సాక్షి, హైదరాబాద్: టికెట్ కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పని లేదు. లైన్‌లో నించోవలసిన అవసరం లేదు. ప్రయాణానికి కనీసం 15 నిమిషాల ముందు టిక్కెట్ కొనుక్కోవచ్చు. ఆ మాటకొస్తే రైలెక్కే ముందే టిక్కెట్ తీసుకోవచ్చు. పైగా టిక్కెట్ కోసం ఎక్కడికీ పరుగెత్తవలసిన అవసరం లేదు. అన్ రిజర్వ్‌డ్ టిక్కెట్ బుకింగ్‌లలో యూటీఎస్ మొబైల్ యాప్ అప్రతిహతంగా దూసుకుళ్తుంది.
అన్ని ప్రధాన రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్ లలో సాధారణ టిక్కెట్ ల కోసం ప్రయాణికులు యూటీఎస్ (అన్ రిజర్వ్‌డ్ టిక్కెటింగ్ సిస్టమ్) మొబైల్ యాప్‌ను ఆశ్రయిస్తున్నారు. కోవిడ్ అనంతరం యూటీఎస్‌కు అనూహ్యమైన ఆదరణ పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 7.5 లక్షల మంది ప్రయాణికులు యూటీఎస్ ద్వారా టిక్కెట్‌లు బుక్ చేసుకోగా దసరా సందర్భంగా ఈ ఐదు రోజుల్లోనే సుమారు 50 వేల మంది ప్రయాణికులు యూటీఎస్‌లో టిక్కెట్‌లు తీసుకొని సొంత ఊళ్లకు బయలుదేరారు.
నో ‘క్యూ’...
జంటనగరాల నుంచి ప్రతి రోజు సుమారు 85 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 100 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 2 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు.వీరిలో కనీసం 1.5 లక్షల మంది సాధారణ ప్రయాణికులే.ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని జనరల్ బోగీలు,ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణం చేసేవారే. రైల్వేస్టేషన్‌లలో జనరల్ టిక్కెట్‌లు విక్రయించే బుకింగ్ కేంద్రాల వద్ద రద్దీ తీవ్రంగా ఉంటుంది.దసరా వంటి పర్వదినాల్లో టిక్కెట్‌ల కోసం తొక్కిసలాటలు, పోలీసుల లాఠీ చార్జీ వంటి ఉద్రిక్తతలు సైతం చోటుచేసుకున్నాయి.
ఈ క్రమంలో రద్దీ నియంత్రణకు దక్షిణమధ్య రైల్వే యూటీఎస్ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. కోవిడ్‌కు ముందుకు కొంత మేర ఆదరణ కనిపించినా కోవిడ్ కాలంలో జనరల్ టిక్కెట్‌లకు కూడా గుర్తింపు తప్పనిసరి చేయడంతో యూటీఎస్ వినియోగం తగ్గుముఖం పట్టింది. ఇటీవల యూటీఎస్‌కు విస్తృత ప్రచారం కల్పించడంతో లక్షలాది మంది ఈ యాప్‌ను వినియోగించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో 6 వేల చొప్పున యూటీఎస్ బుకింగ్‌లవుతుండగా, పండుగలు, సెలవు రోజుల్లో 10 వేల నుంచి 15 వేల మంది ప్రయాణికులు యూటీఎస్ నుంచి టిక్కెట్‌లు తీసుకుంటున్నారు.
ఈజీగా బుకింగ్...
►మొబైల్ ఫోన్‌లో యూటీఎస్ యాప్ ఉంటే చాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా జనరల్ టిక్కెట్‌లు బుక్ చేసుకోవచ్చు.
►ఇంటి నుంచి రైల్వేస్టేషన్‌కు బయలుదేరే క్రమంలోనే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు.
►రైల్వేస్టేషన్‌లో రైలు బయలుదేరడానికి ముందుకు కూడా టిక్కెట్‌లు తీసుకోవచ్చు.
►యూటీఎస్ టిక్కెట్‌ల పైన దక్షిణమధ్య రైల్వే రాయితీ సదుపాయం కూడా అందజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment