తత్కాల్‌..గోల్‌మాల్‌ | Raids Conducted On Unauthorised E Ticket Booking Offices In Visakhapatnam | Sakshi
Sakshi News home page

తత్కాల్‌..గోల్‌మాల్‌

Published Sat, Dec 14 2019 8:42 AM | Last Updated on Sat, Dec 14 2019 8:42 AM

Raids Conducted On Unauthorised E Ticket Booking Offices In Visakhapatnam - Sakshi

దువ్వాడలో అరెస్ట్‌యిన నకిలీ ఏజెంట్‌తో ఆర్పీఎఫ్‌ (ఫైల్‌))

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): తత్కాల్‌లో ఒక్క టికెట్‌ బుక్‌ చేయాలంటేనే తలప్రాణం తోకకొస్తుంది. ఒక ఐపీ అడ్రస్‌ నుంచి నెలకు 5 కొనాలనే నిబంధన ఉంది. అయితే ఐఆర్‌సీటీసీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను, లొసుగులను గమనించిన ఓ ముఠా.. నకిలీ సాఫ్ట్‌వేర్‌ ఏఎన్‌ఎంఎస్‌ను రూపొందించి తత్కాల్‌ బుకింగ్‌ సమయంలో కొన్ని వందల టికెట్లు బుక్‌ చేస్తోంది. కన్‌ఫర్మ్‌ టికెట్లు బుక్‌ చేసినందుకు గానూ ప్రయాణికుల నుంచి  డిమాండ్‌ను బట్టి ఒక్కో టికెట్‌కు రూ. 200 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తోంది. ఈ ముఠా దందా ఇలా సాగుతుంటే సాధారణ ప్రయాణికులు మాత్రం.. ఒక్క టికెట్‌ కూడా బుక్‌ చేయలేక నానాతంటాలు పడుతున్నారు. దీనిపై ఫిర్యాదులందుకున్న రైల్వే భద్రతా దళం నిత్యం తనిఖీలు నిర్వహిస్తోంది. నకిలీ సాఫ్ట్‌వేర్‌తో ప్రయాణికులను మోసగిస్తున్న ఏజెంట్లను అరెస్ట్‌ చేస్తోంది. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు ఏదో ఓ చోట వెలుగు చూస్తూనే.. ఉన్నాయి.

మూడు నెలలుగా విస్తృత దాడులు
•అక్టోబర్‌ 26న ఆరీ్పఎఫ్‌ సిబ్బంది అల్లిపురంలోని అయ్యప్ప ఇంటర్నెట్‌ సెంటర్‌పై దాడి చేసి, నిర్వాహకుడు తవిటి నాయుడును అరెస్ట్‌ చేశారు. అలాగే గాజువాకలోని ఐ ఫ్రెండ్స్‌ నెట్‌ సెంటర్, అగనంపూడిలోని ఫ్రెండ్స్‌ డాట్‌ కామ్‌ ఇంటర్నెట్‌ అండ్‌ మీసేవ, చినముషిడివాడలోని ఓంకార్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్, అరసవల్లిలోని శ్రీనివాస మల్టీమీడియా, పార్వతీపురంలోని స్టార్‌ ఇంటర్నెట్‌ అండ్‌  జిరాక్స్, మర్రిపాలెంలోని స్పేస్‌ సిటీ ఇంటర్నెట్‌ సరీ్వసెస్‌లో దాడులు చేశారు. ఈ కేంద్రాల నిర్వాహకుల నుంచి రూ.3,36,680 విలువ చేసే 198 ఇ–టికెట్లను స్వా«దీనం చేసుకున్నారు.  

•నవంబర్‌ 3వ తేదీన విజయనగరంలోని మీ సేవ కేంద్రం, చీపురుపల్లిలోని ఏ టు జెడ్‌ ఆన్‌లైన్‌ సరీ్వస్, సబ్బవరంలోని గ్రేస్‌ ఇంటర్నెట్‌ అండ్‌ డీటీపీ, గోపాలపట్నంలోని విశ్వాస్‌ ఇంటర్నెట్‌ కేఫ్‌ అండ్‌ ట్రావెల్స్‌పై దాడులు చేశారు. ఈ కేంద్రాల నిర్వాహకులను అరెస్ట్‌ చేసి, వీరి నుంచి రూ. 2.26 లక్షల విలువ చేసే 195 ఇ–టికెట్లను స్వాదీనం చేసుకున్నారు.

•నవంబర్‌ 28న శ్రీకాకుళంలోని ఎస్‌.ఎస్‌.ట్రావెల్స్, జగదీష్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్, ఎస్‌.ఎస్‌.ట్రావెల్స్‌( కళింగ రోడ్‌ జంక్షన్‌), అయ్యప్ప ట్రావెల్స్‌పై దాడులు చేసి, నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ. 3,57,599 విలువ చేసే 203 ఇ–టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

 •ఈ నెల 10వ తేదీన జరిపిన దాడుల్లో నకిలీ సాఫ్ట్‌వేర్‌ గుట్టును రట్టు చేశారు. దువ్వాడలోని ఎస్‌పీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌పై దాడులు చేసి 582 ఇ–టికెట్లు స్వా«దీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11.31 లక్షలు ఉంటుంది. అలాగే తాటిచెట్లపాలెంలో యు.దుర్గారావును అరెస్ట్‌ చేసి, అతని నుంచి రూ.3.52 లక్షల విలువ చేసే 129 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

నకిలీ సాఫ్ట్‌వేర్‌ను  గుర్తించిన ఆర్ఫీఎఫ్‌
ఆర్ఫీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు పి.ఎస్‌.రావు, ఆర్‌.కె.రావులు ఈ నెల 10న దువ్వాడలోని ఎస్‌పీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌పై జరిపిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నకిలీ ఏఎన్‌ఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌తో ఐఆర్‌సీటీసీ ఇ–టికెట్‌ పోర్టల్‌ను హ్యాక్‌ చేసి తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేస్తున్నట్టు గుర్తించారు. కేంద్రం నిర్వాహకుడు సమీర్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని.. రూ.11.31 లక్షలు విలువ చేసే 582 ఇ–టికెట్లను స్వా«దీనం చేసుకున్నారు. గడిచిన మూడు నెలల కాలంలో ఆర్పీఎఫ్‌ సిబ్బంది పలు ప్రాంతాల్లో దాడులు చేసి రూ.లక్షల విలువైన టికెట్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు స్వా«దీనం చేసుకున్నారు. 17 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో డిసెంబర్‌ 10న అరెస్టయిన సమీర్‌కుమార్‌ ప్రధాన సూత్రధారుడిగా గుర్తించారు. అతను పరవాడలోని ఫార్మా కంపెనీలో పనిచేస్తూ.. దువ్వాడలో ఎస్‌పీ టూర్‌ అండ్‌ ట్రావెల్స్‌ను నిర్వహిస్తున్నాడు. అతని నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు  ఆర్పీఎఫ్‌  సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.  

ఐఆర్‌సీటీ సీయే కారణమా?  
ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) వ్యాపార విస్తరణలో భాగంగా నగరాల్లో ప్రిన్సిపాల్‌ సరీ్వస్‌ ప్రొవైడర్స్‌(పీఎస్‌పీ)కు కాంట్రాక్ట్‌ ఇస్తోంది. ఈ పీఎస్‌పీలు ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా టికెట్లు అమ్మకాలు సాగిస్తుంటారు. ఈ ప్రక్రియ అంతా తత్కాల్‌ విడుదలైన కేవలం15 నిమిషాల్లో ముగుస్తుంది. అందుకే ఆ సమయంలో సాధారణ ప్రయాణికులు తమ ఫోన్ల నుంచి గానీ, కంప్యూటర్ల నుంచి టికెట్లు బుక్‌ చేసుకుందామంటే అవకాశం ఉండడం లేదు. ఏ యాప్‌ నుంచి కూడా ఈ 15 నిమిషాలు వ్యక్తిగత యూజర్‌ ఐడీలు ఉన్న వారికి టికెట్లు లభించవు. కారణం వారంతా ఆ సమయంలో ఐఆర్‌సీటీసీ సైట్‌ను తమ స్వా«దీనంలో ఉంచుకుంటారు. తీరా 15 నిమిషాలు అయ్యే సరికి తత్కాల్‌ టికెట్లన్నీ అయిపోతాయి. వాస్తవానికి రైల్వే టికెట్లు బుక్‌ చేయాలంటే ఆ శాఖ నుంచి ఆ«దీకృత అనుమతి పొంది ఉండాలి. కానీ ఈ పీఎస్‌పీలు వీరికి అటువంటి అనుమతుల్లేకుండానే వ్యక్తిగత యూజర్‌ ఐడీలతో అకౌంట్లు సృష్టిస్తుంటారు. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ యూజర్‌ ఐడీలతో వేగంగా వీరు తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రయాణికులు తమ అవసరాలు తీరేందుకు వేరే దారి లేక ఇటువంటి వారిని ఆశ్రయిస్తున్నారు. ఒక టికెట్‌కు డిమాండ్‌ను బట్టి రూ.200 నుంచి రూ. 1000 వరకు కూడా సమర్పించుకుంటున్నారు. పండగ వేళల్లో, రద్దీ సమయాల్లో అనధికార ఏజెంట్లు భారీ మొత్తంలో ప్రయాణికుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. ఈ దందాకు ఓ రకంగా ఐఆర్‌సీటీసీ కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.  కాగా.. నకిలీల ఆటకట్టించేందుకు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ జితేంద్ర శ్రీ వాస్తవ నడుంబిగించారు. తమ సిబ్బందితో తరచూ దాడులు చేయిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు జరుగుతున్నాయి. నకిలీ సాఫ్ట్‌వేర్‌ ఏఎన్‌ఎంఎస్‌ను అభివృద్ధి చేసిన వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. దీని వెనుక పెద్ద ముఠానే ఉందని, త్వరలోనే వీరిని అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement