స్మార్ట్‌ దోపిడీ | Tatkal Ticket Fraud in Hyderabad | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ దోపిడీ

Published Sat, Sep 21 2019 10:07 AM | Last Updated on Sat, Sep 21 2019 10:07 AM

Tatkal Ticket Fraud in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: తత్కాల్‌ టికెట్ల కృత్రిమ కొరతను సృష్టించి ప్రయాణికులపై పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్న ఏజెంట్‌లు, దళారులు బుకింగ్‌ విషయంలో సరికొత్తగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఓవైపు ప్రయాణికులను దోచుకుంటూ... మరోవైపు ఐఆర్‌సీటీసీకి, రైల్వే ఆదాయానికి గండి కొడుతున్నారు. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లలో సాధారణ ప్రయాణికులకున్న వెసులుబాటును అవకాశంగా తీసుకొని వందలకొద్దీ నకిలీ ఐడీలను, పాస్‌వర్డులను సృష్టించి దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ అప్లికేషన్‌లు సైతం రూపొందించారు. ఈ మొబైల్‌ యాప్‌ల ద్వారానే  క్షణాల్లో వందల కొద్దీ టికెట్లు బుక్‌ చేస్తున్నారు. తత్కాల్‌ టికెట్ల కోసం  క్యూలైన్‌లో పడిగాపులు కాయాల్సిన పని లేకుండా, ఆన్‌లైన్‌ బుకింగ్‌ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా యాప్‌ల ద్వారా దళారుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే సమయం కంటే తక్కువ సమయంలో.. కేవలం ఒకట్రెండు సెకన్ల వ్యధిలోనే యాప్‌ ద్వారా బుక్‌ చేయడంతో దళారులకు నిర్ధారిత టికెట్‌లు (కన్‌ఫర్మ్‌) లభిస్తున్నాయి. గ్రేటర్‌లో ఈ తరహా యాప్‌ ఆధారిత అక్రమ బుకింగ్‌ దందా పెద్ద ఎత్తున సాగుతున్నట్లు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్, విజిలెన్స్‌ విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చేపడుతున్న చర్యలను సైతం ఏజెంట్‌లు, దళారులు టెక్నాలజీ సహాయంతో ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ఆర్‌పీఎఫ్‌కు సవాల్‌గా మారారు. 

వ్యవస్థీకృతంగా దోపిడీ...  
దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులలో 60 శాతానికి పైగా మంది ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌లోనే రిజర్వేషన్‌లు పొందుతున్నారు. ఇందుకోసం ఎక్కువ మంది ఏజెంట్‌లను, దళారులను ఆశ్రయిస్తున్నారు. ఐఆర్‌సీటీసీ లెక్కల  ప్రకారం సుమారు 6వేల మంది ఏజెంట్‌లు నమోదై ఉన్నారు. కానీ అంతకు రెట్టింపు సంఖ్యలో దళారులు రాజ్యమేలుతున్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌లలో 80శాతం వారి గుప్పిట్లోనే ఉన్నాయి. నగరంలోని కూకట్‌పల్లి, మియాపూర్, సైనిక్‌పురి, ఈసీఐఎల్, మంగళ్‌హట్, జీడిమెట్ల, ఉప్పల్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్‌ తదితర అన్ని  ప్రాంతాల్లో ఏజెంట్‌ల వ్యవస్థ విస్తరించుకొని ఉంది. ఈ ఏజెంట్‌లు ప్రయాణికుల అవసరాలను పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. తత్కాల్‌ చార్జీలపైన రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పండుగలు, ప్రత్యేక సెలవు దినాల్లో దోపిడీ  మరింత తీవ్రంగా ఉంటుంది. ఇందుకోసం కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. రూ.1,000 తత్కాల్‌ టికెట్‌ను రూ.1,500 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తున్నారు. రద్దీ సమయాల్లో ఇది రూ.3,000 వరకు కూడా చేరుకుంటోంది. హైదరాబాద్‌ నుంచి విశాఖ, భువనేశ్వర్, బెంగళూర్, తిరుపతి, ముంబై, ఢిల్లీ, పట్నా, కోల్‌కతా తదితర ప్రాంతాలకు వెళ్లే  ప్రయాణికుల ఎమర్జెన్సీ.. ఏజెంట్‌లకు కాసుల వర్షం కురిపిస్తోంది. 

సైబర్‌ నేరగాళ్లే సృష్టికర్తలు...  
ఇటీవల మంగళ్‌హట్‌కు చెందిన ఒక ఏజెంట్‌ను ఆర్‌ఫీఎఫ్‌ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద లభించిన నకిలీ ఐడీలు, ఆధార్‌ పత్రాలు, మొబైల్‌ యాప్‌లు చూసి పోలీసులే విస్తుపోయారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో అమాయక ప్రజల వద్ద నుంచి సేకరించిన ఆధార్‌ పత్రాల ఆధారంగా ఏజెంట్‌లు వందల కొద్దీ ఈ–మెయిల్‌ ఐడీలను సృష్టిస్తున్నారు. ఈ ఆధార్‌ పత్రాలను రూ.2వేలకు 10 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సాధారణ ప్రయాణికుల్లా టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ఈ ఆధార్‌లు, మెయిల్‌ ఐడీలు దోహదం చేస్తున్నట్లు ఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారి అశ్వినీకుమార్‌ ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ బుకింగ్‌ల కోసం ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కాకుండా మొబైల్‌ యాప్‌ల ద్వారా బుక్‌ చేసుకోవడం వల్ల ఏజెంట్‌లను గుర్తించి పట్టుకోవడం సమస్యగా మారుతోంది. సైబర్‌ నేరగాళ్లు  పదుల సంఖ్యలో యాప్‌లను సృష్టించి ఏజెంట్‌లకు విక్రయిస్తున్నారు. వీఎన్‌ఎక్స్, రెడ్‌మిక్స్, ఏఎన్‌ఎంఎస్‌ వంటి యాప్‌లు రిజర్వేషన్‌  బుకింగ్‌ల కోసం వినియోగిస్తున్నారు. ఈ మొబైల్‌ యాప్‌లలోనే ప్రయాణికుల పేర్లు, ఆధార్‌ నంబర్, మెయిల్‌ ఐడీ, బ్యాంకు ఖాతా తదితర వివరాలను తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు ముందు రోజే నమోదు చేస్తారు. టిక్కెట్‌ బుక్‌ చేయాల్సిన రోజున సరిగ్గా ఉదయం 10గంటలకు ఒకే ఒక్క క్లిక్‌తో ఐఆర్‌సీటీసీ పేమెంట్‌ గేట్‌వేకు సమాచారాన్ని చేరవేసి డబ్బులు చెల్లించేస్తున్నారు. తత్కాల్‌ బుకింగ్‌ ప్రారంభమైన కొద్ది సెకన్లలోనే ఈ పని పూర్తవుతుంది. పేమెంట్‌ గేట్‌వే నుంచి సమాచారం ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ (పీఆర్‌ఎస్‌)కు చేరుతుంది. పీఆర్‌ఎస్‌ ద్వారా వెంటనే టికెట్లు వచ్చేస్తాయి. నిర్ధారిత టికెట్లు ఏజెంట్‌ల వద్ద మాత్రమే లభిస్తాయనే నమ్మకంతో ప్రయాణికులు సైతం వారినే ఆశ్రయిస్తున్నారు. నిజాయతీగా క్యూలైన్‌లలో నించున్నవాళ్లు, ఆన్‌లైన్‌లో బుకింగ్‌ల కోసం ఎదురు చూసేవాళ్లు మాత్రం దారుణంగా నష్టపోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement