సెల్ఫీ స్పాట్ కోసం.. 80 లక్షల ఖర్చు!
సెల్ఫీ తీసుకోవాలంటే అందుకు మంచి మూడ్ ఉండాలి, దానికి తగ్గట్టు మంచి ప్రదేశం కూడా ఉండాలి. అది లేకపోతేనే ఎక్కడెక్కడికో వెళ్లి రిస్క్ తీసుకుని సెల్ఫీలు తీసుకోవడం, ఆ ప్రయత్నంలో కొంతమంది ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లడం తెలిసిందే. ఇలాంటి ఇబ్బందులు లేకుండా, మంచి సెల్ఫీలు తీసుకోడానికి వీలుగా ముంబై మహానగరంలో ఓ మంచి ఆకర్షణీయమైన సెల్ఫీ పాయింట్‌ను రూపొందించారు. నగరంలోనే అత్యంత చరిత్రాత్మకమైన ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్‌టీ) బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించేలా ఈ పాయింట్‌ను సిద్ధం చేశారు. శివసేన యువ నాయకుడు ఆదిత్య ఠాక్రే దీన్ని ప్రారంభించి అక్కడ సెల్ఫీలు తీసుకున్నారు. వాటిని వెంటనే ఆయన ట్వీట్ చేశారు.
128 సంవత్సరాల చరిత్ర కలిగిన ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ను చూసేందుకు పర్యాటకులు మామూలుగానే వెల్లువెత్తుతుంటారు. అయితే ఈ స్టేషన్ వద్ద ప్రయాణికుల రద్దీతో పాటు ఫొటోలు తీసుకోడానికి వచ్చే జనాల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉండటంతో.. దానికి ప్రత్యామ్నాయంగా దీన్ని సిద్ధం చేశారు. సెల్ఫీలు తీసుకోడానికి ఇది చాలా సురక్షితమైనదని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ శ్రీరామ్ సుందరం, ఆయన కుమార్తె తరిణి చెప్పారు. ప్రజలు ఇక్కడ చాలా సురక్షితంగా సెల్ఫీలు తీసుకోవచ్చని అన్నారు. తరిణి ఇక్కడ చాలా ఫొటోలు తీసుకున్నారు.