Tatkal tickets
-
ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ టికెట్స్‌పై ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం
IRCTC Tatkal Tickets.. సాక్షి, అమరావతి: ఈ–టికెట్ల బుకింగ్ విధానంలో సమూల మార్పులు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రధానంగా తత్కాల్ టికెట్లలో బల్క్ బుకింగ్‌ల పేరిట సాగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. దీనిపై సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో కలసి రూపొందించిన నివేదికను రైల్వే శాఖకు ఐఆర్సీటీసీ సమర్పించింది. రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఐఆర్సీటీసీ పోర్టల్‌లో సమూల సంస్కరణలు తీసుకువస్తూ.. అప్‌గ్రేడ్ చేయనున్నారు. దారి మళ్లుతున్న 35 శాతం తత్కాల్ టికెట్లు.. రైల్వే శాఖ ఈ–టికెటింగ్ విధానంలో ప్రవేశపెట్టిన తత్కాల్ టికెట్లను కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఫేక్ ఐడీలతో అక్రమంగా బల్క్ బుకింగ్ చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ నియమించిన గ్రాంట్ థాంటన్ కన్సల్టెన్సీ నివేదికలో వెల్లడైంది. తత్కాల్ కోటాలోని దాదాపు 35 శాతం టికెట్లు ఇలా దారిమళ్లుతున్నట్టు తేలింది. దీంతో బల్క్ బుకింగ్‌ల దందాకు అడ్డుకట్ట వేయాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఇందుకోసం ఈ–టికెటింగ్ పోర్టల్‌లో సంస్కరణలు తీసుకువచ్చి అప్‌గ్రేడ్ చేయనుంది. అలాగే ఈ–టికెట్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఐఆర్సీటీసీ పోర్టల్ సామర్థ్యాన్ని కూడా పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2021 డిసెంబర్ నాటి గణాంకాల ప్రకారం 80.5 శాతం రైల్వే టికెట్లు ఈ–టికెటింగ్ విధానంలోనే బుక్ చేస్తున్నారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్లలోని కౌంటర్ల వద్ద కంటే ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా మూడు రెట్లు అధికంగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఐఆర్సీటీసీ పోర్టల్‌లో ఇప్పటివరకు 10 కోట్ల మంది నమోదు చేసుకోగా.. వారిలో 7.50 కోట్ల మంది ఈ–టికెట్ల కొనుగోలులో క్రియాశీలకంగా ఉంటున్నారు. 2014లో అప్‌గ్రేడ్ చేసిన ఐఆర్సీటీసీ పోర్టల్‌కు సగటున నిమిషానికి 28 వేల లావాదేవీలు సాగించే సామర్థ్యముంది. కానీ గత ఎనిమిదేళ్లలో డిమాండ్ అమాంతం పెరిగింది. దీనికి తగ్గట్టుగా సేవలు అందించేందుకు పోర్టల్ సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే పోర్టల్‌సామర్థ్యాన్ని కూడా పెంచాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. నిమిషానికి 40 వేల వరకు లావాదేవీలు సాగించే సామర్థ్యంతో పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ఏడాది నవంబర్ కల్లా అప్‌గ్రేడ్ చేసిన పోర్టల్ సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని ఐఆర్సీటీసీ వర్గాలు తెలిపాయి. ఇది కూడా చదవండి: AP: హెచ్ఆర్సీ ఆదేశాలపై హైకోర్టు విస్మయం -
తత్కాల్..గోల్మాల్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): తత్కాల్లో ఒక్క టికెట్ బుక్ చేయాలంటేనే తలప్రాణం తోకకొస్తుంది. ఒక ఐపీ అడ్రస్ నుంచి నెలకు 5 కొనాలనే నిబంధన ఉంది. అయితే ఐఆర్సీటీసీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను, లొసుగులను గమనించిన ఓ ముఠా.. నకిలీ సాఫ్ట్వేర్ ఏఎన్‌ఎంఎస్‌ను రూపొందించి తత్కాల్ బుకింగ్ సమయంలో కొన్ని వందల టికెట్లు బుక్ చేస్తోంది. కన్ఫర్మ్ టికెట్లు బుక్ చేసినందుకు గానూ ప్రయాణికుల నుంచి డిమాండ్‌ను బట్టి ఒక్కో టికెట్‌కు రూ. 200 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తోంది. ఈ ముఠా దందా ఇలా సాగుతుంటే సాధారణ ప్రయాణికులు మాత్రం.. ఒక్క టికెట్ కూడా బుక్ చేయలేక నానాతంటాలు పడుతున్నారు. దీనిపై ఫిర్యాదులందుకున్న రైల్వే భద్రతా దళం నిత్యం తనిఖీలు నిర్వహిస్తోంది. నకిలీ సాఫ్ట్‌వేర్‌తో ప్రయాణికులను మోసగిస్తున్న ఏజెంట్లను అరెస్ట్ చేస్తోంది. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు ఏదో ఓ చోట వెలుగు చూస్తూనే.. ఉన్నాయి. మూడు నెలలుగా విస్తృత దాడులు •అక్టోబర్ 26న ఆరీ్పఎఫ్ సిబ్బంది అల్లిపురంలోని అయ్యప్ప ఇంటర్నెట్ సెంటర్‌పై దాడి చేసి, నిర్వాహకుడు తవిటి నాయుడును అరెస్ట్ చేశారు. అలాగే గాజువాకలోని ఐ ఫ్రెండ్స్ నెట్ సెంటర్, అగనంపూడిలోని ఫ్రెండ్స్ డాట్ కామ్ ఇంటర్నెట్ అండ్ మీసేవ, చినముషిడివాడలోని ఓంకార్ ఆన్లైన్ సర్వీసెస్, అరసవల్లిలోని శ్రీనివాస మల్టీమీడియా, పార్వతీపురంలోని స్టార్ ఇంటర్నెట్ అండ్ జిరాక్స్, మర్రిపాలెంలోని స్పేస్ సిటీ ఇంటర్నెట్ సరీ్వసెస్‌లో దాడులు చేశారు. ఈ కేంద్రాల నిర్వాహకుల నుంచి రూ.3,36,680 విలువ చేసే 198 ఇ–టికెట్లను స్వా«దీనం చేసుకున్నారు. •నవంబర్ 3వ తేదీన విజయనగరంలోని మీ సేవ కేంద్రం, చీపురుపల్లిలోని ఏ టు జెడ్ ఆన్లైన్ సరీ్వస్, సబ్బవరంలోని గ్రేస్ ఇంటర్నెట్ అండ్ డీటీపీ, గోపాలపట్నంలోని విశ్వాస్ ఇంటర్నెట్ కేఫ్ అండ్ ట్రావెల్స్‌పై దాడులు చేశారు. ఈ కేంద్రాల నిర్వాహకులను అరెస్ట్ చేసి, వీరి నుంచి రూ. 2.26 లక్షల విలువ చేసే 195 ఇ–టికెట్లను స్వాదీనం చేసుకున్నారు. •నవంబర్ 28న శ్రీకాకుళంలోని ఎస్.ఎస్.ట్రావెల్స్, జగదీష్ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఎస్.ఎస్.ట్రావెల్స్( కళింగ రోడ్ జంక్షన్), అయ్యప్ప ట్రావెల్స్‌పై దాడులు చేసి, నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 3,57,599 విలువ చేసే 203 ఇ–టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. •ఈ నెల 10వ తేదీన జరిపిన దాడుల్లో నకిలీ సాఫ్ట్వేర్ గుట్టును రట్టు చేశారు. దువ్వాడలోని ఎస్పీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌పై దాడులు చేసి 582 ఇ–టికెట్లు స్వా«దీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11.31 లక్షలు ఉంటుంది. అలాగే తాటిచెట్లపాలెంలో యు.దుర్గారావును అరెస్ట్ చేసి, అతని నుంచి రూ.3.52 లక్షల విలువ చేసే 129 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించిన ఆర్ఫీఎఫ్ ఆర్ఫీఎఫ్ ఇన్స్పెక్టర్లు పి.ఎస్.రావు, ఆర్.కె.రావులు ఈ నెల 10న దువ్వాడలోని ఎస్పీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌పై జరిపిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నకిలీ ఏఎన్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌తో ఐఆర్సీటీసీ ఇ–టికెట్ పోర్టల్‌ను హ్యాక్ చేసి తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నట్టు గుర్తించారు. కేంద్రం నిర్వాహకుడు సమీర్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని.. రూ.11.31 లక్షలు విలువ చేసే 582 ఇ–టికెట్లను స్వా«దీనం చేసుకున్నారు. గడిచిన మూడు నెలల కాలంలో ఆర్పీఎఫ్ సిబ్బంది పలు ప్రాంతాల్లో దాడులు చేసి రూ.లక్షల విలువైన టికెట్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు స్వా«దీనం చేసుకున్నారు. 17 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో డిసెంబర్ 10న అరెస్టయిన సమీర్‌కుమార్ ప్రధాన సూత్రధారుడిగా గుర్తించారు. అతను పరవాడలోని ఫార్మా కంపెనీలో పనిచేస్తూ.. దువ్వాడలో ఎస్పీ టూర్ అండ్ ట్రావెల్స్‌ను నిర్వహిస్తున్నాడు. అతని నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఐఆర్‌సీటీ సీయే కారణమా? ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వ్యాపార విస్తరణలో భాగంగా నగరాల్లో ప్రిన్సిపాల్ సరీ్వస్ ప్రొవైడర్స్(పీఎస్పీ)కు కాంట్రాక్ట్ ఇస్తోంది. ఈ పీఎస్పీలు ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా టికెట్లు అమ్మకాలు సాగిస్తుంటారు. ఈ ప్రక్రియ అంతా తత్కాల్ విడుదలైన కేవలం15 నిమిషాల్లో ముగుస్తుంది. అందుకే ఆ సమయంలో సాధారణ ప్రయాణికులు తమ ఫోన్ల నుంచి గానీ, కంప్యూటర్ల నుంచి టికెట్లు బుక్ చేసుకుందామంటే అవకాశం ఉండడం లేదు. ఏ యాప్ నుంచి కూడా ఈ 15 నిమిషాలు వ్యక్తిగత యూజర్ ఐడీలు ఉన్న వారికి టికెట్లు లభించవు. కారణం వారంతా ఆ సమయంలో ఐఆర్సీటీసీ సైట్‌ను తమ స్వా«దీనంలో ఉంచుకుంటారు. తీరా 15 నిమిషాలు అయ్యే సరికి తత్కాల్ టికెట్లన్నీ అయిపోతాయి. వాస్తవానికి రైల్వే టికెట్లు బుక్ చేయాలంటే ఆ శాఖ నుంచి ఆ«దీకృత అనుమతి పొంది ఉండాలి. కానీ ఈ పీఎస్పీలు వీరికి అటువంటి అనుమతుల్లేకుండానే వ్యక్తిగత యూజర్ ఐడీలతో అకౌంట్లు సృష్టిస్తుంటారు. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ యూజర్ ఐడీలతో వేగంగా వీరు తత్కాల్ టికెట్లు బుక్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రయాణికులు తమ అవసరాలు తీరేందుకు వేరే దారి లేక ఇటువంటి వారిని ఆశ్రయిస్తున్నారు. ఒక టికెట్‌కు డిమాండ్‌ను బట్టి రూ.200 నుంచి రూ. 1000 వరకు కూడా సమర్పించుకుంటున్నారు. పండగ వేళల్లో, రద్దీ సమయాల్లో అనధికార ఏజెంట్లు భారీ మొత్తంలో ప్రయాణికుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. ఈ దందాకు ఓ రకంగా ఐఆర్సీటీసీ కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా.. నకిలీల ఆటకట్టించేందుకు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ జితేంద్ర శ్రీ వాస్తవ నడుంబిగించారు. తమ సిబ్బందితో తరచూ దాడులు చేయిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు జరుగుతున్నాయి. నకిలీ సాఫ్ట్వేర్ ఏఎన్‌ఎంఎస్‌ను అభివృద్ధి చేసిన వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. దీని వెనుక పెద్ద ముఠానే ఉందని, త్వరలోనే వీరిని అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. -
స్మార్ట్ దోపిడీ
సాక్షి, సిటీబ్యూరో: తత్కాల్ టికెట్ల కృత్రిమ కొరతను సృష్టించి ప్రయాణికులపై పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్న ఏజెంట్లు, దళారులు బుకింగ్ విషయంలో సరికొత్తగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఓవైపు ప్రయాణికులను దోచుకుంటూ... మరోవైపు ఐఆర్సీటీసీకి, రైల్వే ఆదాయానికి గండి కొడుతున్నారు. ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లలో సాధారణ ప్రయాణికులకున్న వెసులుబాటును అవకాశంగా తీసుకొని వందలకొద్దీ నకిలీ ఐడీలను, పాస్‌వర్డులను సృష్టించి దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్లు సైతం రూపొందించారు. ఈ మొబైల్ యాప్‌ల ద్వారానే క్షణాల్లో వందల కొద్దీ టికెట్లు బుక్ చేస్తున్నారు. తత్కాల్ టికెట్ల కోసం క్యూలైన్లో పడిగాపులు కాయాల్సిన పని లేకుండా, ఆన్లైన్ బుకింగ్‌ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా యాప్‌ల ద్వారా దళారుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఐఆర్సీటీసీ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సమయం కంటే తక్కువ సమయంలో.. కేవలం ఒకట్రెండు సెకన్ల వ్యధిలోనే యాప్ ద్వారా బుక్ చేయడంతో దళారులకు నిర్ధారిత టికెట్లు (కన్ఫర్మ్) లభిస్తున్నాయి. గ్రేటర్లో ఈ తరహా యాప్ ఆధారిత అక్రమ బుకింగ్ దందా పెద్ద ఎత్తున సాగుతున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, విజిలెన్స్ విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చేపడుతున్న చర్యలను సైతం ఏజెంట్లు, దళారులు టెక్నాలజీ సహాయంతో ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ఆర్పీఎఫ్కు సవాల్‌గా మారారు. వ్యవస్థీకృతంగా దోపిడీ... దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులలో 60 శాతానికి పైగా మంది ఐఆర్సీటీసీ ఆన్లైన్లోనే రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇందుకోసం ఎక్కువ మంది ఏజెంట్లను, దళారులను ఆశ్రయిస్తున్నారు. ఐఆర్సీటీసీ లెక్కల ప్రకారం సుమారు 6వేల మంది ఏజెంట్లు నమోదై ఉన్నారు. కానీ అంతకు రెట్టింపు సంఖ్యలో దళారులు రాజ్యమేలుతున్నారు. ఆన్లైన్ బుకింగ్‌లలో 80శాతం వారి గుప్పిట్లోనే ఉన్నాయి. నగరంలోని కూకట్పల్లి, మియాపూర్, సైనిక్‌పురి, ఈసీఐఎల్, మంగళ్‌హట్, జీడిమెట్ల, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్ తదితర అన్ని ప్రాంతాల్లో ఏజెంట్ల వ్యవస్థ విస్తరించుకొని ఉంది. ఈ ఏజెంట్లు ప్రయాణికుల అవసరాలను పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. తత్కాల్ చార్జీలపైన రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పండుగలు, ప్రత్యేక సెలవు దినాల్లో దోపిడీ మరింత తీవ్రంగా ఉంటుంది. ఇందుకోసం కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. రూ.1,000 తత్కాల్ టికెట్‌ను రూ.1,500 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తున్నారు. రద్దీ సమయాల్లో ఇది రూ.3,000 వరకు కూడా చేరుకుంటోంది. హైదరాబాద్ నుంచి విశాఖ, భువనేశ్వర్, బెంగళూర్, తిరుపతి, ముంబై, ఢిల్లీ, పట్నా, కోల్‌కతా తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఎమర్జెన్సీ.. ఏజెంట్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. సైబర్ నేరగాళ్లే సృష్టికర్తలు... ఇటీవల మంగళ్‌హట్‌కు చెందిన ఒక ఏజెంట్‌ను ఆర్ఫీఎఫ్ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద లభించిన నకిలీ ఐడీలు, ఆధార్ పత్రాలు, మొబైల్ యాప్‌లు చూసి పోలీసులే విస్తుపోయారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో అమాయక ప్రజల వద్ద నుంచి సేకరించిన ఆధార్ పత్రాల ఆధారంగా ఏజెంట్లు వందల కొద్దీ ఈ–మెయిల్ ఐడీలను సృష్టిస్తున్నారు. ఈ ఆధార్ పత్రాలను రూ.2వేలకు 10 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సాధారణ ప్రయాణికుల్లా టికెట్లు బుక్ చేసుకునేందుకు ఈ ఆధార్లు, మెయిల్ ఐడీలు దోహదం చేస్తున్నట్లు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారి అశ్వినీకుమార్ ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు ఐఆర్సీటీసీ ఆన్లైన్ బుకింగ్‌ల కోసం ఆ సంస్థ అధికారిక వెబ్సైట్ నుంచి కాకుండా మొబైల్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకోవడం వల్ల ఏజెంట్లను గుర్తించి పట్టుకోవడం సమస్యగా మారుతోంది. సైబర్ నేరగాళ్లు పదుల సంఖ్యలో యాప్‌లను సృష్టించి ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. వీఎన్ఎక్స్, రెడ్‌మిక్స్, ఏఎన్ఎంఎస్ వంటి యాప్‌లు రిజర్వేషన్ బుకింగ్‌ల కోసం వినియోగిస్తున్నారు. ఈ మొబైల్ యాప్‌లలోనే ప్రయాణికుల పేర్లు, ఆధార్ నంబర్, మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతా తదితర వివరాలను తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ముందు రోజే నమోదు చేస్తారు. టిక్కెట్ బుక్ చేయాల్సిన రోజున సరిగ్గా ఉదయం 10గంటలకు ఒకే ఒక్క క్లిక్‌తో ఐఆర్సీటీసీ పేమెంట్ గేట్‌వేకు సమాచారాన్ని చేరవేసి డబ్బులు చెల్లించేస్తున్నారు. తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన కొద్ది సెకన్లలోనే ఈ పని పూర్తవుతుంది. పేమెంట్ గేట్‌వే నుంచి సమాచారం ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్)కు చేరుతుంది. పీఆర్ఎస్ ద్వారా వెంటనే టికెట్లు వచ్చేస్తాయి. నిర్ధారిత టికెట్లు ఏజెంట్ల వద్ద మాత్రమే లభిస్తాయనే నమ్మకంతో ప్రయాణికులు సైతం వారినే ఆశ్రయిస్తున్నారు. నిజాయతీగా క్యూలైన్లలో నించున్నవాళ్లు, ఆన్లైన్లో బుకింగ్‌ల కోసం ఎదురు చూసేవాళ్లు మాత్రం దారుణంగా నష్టపోతున్నారు. -
తత్కాల్ బుకింగ్‌కు కొత్త రూల్స్...
సాక్షి, ముంబై : ప్రయాణికుల సౌలభ్యార్థం భారతీయ రైల్వే అనేక చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ కోసం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. ఐఆర్టీసీ లెక్కల ప్రకారం ప్రతిరోజు 13 లక్షలమంది తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నట్లు తెలిసింది. నూతనంగా ప్రవేశపెట్టనున్న తత్కాల్ నిబంధనల వల్ల టిక్కెట్ రిజర్వేషన్ విధానం మరింత బలోపేతం చేయడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. అమల్లోకి రానున్న కొత్త తత్కాల్ రూల్స్... 1 ఇక మీదట ఒక యూజర్‌ఐడీ మీద నెలలో కేవలం 6 టికెట్లను మాత్రమే బుక్ చేసుకునే వీలుంది. ఆధార్ కార్డు ఉపయోగించి టికెట్లు బుక్ చేసుకునే వారు 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు అది కూడా కేవలం ఉదయం 8 - 10 గంటల మధ్య మాత్రమే బుక్ చేసుకునేందుకు వీలుంది. 2 రిజిస్టర్డ్ యూజర్స్ కోసం రూపొందించిన సింగిల్ పేజ్/ క్విక్ బుక్ సేవలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అందుబాటులో ఉండబోవని తెలిపింది. అలానే ఒక్క యూజర్‌కి ఒక్క లాంగ్ ఇన్ సెషన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. యూజర్ లాగిన్ అయ్యే సమయంలోనే ప్రయాణికుడి వివరాలు, పేమెంట్ పేజీలతో పాటు క్యాప్చా కూడా అందుబాటులో ఉండనుంది. 3. ఇక నుంచి మరింత భద్రత కల్పించడం కోసం అప్లికేషన్‌ను పూర్తిగా నింపిన తర్వాత ప్రయాణికుల వ్యక్తిగతమైన ప్రశ్నలు అంటే యూజర్ పేరు, ఫోన్ నంబరు లాంటి ప్రశ్నలు అడగనున్నారు. 4 . ఏజెంట్లు మొదటి 30 నిమిషాలు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వీలు లేదు. 5. ఇక మీదట తత్కాల్ టికెట్ల బుకింగ్‌కి కూడా నిర్ణీత సమయాన్ని కేటాయించనున్నారు. కొత్త రూల్సు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుని పూర్తి వివరాలను అప్లికేషన్లో నింపిన తర్వాత క్యాప్చా కోసం కేవలం 25 సెకన్లు, పెమెంట్ పేజీలో క్యాప్చా కోసం 5 సెకన్ల సమయాన్ని మాత్రమే ఇవ్వనున్నారు. 6. పేమెంట్ చేయడం కోసం ఇక నుంచి 10 సెకన్ల సమయాన్ని మాత్రమే ఇవ్వనున్నారు. చెల్లింపుల సమయంలో ఓటీపీ తప్పనిసరి. 7. ఆన్లైన్లో ఏసీ కోచ్‌లలో బెర్తులు బుక్ చేసుకోవాలనుకునే వారు ఉదయం 10 గంటల ప్రాంతంలో, స్లీపర్ క్లాస్‌లో బెర్తులు బుక్ చేసుకోవాలనుకునేవారు ఉదయం 11 గంటల సమయంలో బుక్ చేసుకోవాలి. 8. రైలు నిర్ధేశించిన సమయం కన్నా 3 గంటలు ఆలస్యంగా బయలుదేరినట్లయితే పూర్తి రైలు చార్జీలు, తత్కాల్ చార్జీలు ప్రయాణికునికి చెల్లిస్తారు. 9. రైళ్ల మార్గాలు మళ్లించినా, ప్రయాణికులు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నా, వారికి పూర్తి రుసుము చెల్లించనున్నారు. 10. ఫస్ట్ క్లాసులో టికెట్ బుక్ చేసుకుని సెకండ్ క్లాస్ లేదా జనరల్లోకి టిక్కెట్‌ను మార్చుకుంటే చార్జీల మధ్య ఉన్న తేడాను ప్రయాణికుడికి తిరిగి చెల్లిస్తారు. -
తత్కాల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: తత్కాల్ ప్రయాణికులకు రైల్వేశాఖ గురువారం శుభవార్త తెలిపింది. తత్కాల్ కింద బుక్‌చేసుకున్న టికెట్లపై 100 శాతం రీఫండ్‌ను అందించనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఈ–టికెట్లతో పాటు కౌంటర్లో తీసుకున్న టికెట్లకు కూడా రీఫండ్ వర్తిస్తుందని పేర్కొంది. కింద పేర్కొన్న ఐదు సందర్భాల్లో టికెట్ ధర మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామంది. 1) ఒకవేళ రైలు రాక మూడు గంటలు అంతకన్నా ఎక్కువ ఆలస్యమైనప్పుడు. 2) రైలును దారి మళ్లించినప్పుడు. 3) రైలును దారి మళ్లించిన తర్వాత ప్రయాణికులు ట్రైన్ ఎక్కాల్సిన స్టేషన్ లేదా దిగాల్సిన స్టేషన్ లేదా రెండూ కొత్త మార్గంలో లేకపోతే. 4) ప్రయాణికులు ఎక్కాల్సిన కోచ్‌ను రైలుకు అనుసంధానించకపోతే, అధికారులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయం కల్పించనప్పుడు. 5) రైలులో రిజర్వేషన్ చేసుకున్నదానికి బదులుగా లోయర్ క్లాస్‌లో ప్రయాణించేందుకు ప్రజలు ఇష్టపడకపోతే (ఒకవేళ ప్రయాణికులు ఇందుకు అంగీకరిస్తే రెండు టికెట్లకు మధ్య ఉన్న తేడాను రైల్వేశాఖ ఆ ప్రయాణికుడికి చెల్లిస్తుంది). -
‘తత్కాల్’ సాఫ్ట్వేర్లపై సీబీఐ దృష్టి
న్యూఢిల్లీ: అక్రమ సాఫ్ట్‌వేర్‌తో రైల్వే తత్కాల్ టికెట్ల కుంభకోణానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ తరహా సాఫ్ట్వేర్లపై సీబీఐ దృష్టి సారించింది. సీబీఐలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తూ ‘నియో’ పేరిట అక్రమ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన అజయ్ గార్గ్ అనే వ్యక్తిని ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాఫ్ట్వేర్లతో పీఎన్ఆర్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఒకేసారి పలు యూజర్ ఐడీలతో పెద్దమొత్తంలో టికెట్లు పొందే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆటో ఫిల్ విధానంలో ఈ సాఫ్ట్వేర్లు పనిచేయడంతో తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రారంభానికి ముందే ఏజెంట్లు టికెట్లను పొందుతున్నారని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాళ్ తెలిపారు. ఈ తరహా సాఫ్ట్వేర్లపై దృష్టి సారించామని, ఎవరైనా తప్పుచేశారని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం అక్రమ సాఫ్ట్వేర్ వినియోగించడం నేరమని, సాఫ్ట్వేర్ల ద్వారా పొందిన టికెట్లను ఏజెంట్లు అధిక ధరకు విక్ర యిస్తూ పెద్దమొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారని వెల్లడించారు. -
తత్కాల్ రైల్వే ప్రయాణికులకు తీపికబురు...
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. తత్కాల్ రైల్వే టికెట్లు బుక్ చేసుకునే వారికి నిజంగా ఇది తీపి కబురే. అవును....ఇపుడు తత్కాల్ టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి సొమ్ము నష్టపోతామనే భయం లేదు. దాదాపు సగం సొమ్ము తిరిగి మన ఖాతాలో చేరుతుంది. ఇప్పటి వరకు తత్కాల్ సేవ ద్వారా బుక్ చేసుకున్న రైల్వే టికెట్‌ను క్యాన్సిల్ చేసుకునే ప్రయాణికులకు ఒక్కపైసా కూడా వెనక్కి వచ్చేది కాదు. కానీ ఇక ముందు తత్కాల్ టికెట్ కాన్సిల్ చేసుకుంటే దాదాపు 50 శాతం డబ్బులు తిరిగి రానున్నాయి. ఈ మేరకు భారతీయ రైల్వేస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే తత్కాల్ టికెట్లు బుకింగ్ వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మారిన కొత్త షెడ్యూల్ ప్రకారం ఏసీ క్లాస్ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు , నాన్ ఏసీ టికెట్లను ఉదయం 11 -12 గంటల మధ్య బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. దీంతో పాటు బాగా రద్దీ ఉండే కొన్ని రూట్లలో ప్రత్యేక తత్కాల్ రైళ్లను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో రైల్వే శాఖ ఉన్నట్టు సమాచారం. మరోవైపు తత్కాల్ స్పెషల్ రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యాన్ని 10 రోజుల నుంచి రెండు నెలల లోపు(60 రోజులు) బుక్ చేసుకునే వీలుగా నిబంధనలు సవరించినట్టు సమాచారం. -
7 ప్రధాన రైళ్లలో ప్రీమియం తత్కాల్ టిక్కెట్లు
హైదరాబాద్ : దసరా, దీపావళి పండుగల రద్దీ దృష్ట్యా నేటి నుంచి ఏడు ప్రధాన రైళ్లలో ప్రీమియం తత్కాల్ టిక్కెట్లు ....ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే తత్కాల్ టిక్కెట్లలోని 50 శాతం టికెట్లు ప్రీమియం తాత్కాల్కు బదిలీ చేసింది. దీంతో బెర్త్‌లు తగ్గే కొద్దీ చార్జీలు పెరగనున్నాయి. ఫలక్‌నుమా, పాట్నా, ఏపీ, బెంగళూరు, గోదావరి, దర్శన్, శబరి ఎక్స్ప్రెస్ల్లో ఈ ప్రీమియం తత్కాల్ టిక్కెట్లు లభ్యం కానున్నాయి. డైనమిక్ ఫెయిర్ స్ట్రక్చర్ కింద టిక్కెట్లను విక్రయించనున్నారు. దాంతో డిమాండ్‌ను బట్టి టికెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించనుంది. ఇక ఈ-టిక్కెటింగ్లో నేటి వరకూ మాత్రమే ప్రీమియం తత్కాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. -
కదంతొక్కిన రైల్వే కార్మికులు
డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఎస్ఆర్ఎంయూ నేతృత్వంలో రైల్వే ఉద్యోగ కార్మికులు కదంతొక్కారు. శుక్రవారం విధుల్ని బహిష్కరించి నిరసనకు దిగారు. దీంతో ప్రయాణికులకు తంటాలు తప్పలేదు. ఈఎంయూ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కౌంటర్లలో సిబ్బంది లేక రిజర్వేషన్లకు ఆటంకాలు ఏర్పడ్డాయి. తత్కాల్ టికెట్లు దొరక్క ఇబ్బందులు తలెత్తాయి. - విధులు బహిష్కరించి నిరసన - ప్రయాణికులకు తంటాలు - రిజర్వేషన్లకు ఆటంకం - సమ్మెతప్పదని హెచ్చరిక సాక్షి, చెన్నై: గత ప్రభుత్వ, రైల్వే యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగ కార్మికులు అష్టకష్టాలకు గురికావాల్సి వ స్తోందంటూ రైల్వే కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతూ వస్తున్నాయి. ఏడో వేతన కమిషన్ అమలు, నెలసరి వేతనంలో డీఏ చేర్పులో జరుగుతున్న జాప్యం, వీఆర్ఎస్ తీసుకునే సిబ్బంది వారసులకు విద్యార్హత ఆధారంగా ఉద్యోగ కల్పన, పెన్షన్ విధానంలోఎన్పీఎస్ను రద్దుచేసి జీపీఎస్‌ను అమలు, ఆర్ఆర్బీ, ఆర్‌ఆర్‌సీలో రైల్వే ఉద్యోగులకు 20 శాతం సీట్లు కేటాయింపు, రైల్వేలో ఖాళీలన్నింటనీ భర్తీ చేయాలి, సీసీఎల్‌ను ఎఫ్‌సీఎల్‌గా మార్చాలి, మహిళా ఉద్యోగులకు కల్పిస్తున్న ఫ్లక్సి సమయాన్ని అందరికీ వర్తింపచేయాలన్న 36 రకాల డిమాండ్లును రైల్వే యంత్రాంగం ముందు ఉంచినా, స్పందనలేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం సైతం గత ప్రభుత్వ బాటలో పయనిస్తుండడంతో రైల్వే కార్మిక సంఘాలు తీవ్ర అసహనానికి గురయ్యాయి. అలాగే, రైల్వేలోకి విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతుండడంతో ఉద్యోగ, కార్మికుల్లో ఆందోళన నెలకొంది. దీంతో శుక్రవారం దక్షిణ రైల్వే పరిధిలో ఆందోళనలకు ఎస్ఆర్ఎంయూ పిలుపు నిచ్చింది.పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. కదం తొక్కిన కార్మికులు దక్షిణ రైల్వే మజ్దూర్ యూనియన్(ఎస్ఆర్ఎంయూ) నేతృత్వంలో తిరుచ్చి, మదురై, సేలం, చెన్నైలలో భారీ ఆందోళనలకు పిలుపు నిచ్చారు. రైల్వే ఉద్యోగ, కార్మికులు ఉదయం విధుల్ని బహిష్కరించి ఆందోళనలకు దిగారు. చెన్నైలో దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం వద్ద, పెరంబూరు లోకో వద్ద ఆందోళనలు జరిగాయి. దక్షిణ రైల్వే కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో ఎస్ఆర్ఎంయూ ప్రధాన కార్యదర్శి కే.కన్నయ్య పాల్గొన్నారు. డిమాండ్లను హోరెత్తించారు. కేంద్రం తీరును దుయ్యబట్టారు. రైల్వే యంత్రాంగం వ్యవహరిస్తున్న విధానాలు, నిర్ణయాల్ని తప్పుబట్టారు. ఈ సారి సమ్మె చేపట్టాల్సి వస్తుందన్న హెచ్చరించారు. నవంబర్‌లో జరిగి ఏఐఆర్ఎఫ్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ప్రయాణికులకు తంటాలు రైల్వే ఉద్యోగ కార్మిక నిరసన ప్రయాణికులకు శాపంగా మారింది. దక్షిణ రైల్వేలో అత్యధికంగా ఉద్యోగ, కార్మికులు మజ్దూర్ యూనియన్‌కు చెందిన వారే. ఉదయాన్నే విధుల్ని బహిష్కరించి నిరసన బాటకు వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక చోట్ల రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో, అన్ రిజర్వుడ్ టికెట్లు ఇచ్చే ప్రాంతాల్లో, ఈఎంయూ రైళ్ల టికెట్లు ఇచ్చే ప్రాంతాల్లో సిబ్బంది సంఖ్య తగ్గింది. ఇతర సంఘాల సిబ్బంది నామమాత్రంగా ఉన్నా, అన్ని పనులు నత్తనడకన సాగాయి. ఉదయం తత్కల్ టికెట్ల కోసం వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. క్యూలో నిలబడ్డ వారికి తత్కల్ టికెట్లు అంతంతమాత్రమే లభించాయి. అప్పటికే ఇంటర్నెట్ ద్వారా టికెట్లను ట్రావెల్స్ సెంటర్లు కొట్టేశాయి. శబరిమలై సీజన్ ఆరంభం కాబోతుండటంతో, 60 రోజులకు ముందుగా అనగా శుక్రవారం కేరళ మీదుగా వెళ్లే రైళ్ల రిజర్వేషన్ ఆరంభమైంది. సిబ్బంది కొరత క్యూలో ఉన్న వాళ్లకు సీట్లు దక్కనీయకుండా చేసి, చివరకు వెయిటింగ్ లిస్టులతో వెను దిరగాల్సిన పరిస్థితి. అలాగే ఈఎంయూ రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. -
అందనంత వేగం!
తత్కాల్ రిజర్వేషన్ టిక్కెట్లు మరింత వేగంగా, ఎక్కువమందికి అందించాలన్న రైల్వే శాఖ ఆలోచన ఆచరణలో వికటిస్తోంది. ట్రావెల్ ఏజెన్సీలు, టిక్కెట్ల బ్రోకర్లకే ఇది ఉపయోగపడుతోంది. కౌంటర్లలో రాత్రి తెల్లవార్లూ నిరీక్షించే సామాన్య ప్రయాణికులకు మాత్రం ప్రయాసలే మిగులుతున్నాయి. ఒకరిద్దరికి మాత్రమే టిక్కెట్లు అందుతున్నాయి. మిగిలిన వారు ఉత్తి చేతులతో వెనుదిరగాల్సి వస్తోంది. శ్రీకాకుళం, ఆమదాలవలస: రైల్వే రిజర్వేషన్ కౌంటర్లపై ఆధారపడే ప్రయాణికులకు తత్కాల్ టిక్కెట్లు దొరకడం దుర్లభమవుతోంది. ఇటీవల ఐఆర్సీటీసీ వెబ్సైట్ వేగాన్ని పెంచిన తర్వాతే ఈ పరిస్థితి ఎదురవుతోందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. గతంలో రిజర్వేషన్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడిన వారిలో 10 మంది వరకు తత్కాల్ టిక్కెట్లు పొందగలిగేవారు. ఇప్పుడు ఇద్దరుముగ్గురికి మించి పొందలేకపోతున్నారు. ఉదయం 10 గంటలకు తత్కాల్ వెబ్సైట్ తెరుచుకుంటుంది. ఆ తర్వాత ఐదు నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ అయిపోతున్నాయి. గతంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వెబ్సైట్ వేగవంతంగా ఉండేది. ఇప్పుడు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను కూడా అదే స్థాయికి పెంచడంతో కౌంటర్ల వద్ద క్యూలో నిరీక్షించే వినియోగదారులకు కష్టాలు ఎదురవుతున్నాయి. కౌంటర్లోని సిబ్బంది వినియోగదారులు రిజర్వేషన్ ఫారంలో పేర్కొన్న సమాచారాన్ని వెబ్సైట్లో నమోదు చేసి, వారి నుంచి డబ్బులు తీసుకొని, ప్రింటెడ్ టిక్కెట్ ఇచ్చేందుకు మూడు నుంచి నాలుగు నిమిషాలు పడుతోంది. తిరిగి చిల్లర ఇవ్వాల్సి వస్తే మరో నిమిషం పడుతుంది. ఐఆర్సీటీసీ వైబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు తీసుకునే విషయంలో ఇంత తతంగం ఉండదు. రైల్వే కౌంటర్లో ఒకటికి మించి కంప్యూటర్లను వినియోగించే అవకాశం లేకపోలేక పోగా ఐఆర్సీటీసీ ఏజెంట్లు పలు కంప్యూటర్లను ఏర్పాటు చేసుకొని ఏక కాలంలో ఎక్కువ టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. ఈ టికెటింగ్ విధానంలో అప్పటికప్పుడు టిక్కెట్ ప్రింట్ చేసుకోవాల్సిన అవసరం లేకపోవడం కూడా వీరికి అనుకూలంగా మారింది. గతంలో ఐఆర్సీటీసీ వెబ్సైట్ స్పీడ్ తక్కువగా ఉండడం రైల్వే వెబ్సైట్ స్పీడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు రైల్వే కౌంటర్లోని సిబ్బంది ఒక వినియోగదారుని లావాదేవీలు పూర్తి చేసే సరికే దాదాపు టిక్కెట్లన్నీ అయిపోతున్నాయి. దీని వల్లఅర్ధరాత్రి నుంచి క్యూలో వేచి ఉన్న వినియోగదారులు టిక్కెట్లు దొరక్క నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. సాంకేతిక అంశాలు తెలియని పలువురు వినియోగదారులు రైల్వే కౌంటర్లలోని సిబ్బంది వల్లే ఇలా జరుగుతోందన్న భావనతో వారితో వాదనకు దిగుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులను కొందరు ఐఆర్సీటీసీ ఏజెంట్లు తమకు అనుకూలంగా మలచుకొని తమ వద్దకు వచ్చే వినియోగదారుల వద్ద టిక్కెట్ ధర కంటే అదనంగా రూ. 400 నుంచి 500 వరకు వసూలు చేస్తున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సినవారు గత్యంతరం లేక ఎక్కువ మొత్తాలు చెల్లించి టిక్కెట్లు తీసుకుంటున్నారు. రిజర్వేషన్ కౌంటర్లను ప్రైవేటీకరించాలని నిర్ణయించినట్టు రైల్వే అధికారులు ప్రకటించక ముందే ప్రైవేటు ఏజెంట్లకు లాభం జరిగేలా నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. సామాన్యులకు దొరకడంలేదు వేకువజామున మూడు గంటలకు వచ్చి క్యూలో నిల్చున్నా తత్కాల్ దొరకడం లేదు. సామాన్యులు కౌంటర్ వద్ద నిలబడడమే తప్ప టిక్కెట్ మాత్రం లభించడం లేదు. సిబ్బందిని అడిగితే తామేమీ చేయలేమని అంటున్నారు. -వై.వెంకటేష్, ఆమదాలవలస తత్కాల్ అందడం గగనమే శనివారం రాత్రి జి.కె.వలస బస్సుకు వచ్చి తత్కాల్ కోసం క్యూలో నిల్చున్నాను. అయినా టిక్కెట్ దొరకలేదు. క్యూలో నిలబడిన ముగ్గురికి మాత్రమే టిక్కెట్లు దక్కాయి. ఏ ట్రైన్‌కు అడిగినా అయిపోయాయంటున్నారు. - నక్క రాము, జి.కె.వలస, ఆమదాలవలస మండలం -
ఈ-టికెట్ల అక్రమ విక్రయం
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీ సీలో బినామీ యూజర్ ఐడీలు తెరిచి.. తత్కాల్లో టికెట్లు బుక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురిని రైల్వే పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఆదివారం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అశ్వినీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఐఆర్సీటీసీ ద్వారా ప్రయాణికులు రైల్వే ఈ-టికెట్ తీసుకొనే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. దీని కోసం ప్రయాణికులు యూజర్ ఐడీలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ-టికె ట్లను పెద్దమొత్తంలో తీసుకొని ఇతరులకు విక్రయించాలనుకుంటే మాత్రం ఐఆర్సీటీసీ వద్ద ఏజెంట్‌గా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, సికింద్రాబాద్ పికెట్‌కు చెందిన ఎజ్జు శ్రీనివాసరావు (38), ముషీరాబాద్ ఓన్లీ ట్రావెల్స్‌కు చెందిన నస్రతుల్లా (50), హబ్సిగూడ తిరుమల ఇంటర్నెట్ నిర్వాహకుడు నల్ల చంద్రశేఖర్ (21), రామంతాపూర్‌కు చెందిన ఎన్.రాధాకృష్ణ శ్రీనివాస్ (48) ఐఆర్సీటీసీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఏజెంట్లుగా చెప్పుకుంటూ ప్రయాణికులకు తత్కాల్ ఈ-టికెట్లను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఐఆర్సీటీసీలో ఒక్క యూజర్ ఐడీపై ఎక్కవ టికెట్లు బుక్ చేసుకొనే సదుపాయం లేకపోవడం.. బినామీ పేర్లపై యూజర్ ఐడీలు తెరిచి ప్రతీ రోజూ ఎక్కవ సంఖ్యలో తత్కాల్ ఈ-టికెట్లు తీసుకొని అమ్ముతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ పోలీసులు దాడి చేసి పై నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.11 వేలు విలువైన తత్కాల్ ఈ-టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.