జూన్ 2 నుంచి సీఎస్‌టీ పిడుగు | CST starts from june 2nd | Sakshi
Sakshi News home page

జూన్ 2 నుంచి సీఎస్‌టీ పిడుగు

Published Fri, May 23 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

CST starts from june 2nd

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటే వ్యాపార లావాదేవీలపై పన్ను
 
 సాక్షి, హైదరాబాద్: మరో పదిరోజుల్లో అపాయింటెడ్ డే జూన్ 2. ఆ రోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అధికారికంగా అవతరించబోతున్నాయి. అదే సమయంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పేరు మీద సాగిన వాణిజ్య, వ్యాపారాలు కూడా రెండు రాష్ట్రాల్లో సాగబోతున్నాయి. ప్రస్తుతం రెండు ప్రాంతాల్లోని చిరు వ్యాపారులను మొదలుకొని బడా పారిశ్రామిక వేత్తల వరకు ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఇదే. ఇప్పటి వరకు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ మొదలైన రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కు ఉన్న వ్యాపార సంబంధాలే... ఇక ముందు ఆంధ్రప్రదేశ్- తెలంగాణల మధ్య  ఉండబోతున్నాయనే ఆలోచనే వ్యాపార, వాణిజ్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.  తెలంగాణ, సీమాంధ్ర సరిహద్దులు దాటే ఏ వస్తువు కైనా 2 శాతం సీఎస్‌టీ(కేంద్ర అమ్మకపు పన్ను) చెల్లించాల్సిన పరిస్థితి రావడమే అందుకు కారణం. సరిహద్దులు దాటే ప్రతిసరకుపైనా 2 శాతం సీఎస్‌టీ వసూలు చేసేవిధంగా వాణిజ్యపన్నుల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జూన్ 2వ తేదీ నుంచే ఇది అమలులోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది.
 
 మారిన టిన్ కోడ్...
 
 ఉత్పత్తి సంస్థలు మొదలుకొని వ్యాపారులు, ఎగుమతి,దిగుమతి దారులు, డీలర్లకు ‘టిన్’ తప్పనిసరి. టాక్స్‌పేయర్ ఐడెంటిఫికేషన్ నంబర్‌గా పిలిచే 11 అంకెల ఈ టిన్‌లో మొదటి రెండు అంకెలు ఆయా రాష్ట్రాల కోడ్‌గా ఉంటాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ టిన్ కోడ్ 28. రాష్ట్రం రెండుగా విడిపోతున్నందున వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికే రెండు రాష్ట్రాలకు వేర్వేరు కోడ్‌లు ఏర్పాటు చేసింది. తెలంగాణ టిన్ కోడ్ 36 కాగా, ఆంధ్రప్రదేశ్ కోడ్ 37. ఈ మేరకు ఆన్‌లైన్ ద్వారా టిన్ మార్పు కోసం దరఖాస్తులను వాణిజ్య పన్నులశాఖ ఇప్పటికే ఆహ్వానించగా, చాలా వరకు అప్‌గ్రేడ్ అయ్యాయి. జూన్ 2 నుంచి ఇవే అమలులోకి రానున్నాయి.
 
 ఇప్పటి వరకు ఒకే రాష్ట్రం కోణంలో లావాదేవీలు
 
 రాష్ట్రంలో పారిశ్రామిక ప్రాంతాలుగా అప్పట్లో ప్రభుత్వం హైదరాబాద్ పరిసర ప్రాంతాలను గుర్తించింది. దీంతో సమైక్య రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు ఉత్పత్తి సంస్థలను మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పరిధుల్లో ఎక్కువగా ఏర్పాటు చేశారు. గోడౌన్‌లను సీమాంధ్ర ప్రాంతంలో నెలకొల్పి అక్కడి నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేవారు. 23 జిల్లాలుగా ఉన్న రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా సీఎస్‌టీ, వే బిల్లులతో అవసరం ఉండేది కాదు. సీ ఫారాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి కర్నూలు కేంద్రంగా వ్యాపారం సాగించే పారిశ్రామిక వేత్తలు సైతం ఈ రెండు ప్రాంతాలకు మధ్య ఉన్న 8 కిలోమీటర్ల దూరంలో రాకపోకలకు 2 శాతం సీఎస్‌టీ చెల్లించాల్సిందే.
 
 బీడీ నుంచి బీరు వరకు
 
 లిక్కర్ వ్యాపారంలో కీలకమైన బీరు తయారు చేసే బ్రూవరేజెస్ హైదరాబాద్ చుట్టుపక్కలే ఆరు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతినెలా 10 లక్షల కేసుల బీర్లు సీమాంధ్రకు రవాణా అవుతున్నాయి. సీఎస్‌టీ అమలులోకి వస్తే ఒక్కో బీరుకేసు మీద 2 శాతం చొప్పున రూ. 15.60 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 10 లక్షల కేసులకు రూ. 1.56 కోట్లు సీఎస్‌టీ గా చెల్లించాల్సిన పరిస్థితి. అయితే ఈ మొత్తాన్ని బ్రూవరేజెస్ సంస్థలు ఎందుకు చెల్లిస్తాయన్నదే ప్రశ్న. అలాగే డిస్టిలరీస్ కంపెనీలు రెండు రాష్ట్రాల్లో చెరో 15 చొప్పున ఉన్న నేపథ్యంలో వీటి ఎగుమతి దిగుమతి కూడా తప్పనిసరి. డిస్టిలరీస్ విషయంలో ఒక్కో కేసు(పెట్టె)కు ఏకంగా రూ. 18 చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని ఏపీబీసీఎల్‌కు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. మార్జిన్ తక్కువగా ఉండే బ్రెడ్, బిస్కెట్‌ల తయారీకి ఉపయోగించే మైదా, గోధుమ పిండి ఉత్పత్తులకు సంబంధించి సీఎస్‌టీ వసూలు చేస్తే అనేక చిన్న కంపెనీలు మూసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
 
 ఇక మిర్చి, పత్తి వంటి ఉత్పత్తులు నల్గొండ, రంగారెడ్డి వంటి జిల్లాల నుంచి గుంటూరు మిరప మార్కెట్‌కు ప్రతిఏటా పెద్ద ఎత్తున తరలివెళ్తాయి. జూన్ 2 తరువాత ఈ అమ్మకాలపై కూడా సీఎస్‌టీ వసూలు చేస్తే రైతులకు మిగిలేదేంటన్నదే ప్రశ్న. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉన్న బీడీల తయారీదార్ల  నుంచి సేకరించే బీడీలను వివిధ పేర్లతో వ్యాపారులు అన్ని జిల్లాలకు తరలిస్తారు. ఇప్పుడు ఈ జిల్లాల్లో తయారయ్యే బీడీలు సీమాంధ్ర జిల్లాలకు వెళ్లాలంటే 2 శాతం సీఎస్‌టీ చెల్లించాలి. బహుళ జాతి కంపెనీలు కాకుండా హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి అయి 23 జిల్లాల్లో మార్కెటింగ్ జరిగే  సిగరెట్లు, చుట్టలు, ఇతర నిత్యావసర ఉత్పత్తులపై కూడా ఇదే రీతిన పన్ను వసూలు చేయడం జరుగుతుందని వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
 
 వినియోగదారులపై అదనపు భారం..?
 రెండు రాష్ట్రాల మధ్య పన్ను వసూళ్లు మొదలైతే ఆ భారం చివరికి వినియోగదారుడిపైనే పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ కంపెనీ అయినా, వ్యాపారైనా తాను నష్టంతో కూడిన వ్యాపారం చేయడు కాబట్టి... సర్కారుకు చెల్లించే సీఎస్‌టీని వినియోగదారుడి నుంచే వసూలు చేసే అవకాశం ఉంది. తద్వారా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్ని ఉత్పత్తులకు రెక్కలు వస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 జీఎస్‌టీ వచ్చే వరకు ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలి
 
 ఒకే రాష్ట్రం యూనిట్‌గా ఇప్పటి వరకు ఉత్పత్తి, మార్కెటింగ్, ఎగుమతి, దిగుమతులు జరిగాయి. ఇప్పుడు అకస్మాత్తుగా రాష్ట్రం రెండుగా విడిపోతోంది. సీఎస్‌టీ అమలులోకి వస్తే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయాన్ని ఫ్యాప్సీ తరపున ప్రభుత్వానికి తెలియజేశాం. దేశ వ్యాప్తంగా జీఎస్‌టీ(గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) త్వరలోనే వస్తుందంటున్నారు. అది వస్తే సీఎస్‌టీ ఉండదు. జీఎస్‌టీ వచ్చే వరకు రెండు రాష్ట్రాల్లో పాత విధానాన్నే అమలు చేయాలి.
 - శివ్‌కుమార్ రుంగ్టా, ఫ్యాప్సీ సీనియర్ ఉపాధ్యక్షుడు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement