సాక్షి ముంబై: ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) రైల్వే స్టేషన్‌ను మరింత కాంతివంతంగా తీర్చిదిద్దనున్నారు. ‘ప్రపంచ వారసత్వ కట్టడం’ (వరల్డ్ హెరిటేజ్ హౌస్) హోదా లభించిన ఈ స్టేషన్‌ను ప్రత్యేక విద్యుత్‌కాంతులతో మరింత ఆకర్షణీయంగా మార్చాలని సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఈ పనుల కోసం రూ.నాలుగు కోట్లకుపైగా ఖర్చు చేయనున్నారు. మరింత ప్రకాశించే ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలు స్టేషన్‌లో అమర్చుతామని సెంట్రల్ రైల్వే పీఆర్వో ఏ.కే.సింగ్ తెలిపారు. సీఎస్టీ నిర్మాణ పనులను 1878లో ప్రారంభించి పదేళ్ల తర్వాత పనులను పూర్తి చేశారు. సీఎస్టీ ఏర్పడి ప్రస్తుతం 125 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. నగరంలో మొట్టమొదటి రైలు కదిలింది ఈ స్టేషన్‌లోనే. కాలక్రమేణా ఈ స్టేషన్‌ను మరింత అభివృద్ధిపర్చారు.
దీంతో ఈ నిర్మాణం అనేక మంది దృష్టిలోకి రావడం మొదలయింది. 2004 జూలై రెండున ‘యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్’ దీనిని ప్రపంచ వారసత్వ కట్టడాల (వరల్డ్ హెరిటేజ్ హౌస్) జాబితాలో చేర్చింది. ఈ సీఎస్టీ నిర్మాణ విశిష్టతను సందర్శించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దీంతో సీఎస్టీ పర్యాటక ప్రాంతంగా మారింది. అయితే పురాతన ప్రదేశమైన సీఎస్టీని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని రైల్వే శాఖ యోచించింది. ఈ మేరకు సీఎస్టీని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలని నిర్ణయించింది. స్టేషన్ లోపలా, బయటా వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్టేషన్ విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ పనుల కోసం రూ.4,37,51,723 ఖర్చు చేయనుంది. డిసెంబర్ 10 వరకు టెండర్లు ఆహ్వానిస్తామని సింగ్ వివరించారు. ప్రస్తుతం ఉన్న కొన్ని విద్యుత్ దీపాలను తర్వాత తీసివేస్తారని, వాటి స్థానంలో కొత్త దీపాలను అమర్చుతారని ఆయన తెలిపారు.
సీఎస్టీకి కొత్త సొబగులు
Published Wed, Nov 6 2013 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement