కదంతొక్కిన రైల్వే కార్మికులు
డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఎస్‌ఆర్‌ఎంయూ నేతృత్వంలో రైల్వే ఉద్యోగ కార్మికులు కదంతొక్కారు. శుక్రవారం విధుల్ని బహిష్కరించి నిరసనకు దిగారు. దీంతో ప్రయాణికులకు తంటాలు తప్పలేదు. ఈఎంయూ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కౌంటర్లలో సిబ్బంది లేక రిజర్వేషన్లకు ఆటంకాలు ఏర్పడ్డాయి. తత్కాల్ టికెట్లు దొరక్క ఇబ్బందులు తలెత్తాయి.
- విధులు బహిష్కరించి నిరసన
- ప్రయాణికులకు తంటాలు
- రిజర్వేషన్లకు ఆటంకం
- సమ్మెతప్పదని హెచ్చరిక
సాక్షి, చెన్నై: గత ప్రభుత్వ, రైల్వే యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగ కార్మికులు అష్టకష్టాలకు గురికావాల్సి వ స్తోందంటూ రైల్వే కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతూ వస్తున్నాయి. ఏడో వేతన కమిషన్ అమలు, నెలసరి వేతనంలో డీఏ చేర్పులో జరుగుతున్న జాప్యం, వీఆర్‌ఎస్ తీసుకునే సిబ్బంది వారసులకు విద్యార్హత ఆధారంగా ఉద్యోగ కల్పన, పెన్షన్ విధానంలోఎన్‌పీఎస్‌ను రద్దుచేసి జీపీఎస్‌ను అమలు, ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీలో రైల్వే ఉద్యోగులకు 20 శాతం సీట్లు కేటాయింపు, రైల్వేలో ఖాళీలన్నింటనీ భర్తీ చేయాలి, సీసీఎల్‌ను ఎఫ్‌సీఎల్‌గా మార్చాలి, మహిళా ఉద్యోగులకు కల్పిస్తున్న ఫ్లక్సి సమయాన్ని అందరికీ వర్తింపచేయాలన్న 36 రకాల డిమాండ్లును రైల్వే యంత్రాంగం ముందు ఉంచినా, స్పందనలేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం సైతం గత ప్రభుత్వ బాటలో పయనిస్తుండడంతో రైల్వే కార్మిక సంఘాలు తీవ్ర అసహనానికి గురయ్యాయి. అలాగే, రైల్వేలోకి విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతుండడంతో ఉద్యోగ, కార్మికుల్లో ఆందోళన నెలకొంది. దీంతో శుక్రవారం దక్షిణ రైల్వే పరిధిలో ఆందోళనలకు ఎస్‌ఆర్‌ఎంయూ పిలుపు నిచ్చింది.పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు.
కదం తొక్కిన కార్మికులు
దక్షిణ రైల్వే మజ్దూర్ యూనియన్(ఎస్‌ఆర్‌ఎంయూ) నేతృత్వంలో తిరుచ్చి, మదురై, సేలం, చెన్నైలలో భారీ ఆందోళనలకు పిలుపు నిచ్చారు. రైల్వే ఉద్యోగ, కార్మికులు ఉదయం విధుల్ని బహిష్కరించి ఆందోళనలకు దిగారు. చెన్నైలో దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం వద్ద, పెరంబూరు లోకో వద్ద ఆందోళనలు జరిగాయి. దక్షిణ రైల్వే కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో ఎస్‌ఆర్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి కే.కన్నయ్య పాల్గొన్నారు. డిమాండ్లను హోరెత్తించారు. కేంద్రం తీరును దుయ్యబట్టారు. రైల్వే యంత్రాంగం వ్యవహరిస్తున్న విధానాలు, నిర్ణయాల్ని తప్పుబట్టారు. ఈ సారి సమ్మె చేపట్టాల్సి వస్తుందన్న హెచ్చరించారు. నవంబర్‌లో జరిగి ఏఐఆర్‌ఎఫ్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.
ప్రయాణికులకు తంటాలు
రైల్వే ఉద్యోగ కార్మిక నిరసన ప్రయాణికులకు శాపంగా మారింది. దక్షిణ రైల్వేలో అత్యధికంగా ఉద్యోగ, కార్మికులు మజ్దూర్ యూనియన్‌కు చెందిన వారే. ఉదయాన్నే విధుల్ని బహిష్కరించి నిరసన బాటకు వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక చోట్ల రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో, అన్ రిజర్వుడ్ టికెట్లు ఇచ్చే ప్రాంతాల్లో, ఈఎంయూ రైళ్ల టికెట్లు ఇచ్చే ప్రాంతాల్లో సిబ్బంది సంఖ్య తగ్గింది. ఇతర సంఘాల సిబ్బంది నామమాత్రంగా ఉన్నా, అన్ని పనులు నత్తనడకన సాగాయి.
ఉదయం తత్కల్ టికెట్ల కోసం వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. క్యూలో నిలబడ్డ వారికి తత్కల్ టికెట్లు అంతంతమాత్రమే లభించాయి. అప్పటికే ఇంటర్నెట్ ద్వారా టికెట్లను ట్రావెల్స్ సెంటర్లు కొట్టేశాయి. శబరిమలై సీజన్ ఆరంభం కాబోతుండటంతో, 60 రోజులకు ముందుగా అనగా శుక్రవారం కేరళ మీదుగా వెళ్లే రైళ్ల రిజర్వేషన్ ఆరంభమైంది. సిబ్బంది కొరత క్యూలో ఉన్న వాళ్లకు సీట్లు దక్కనీయకుండా చేసి, చివరకు వెయిటింగ్ లిస్టులతో వెను దిరగాల్సిన పరిస్థితి. అలాగే ఈఎంయూ రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది.