సాక్షి, ముంబై: చరిత్రాత్మక ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్‌టీ)లో ప్రయాణికులకు రైల్వే అధికారులు కొత్త సంవత్సర కానుక ప్రకటించారు. వినియోగదారుల సౌకర్యార్థం వైఫై (వైర్‌లెస్ ఫిడిలిటీ) సేవలు అందుబాటులోకి తేనున్నారు. మరో రెండు నెలల తరువాతే ప్రయాణికులు ఈ స్టేషన్‌లో వైఫై సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే మొదటి 20 నిమిషాలపాటు వైఫై సేవలను ప్రయాణికులకు ఉచితంగా అందించేందుకు రైల్వే అధికారులు యోచిస్తున్నారు. తదనంతరం ఈ సేవలకు చార్జీ వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై సెంట్రల్ రైల్వే అధికారులు టెలికం కంపెనీలతో గత కొన్ని నెలలుగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. వైఫై సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పుడు ప్రయాణికులకు ఉచితంగానే అందివ్వాలని రైల్వే అధికారులు భావించారు.
అయితే ఈ ప్రయోగం చాలా ఖరీదుతో కూడుకున్నది కావడంతో మొదటి 20 నిమిషాలపాటు ప్రయాణికులకు ఉచితంగా అందజేసి, ఆ తర్వాత చార్జీలు వసూలు చేయాల్సిందిగా టెలికం కంపెనీలు రైల్వే అధికారులకు సూచించాయి. ఇదిలా వుండగా వైఫై సేవలు ప్రారంభించిన మూడునెలల పాటు ప్రయాణికులకు ఉచితంగానే సేవలను అందించేందుకు ప్రయత్నించామని టెలికం కంపెనీల అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకున్న 20 నిమిషాల తర్వాత చార్జీ వసూలు చేస్తామని వారు పేర్కొన్నారు. దీనివల్ల తాము 20 శాతం ఆదాయాన్ని పొందుతామని సెంట్రల్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎస్టీ రైల్వే స్టేషన్‌లో రోజుకు అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అందుకే వారి సౌకర్యార్థం వైఫై సేవలను అందజేసేందుకు సెంట్రల్ రైల్వే నిర్ణయించిందన్నారు. ఈ సేవలు అందుబాటులోకి రావడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతోందని చెప్పారు. నగర శివారు ప్రాంతాల నుంచే కాకుండా ఇతర నగరాలకు వెళ్లే ప్రయాణికులు కూడా ఇక్కడికి వస్తుంటారు.
ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్ (ఎమ్మార్‌వీసీ) ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. సీఎస్టీ నుంచి రోజుకు 6.36 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. స్థానికులే కాకుండా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇక్కడికి వస్తుంటారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే రైళ్ల ట్రాకింగ్, రైళ్లు ఆలస్యంగా వచ్చే సమాచారం, షెడ్యూల్ తదితర వివరాలను ప్రయాణికులు మొబైల్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల ద్వారా సులువుగా తెలుసుకునే వీలు ఉంటుంది. ఇదిలా వుండగా వైఫై సేవలకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో అతుల్ రాణే తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే కళ్యాణ్, ఠాణే, డోంబివలి తదితర ముఖ్య రైల్వే స్టేషన్లలోనూ వైఫై సేవలను అందిస్తామని వెల్లడించారు.
సీఎస్టీ స్టేషన్‌లో వైఫై సేవలు
Published Mon, Dec 30 2013 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement