railway administration
-
సీఎస్టీ-పన్వేల్ ఫాస్ట్ కారిడార్‌కు యత్నాలు
సాక్షి, ముంబై : కొద్ది సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన ‘ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)-పన్వేల్ ఫాస్ట్ కారిడార్’ ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు అమలుపై రైల్వే పరిపాలన విభాగం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలు వేగవంతమయ్యాయి. ప్రాజక్టుకు రూ. 11 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాజెక్టు పూర్తయేనాటికి వ్యయం రూ.13-14 వేల కోట్లకు చేరుతుందని నిపుణులు అంటున్నారు. ప్రాజెక్టులో పెట్టుబడులపై రెండు విభాగాలు చర్చించినట్లు సమాచారం. సీఎస్టీ-పన్వేల్ మధ్య లోకల్ రైలులో ప్రయాణానికి ప్రస్తుతం 80 నిమిషాల సమయం పడుతోంది. కాగా, ఫాస్ట్ కారిడార్ వినియోగంలోకి వస్తే 45 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. మొత్తం పది స్టేషన్లు ఉండే ఈ ప్రాజెక్టు పనులను ఐదేళ్లలో పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. గంటకు 110 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లను ప్రతి ఐదు నిమిషాలకు ఒకటి నడపనున్నారు. ప్రతి బోగీలో 350 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ప్రాజెక్టు ప్రత్యక్షంగా వినియోగంలోకి వస్తే రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు సాగించే వారి సంఖ్య 20 శాతానికి పైగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీ తగ్గించడానికే.. కాగా, సీఎస్టీ-పన్వేల్ హార్బర్ మార్గంలో అప్,డౌన్ రైలు మార్గాలు ఉన్నందున ఫాస్ట్ రైళ్లు నడిపే అవకాశం లేదు. ప్రస్తుతం సెంట్రల్ మార్గంలో సీఎస్టీ నుంచి కల్యాణ్ వరకు పశ్చిమ రైల్వే మార్గంలో చర్చిగేట్ నుంచి విరార్ వరకు నాలుగు రైల్వే లేన్లు ఉన్నాయి. వీటిలో రెండు స్లో, రెండు ఫాస్ట్ మార్గాలున్నాయి. హార్బర్ మార్గంలో రెండు రైల్వే లేన్లు మాత్రమే ఉండటంతో ఫాస్ట్ లోకల్ రైళ్లు నడపడం సాధ్యమవడంలేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో లోకల్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ రైళ్లు నడిపితే ప్రయాణికులకు రద్దీ తగ్గుతుందని రైల్వే భావించింది. దీంతో ఫాస్ట్ కారిడార్ ప్రాజెక్టు తెరమీదకు తెచ్చింది. అయితే ప్రాజెక్టుకు రైల్వే బోర్డు నుంచి అధికారికంగా అనుమతి లభించలేదు. మంజూరు కోసం ప్రయత్నాలు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. -
ఆగిన రైళ్లు
* ఆలస్యంపై ఆగ్రహం * ప్రయాణికుల రాస్తారోకో * రెండు గంటలు సేవల ఆటంకం సాక్షి, చెన్నై: రైల్వే యంత్రాంగంపై ప్రయాణికులు శుక్రవారం కన్నెర్ర చేశారు. ఎలక్ట్రిక్ రైలు ఆలస్యంగా నడుస్తుండడంపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రైల్ రోకోకు దిగడంతో రెండు గంటలు రైలు సేవలకు తీవ్ర ఆటంకం ఎదురైంది. సెంట్రల్ నుంచి తిరువళ్లూరు, గుమ్మిడిపూండి మార్గంలో నిత్యం రైళ్లు పరుగులు తీస్తుంటాయి. గుమ్మిడి పూండి మార్గంలో నడిచే ఎలక్ట్రిక్ రైళ్లకు సిగ్నల్ లభించడంలో ఇబ్బందులు తప్పవు. ప్రధానంగా బేషిన్ బ్రిడ్జి దాటాలంటే సమయం అంతా వృథాకాక తప్పదు. ఈ పరిస్థితుల్లో పొన్నేరి నుంచి సెంట్రల్‌కు ఉదయం ఎలక్ట్రిక్ రైలు బయలుదేరింది. ఈ రైలు నిర్ణీత సమయం 8.40 గంటలకు సెంట్రల్ చేరుకోవాల్సి ఉంది. ఈ రైలు నత్తనడకన సాగుతుండడంతో, అన్ని స్టేషన్లలో నిర్ణీత సమయం కంటే, ఎక్కువ సమయం ఆగుతూ రావడం ప్రయాణికుల్లో తీవ్ర అసహనాన్ని రేపింది. బే షిన్ బ్రిడ్జి వద్ద ఈ రైలుకు సిగ్నల్ లభించ లేదు. దీంతో గంట పాటుగా రైల్లోనే కూర్చోవాల్సి వచ్చింది. కూతవేటు దూరానికి గంట సేపు వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైల్‌రోకోతో సేవల ఆటంకం : తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు మరో ట్రాక్ మీదకు చేరుకున్నారు. అటు వైపుగా వచ్చే రైళ్లను అడ్డుకుంటూ రైల్ రోకోకు దిగారు. దీంతో తిరువళ్లూరు మార్గంలో వెళ్లాల్సిన రైళ్ల సేవలకు ఆటంకం ఏర్పడింది. అటు తిరువళ్లూరు, ఇటు గుమ్మిడిపూండి మార్గంలో రైలు సేవలు దాదాపుగా ఆగాయి. ఎక్కడి రైళ్లు అక్కడే నిలిపి వేయాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నారు. కొందరు ప్రయాణికులు అయితే, తమ సమయం వృథా అవుతుండడంతో ట్రాక్ వెంబడి నడుచుకుంటూ పరుగున సెంట్రల్‌కు చేరుకున్నారు. మరికొందరు ప్రయాణికులు సమీపంలోని రోడ్డు మీదకు చేరుకుని ఆటోల్ని ఆశ్రయించి తమ గమ్యస్థానాలకు పరుగులు తీశారు. బుజ్జగింపు : బేషిన్ బ్రిడ్జి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న పోలీసులు, అధికారులు ప్రయాణికుల్ని బుజ్జగించే యత్నం చేశారు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న కొందరు ప్రయాణికులు వారిపై తిరగబడే యత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎక్కడిక్కడ రైళ్లు ఆగడంతో ఆయా స్టేషన్లలో ప్రయాణికులు గంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు ప్రయాణికుల్ని బుజ్జగించేందుకు రైల్వే అధికారులు నానా తంటాలు పడ్డారు. ప్రతి రోజూ ఈ రైలు ఆలస్యంగా నడుస్తుండడం వల్లే తాము కార్యాలయాలకు ఆల స్యంగా వెళ్లాల్సి వస్తున్నదంటూ కొందరు ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆ రైలును త్వరితగతిన సెంట్రల్‌కు పం పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక మీదట పొన్నేరి - సెంట్రల్ మధ్య ఉదయం 7.15 గంటలకు బయలుదేరే ఈ రైలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ప్రయాణికులు శాంతించారు. ఈ తతంగం పూర్తి అయ్యేందుకు రెండు గంటలు పట్టడంతో ఇతర మార్గాల్లోని రైళ్లు ఆలస్యంగా నడవాల్సి వచ్చింది. -
కదంతొక్కిన రైల్వే కార్మికులు
డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఎస్ఆర్ఎంయూ నేతృత్వంలో రైల్వే ఉద్యోగ కార్మికులు కదంతొక్కారు. శుక్రవారం విధుల్ని బహిష్కరించి నిరసనకు దిగారు. దీంతో ప్రయాణికులకు తంటాలు తప్పలేదు. ఈఎంయూ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కౌంటర్లలో సిబ్బంది లేక రిజర్వేషన్లకు ఆటంకాలు ఏర్పడ్డాయి. తత్కాల్ టికెట్లు దొరక్క ఇబ్బందులు తలెత్తాయి. - విధులు బహిష్కరించి నిరసన - ప్రయాణికులకు తంటాలు - రిజర్వేషన్లకు ఆటంకం - సమ్మెతప్పదని హెచ్చరిక సాక్షి, చెన్నై: గత ప్రభుత్వ, రైల్వే యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగ కార్మికులు అష్టకష్టాలకు గురికావాల్సి వ స్తోందంటూ రైల్వే కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతూ వస్తున్నాయి. ఏడో వేతన కమిషన్ అమలు, నెలసరి వేతనంలో డీఏ చేర్పులో జరుగుతున్న జాప్యం, వీఆర్ఎస్ తీసుకునే సిబ్బంది వారసులకు విద్యార్హత ఆధారంగా ఉద్యోగ కల్పన, పెన్షన్ విధానంలోఎన్పీఎస్ను రద్దుచేసి జీపీఎస్‌ను అమలు, ఆర్ఆర్బీ, ఆర్‌ఆర్‌సీలో రైల్వే ఉద్యోగులకు 20 శాతం సీట్లు కేటాయింపు, రైల్వేలో ఖాళీలన్నింటనీ భర్తీ చేయాలి, సీసీఎల్‌ను ఎఫ్‌సీఎల్‌గా మార్చాలి, మహిళా ఉద్యోగులకు కల్పిస్తున్న ఫ్లక్సి సమయాన్ని అందరికీ వర్తింపచేయాలన్న 36 రకాల డిమాండ్లును రైల్వే యంత్రాంగం ముందు ఉంచినా, స్పందనలేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం సైతం గత ప్రభుత్వ బాటలో పయనిస్తుండడంతో రైల్వే కార్మిక సంఘాలు తీవ్ర అసహనానికి గురయ్యాయి. అలాగే, రైల్వేలోకి విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతుండడంతో ఉద్యోగ, కార్మికుల్లో ఆందోళన నెలకొంది. దీంతో శుక్రవారం దక్షిణ రైల్వే పరిధిలో ఆందోళనలకు ఎస్ఆర్ఎంయూ పిలుపు నిచ్చింది.పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. కదం తొక్కిన కార్మికులు దక్షిణ రైల్వే మజ్దూర్ యూనియన్(ఎస్ఆర్ఎంయూ) నేతృత్వంలో తిరుచ్చి, మదురై, సేలం, చెన్నైలలో భారీ ఆందోళనలకు పిలుపు నిచ్చారు. రైల్వే ఉద్యోగ, కార్మికులు ఉదయం విధుల్ని బహిష్కరించి ఆందోళనలకు దిగారు. చెన్నైలో దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం వద్ద, పెరంబూరు లోకో వద్ద ఆందోళనలు జరిగాయి. దక్షిణ రైల్వే కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో ఎస్ఆర్ఎంయూ ప్రధాన కార్యదర్శి కే.కన్నయ్య పాల్గొన్నారు. డిమాండ్లను హోరెత్తించారు. కేంద్రం తీరును దుయ్యబట్టారు. రైల్వే యంత్రాంగం వ్యవహరిస్తున్న విధానాలు, నిర్ణయాల్ని తప్పుబట్టారు. ఈ సారి సమ్మె చేపట్టాల్సి వస్తుందన్న హెచ్చరించారు. నవంబర్‌లో జరిగి ఏఐఆర్ఎఫ్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ప్రయాణికులకు తంటాలు రైల్వే ఉద్యోగ కార్మిక నిరసన ప్రయాణికులకు శాపంగా మారింది. దక్షిణ రైల్వేలో అత్యధికంగా ఉద్యోగ, కార్మికులు మజ్దూర్ యూనియన్‌కు చెందిన వారే. ఉదయాన్నే విధుల్ని బహిష్కరించి నిరసన బాటకు వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక చోట్ల రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో, అన్ రిజర్వుడ్ టికెట్లు ఇచ్చే ప్రాంతాల్లో, ఈఎంయూ రైళ్ల టికెట్లు ఇచ్చే ప్రాంతాల్లో సిబ్బంది సంఖ్య తగ్గింది. ఇతర సంఘాల సిబ్బంది నామమాత్రంగా ఉన్నా, అన్ని పనులు నత్తనడకన సాగాయి. ఉదయం తత్కల్ టికెట్ల కోసం వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. క్యూలో నిలబడ్డ వారికి తత్కల్ టికెట్లు అంతంతమాత్రమే లభించాయి. అప్పటికే ఇంటర్నెట్ ద్వారా టికెట్లను ట్రావెల్స్ సెంటర్లు కొట్టేశాయి. శబరిమలై సీజన్ ఆరంభం కాబోతుండటంతో, 60 రోజులకు ముందుగా అనగా శుక్రవారం కేరళ మీదుగా వెళ్లే రైళ్ల రిజర్వేషన్ ఆరంభమైంది. సిబ్బంది కొరత క్యూలో ఉన్న వాళ్లకు సీట్లు దక్కనీయకుండా చేసి, చివరకు వెయిటింగ్ లిస్టులతో వెను దిరగాల్సిన పరిస్థితి. అలాగే ఈఎంయూ రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది.