సీఎస్టీ-పన్వేల్ ఫాస్ట్ కారిడార్‌కు యత్నాలు
సాక్షి, ముంబై : కొద్ది సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన ‘ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)-పన్వేల్ ఫాస్ట్ కారిడార్’ ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు అమలుపై రైల్వే పరిపాలన విభాగం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలు వేగవంతమయ్యాయి. ప్రాజక్టుకు రూ. 11 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాజెక్టు పూర్తయేనాటికి వ్యయం రూ.13-14 వేల కోట్లకు చేరుతుందని నిపుణులు అంటున్నారు. ప్రాజెక్టులో పెట్టుబడులపై రెండు విభాగాలు చర్చించినట్లు సమాచారం. సీఎస్టీ-పన్వేల్ మధ్య లోకల్ రైలులో ప్రయాణానికి ప్రస్తుతం 80 నిమిషాల సమయం పడుతోంది.
కాగా, ఫాస్ట్ కారిడార్ వినియోగంలోకి వస్తే 45 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. మొత్తం పది స్టేషన్లు ఉండే ఈ ప్రాజెక్టు పనులను ఐదేళ్లలో పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. గంటకు 110 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లను ప్రతి ఐదు నిమిషాలకు ఒకటి నడపనున్నారు. ప్రతి బోగీలో 350 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ప్రాజెక్టు ప్రత్యక్షంగా వినియోగంలోకి వస్తే రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు సాగించే వారి సంఖ్య 20 శాతానికి పైగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
ప్రయాణికుల రద్దీ తగ్గించడానికే..
కాగా, సీఎస్టీ-పన్వేల్ హార్బర్ మార్గంలో అప్,డౌన్ రైలు మార్గాలు ఉన్నందున ఫాస్ట్ రైళ్లు నడిపే అవకాశం లేదు. ప్రస్తుతం సెంట్రల్ మార్గంలో సీఎస్టీ నుంచి కల్యాణ్ వరకు పశ్చిమ రైల్వే మార్గంలో చర్చిగేట్ నుంచి విరార్ వరకు నాలుగు రైల్వే లేన్లు ఉన్నాయి. వీటిలో రెండు స్లో, రెండు ఫాస్ట్ మార్గాలున్నాయి. హార్బర్ మార్గంలో రెండు రైల్వే లేన్లు మాత్రమే ఉండటంతో ఫాస్ట్ లోకల్ రైళ్లు నడపడం సాధ్యమవడంలేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో లోకల్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ రైళ్లు నడిపితే ప్రయాణికులకు రద్దీ తగ్గుతుందని రైల్వే భావించింది. దీంతో ఫాస్ట్ కారిడార్ ప్రాజెక్టు తెరమీదకు తెచ్చింది. అయితే ప్రాజెక్టుకు రైల్వే బోర్డు నుంచి అధికారికంగా అనుమతి లభించలేదు. మంజూరు కోసం ప్రయత్నాలు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.