ముంబయి సెంట్రల్ రైల్వే ప్రధాన కారిడార్‌లో సోమవారం ఉదయం సిగ్నలింగ్ సమస్యల వల్ల రైలు సేవలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ఉదయం 9.16 గంటలకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల థానే రైల్వేస్టేషన్ పరిధిలో సబర్బన్ రైలు సేవలు నిలిచిపోయాయని సెంట్రల్ రైల్వే ప్రతినిధి పేర్కొన్నారు.
థానే రైల్వేస్టేషన్ పరిధిలో సిగ్నల్ వైఫల్యం కారణంగా కళ్యాణ్(థానే), కుర్లా (ముంబయి) మధ్య సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. దాంతో ఇరుప్రాంతాలకు ప్రయాణిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఉదయం 10.15 గంటలకు సిగ్నలింగ్ వ్యవస్థను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.
సెంట్రల్ రైల్వే ప్రధాన కారిడార్ సబర్బన్ పరిధి దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి కళ్యాణ్ (థానే జిల్లా), ఖోపోలి (రాయ్‌గఢ్) వరకు విస్తరించి ఉంది. ఈ కారిడార్‌లో రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. తాజాగా సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్యాసింజర్లు ఇబ్బందులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment