట్యాబ్లెట్ల ద్వారా సులువుగా తెలుసుకునే వీలు ఉంటుంది. ఇదిలా వుండగా వైఫై సేవలకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో అతుల్ రాణే తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే కళ్యాణ్, ఠాణే, డోంబివలి తదితర ముఖ్య రైల్వే స్టేషన్లలోనూ వైఫై సేవలను అందిస్తామని వెల్లడించారు. -
సీఎస్టీకి కొత్త సొబగులు
సాక్షి ముంబై: ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) రైల్వే స్టేషన్‌ను మరింత కాంతివంతంగా తీర్చిదిద్దనున్నారు. ‘ప్రపంచ వారసత్వ కట్టడం’ (వరల్డ్ హెరిటేజ్ హౌస్) హోదా లభించిన ఈ స్టేషన్‌ను ప్రత్యేక విద్యుత్‌కాంతులతో మరింత ఆకర్షణీయంగా మార్చాలని సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఈ పనుల కోసం రూ.నాలుగు కోట్లకుపైగా ఖర్చు చేయనున్నారు. మరింత ప్రకాశించే ఎల్ఈడీ విద్యుత్ దీపాలు స్టేషన్లో అమర్చుతామని సెంట్రల్ రైల్వే పీఆర్వో ఏ.కే.సింగ్ తెలిపారు. సీఎస్టీ నిర్మాణ పనులను 1878లో ప్రారంభించి పదేళ్ల తర్వాత పనులను పూర్తి చేశారు. సీఎస్టీ ఏర్పడి ప్రస్తుతం 125 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. నగరంలో మొట్టమొదటి రైలు కదిలింది ఈ స్టేషన్లోనే. కాలక్రమేణా ఈ స్టేషన్‌ను మరింత అభివృద్ధిపర్చారు. దీంతో ఈ నిర్మాణం అనేక మంది దృష్టిలోకి రావడం మొదలయింది. 2004 జూలై రెండున ‘యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్’ దీనిని ప్రపంచ వారసత్వ కట్టడాల (వరల్డ్ హెరిటేజ్ హౌస్) జాబితాలో చేర్చింది. ఈ సీఎస్టీ నిర్మాణ విశిష్టతను సందర్శించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దీంతో సీఎస్టీ పర్యాటక ప్రాంతంగా మారింది. అయితే పురాతన ప్రదేశమైన సీఎస్టీని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని రైల్వే శాఖ యోచించింది. ఈ మేరకు సీఎస్టీని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలని నిర్ణయించింది. స్టేషన్ లోపలా, బయటా వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్టేషన్ విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ పనుల కోసం రూ.4,37,51,723 ఖర్చు చేయనుంది. డిసెంబర్ 10 వరకు టెండర్లు ఆహ్వానిస్తామని సింగ్ వివరించారు. ప్రస్తుతం ఉన్న కొన్ని విద్యుత్ దీపాలను తర్వాత తీసివేస్తారని, వాటి స్థానంలో కొత్త దీపాలను అమర్చుతారని ఆయన తెలిపారు. -
మిల్లర్లకు సర్కారు దాసోహం!
సాక్షి, హైదరాబాద్: బియ్యం మిల్లర్లకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం, తద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని మిల్లర్లు ఇతర రాష్ట్రాల్లో విక్రయించే బియ్యంపై వసూలు చేసే రెండు శాతం కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్టీ)ను రద్దు చే సే యోచనలో ఉంది. ఈ మేరకు ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేయగా.. పౌరసరఫరాల శాఖ సంబంధిత ఫైలును ఆర్థిక శాఖ పరిశీలనకు పంపింది. ఆర్థిక శాఖ పరిశీలన పూర్తి కాగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధమైందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్రలో ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తుంటే.. సందట్లో సడేమియాలా ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు పెద్ద ఎత్తున లబ్ది చేకూర్చే నిర్ణయాలకు సిద్ధమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు కూడా ప్రయోజనం చేకూర్చడమే ఇలాంటి నిర్ణయాల పరమార్థమని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మన రాష్ట్ర మిల్లర్లు ఇతర రాష్ట్రాల్లో బియ్యం విక్రయించాలంటే వాణిజ్య పన్నుల శాఖకు రెండు శాతం సీఎస్టీ చెల్లించి విక్రయించే బియ్యం పరిమాణం ఎంతో తెలిపే ‘సి’ ఫార్మ్ పొందాలి. అయితే ఈ విధంగా సీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని, అలాగే ‘సి’ ఫార్మ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసింది! కేవలం లారీ, రైల్వే, ట్రక్కు లోడింగ్ సర్టిఫికెట్లు సరిపోతాయని పేర్కొంది. అంటే మిల్లర్లు తమ ఇష్టానుసారం ఇతర రాష్ట్రాల్లో బియ్యం విక్రయించుకునేందుకు వీలుగా మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసిందన్నమాట. 2011 జనవరి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు అంటే 2014 మార్చి వరకు ఈ వెసులుబాటు కల్పించాలని కూడా ఉప సంఘం సూచించింది. ఈ సిఫారసు అమలైతే రాష్ట్ర ఖజానాకు రూ.327 కోట్ల నష్టం వాటిల్లుతుంది. అంటే ఆ మేరకు మిల్లర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. గతంలోనూ సీఎస్టీ రద్దు చేసిన సీఎం! 2007 ఏప్రిల్ నుంచి 2010 డిసెంబర్ వరకు ఇతర రాష్ట్రాల్లో మిల్లర్లు విక్రయించిన బియ్యంపై సీఎస్టీని రద్దు చేస్తూ 2011లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఉప సంఘం పేర్కొంది. అదే తరహాలో ఇప్పుడు కూడా సీఎస్టీని రద్దు చేయాలని సూచించింది. గతంలో ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే కనీసం ఫైలు కూడా ఆర్థిక శాఖకు వెళ్లకుండానే సీఎం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ నిర్ణయం వల్ల ఖజానాకు రూ.52 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ రూ. 52 కోట్ల సీఎస్టీ రద్దుకు సంబంధించి రెవెన్యూ శాఖ అంతర్గతంగా మెమో జారీ చేసి సరిపుచ్చింది. అయితే ఆ మెమోలో ‘సి’ ఫార్మ్ మినహాయింపు, సీఎస్టీ రద్దు 2010 డిసెంబర్ వరకే పరిమితమని, 2011 జనవరి నుంచి సీఎస్టీ చెల్లించాలని, ‘సి’ ఫార్మ్ తప్పనిసరని అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. అయితే 2011 తర్వాత కూడా సీఎస్టీ రద్దుకు తాజాగా మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసింది.