వ్యయాల కారణంగానే ధర పెరిగింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ వ్యయాలు దూసుకెళ్లడం వల్లే సిమెంటు ధర పెరుగుతోందని కంపెనీలు అంటున్నాయి. వ్యయంలో 80-90 శాతం మేర తమ చేతుల్లో లేదని పరిశ్రమల ప్రతినిధులు మంగళవారమిక్కడ మీడియాకు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక్కో బ్యాగు తయారీకి రూ.335 అవుతోంది. అమ్మకం ధర ఇంత కంటే తగ్గితే కంపెనీలు నష్టాలను చవిచూస్తాయని స్పష్టం చేశారు.
సిమెంటు ధర వ్యయాలకు అనుగు ణంగా స్థిరీకరణ జరిగిందని వారు చెప్పారు. మీడియా సమావేశంలో సాగర్ సిమెంట్స్ జేఎండీ ఎస్.ఆనంద్ రెడ్డి, మై హోం ఇండస్ట్రీస్ ఈడీ ఎస్.సాంబశివరావు, ఇండియా సిమెంట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె.సాయి ప్రకాశ్, భవ్య సిమెంట్స్ ఎండీ వి.ఆనంద ప్రసాద్, పరాశక్తి సిమెంట్ ఈడీ యశ్వంత్ కృష్ణ, పెన్నా సిమెంట్స్ డెరైక్టర్ ఆర్.పి.సింగ్ మాట్లాడారు.
నిర్మాణంలో సిమెంటు వ్యయం..: ఖరీదైన భవంతి నిర్మాణంలో సిమెంటుకు అయ్యే వ్యయం కేవలం 2-3 శాతమే. సాధారణ భవంతికి ఈ వ్యయం 4-5 శాతానికి మించదు. ఒక్కో బ్యాగు ధర రూ.50-60 పెరిగినా, నిర్మాణంలో ఒక్కో చదరపు అడుగుకు రూ.15-20 కంటే వ్యత్యాసం రాదన్నారు. ‘బిల్డర్లు సిమెంటును 2 శాతం సీఎస్టీ చెల్లించి కర్నాటక, మహారాష్ట్ర నుంచి తెప్పిస్తున్నారు. తెలంగాణలో వ్యాట్ 14.5 శాతముంది. ఇతర రాష్ట్రాల నుంచి బిల్డర్లు సిమెంటు కొనుగోలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.200 కోట్ల దాకా ఆదాయం కోల్పోతోంది’ అన్నారు.
అన్నీ పెరిగాయి..: 2010లో ఒక టన్ను బొగ్గును సింగరేణి గనులు రూ.2,553కు విక్రయించాయి. ప్రస్తుతం ఇది రూ.5,459 ఉంది. విద్యుత్ చార్జీలు రెండేళ్లలో 60-70 శాతం పెరిగాయి. డీజిల్, రైల్వే రవాణా చార్జీలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రభావంతో సిమెంటు రవాణా చార్జీలు కూడా పెరిగాయని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక్కో బ్యాగు ధర రూ.315-330, వైజాగ్‌లో రూ.325 ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రూ.395 వరకు ఉందన్నారు.
2013 జూలైలో బ్యాగు ధర రూ.325-340 ఉందని గుర్తు చేశారు. బిల్డర్లు సిమెంటు ప్లాంటు పెట్టాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తన ప్లాంటును వారు ఉచితంగా తీసుకోవాల్సిందిగా భవ్య సిమెంట్స్ ఎండీ వి.ఆనంద ప్రసాద్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. లాభంలో 10% తనకు ఇస్తే చాలన్నారు.