5 నుంచి సిమెంట్ కొనుగోళ్లు బంద్!
సాక్షి, హైదరాబాద్: సిమెంట్ ధరల పెరుగుదలపై నిర్మాణ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈనెల 5- 12వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సిమెంట్ కొనుగోళ్లను నిలిపి వేయనున్నట్లు బిల్టర్ అసోసియేషన్లు ప్రకటించాయి. సిమెంట్ ధరలను నిరసిస్తూ బుధవారమిక్కడ జరిగిన సమావేశంలో భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాప్టర్లు, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్(అప్రెడా), తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్(టీరెడా), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ), తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్లు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సుమారుగా 60 వేల అపార్ట్‌మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 35-40 వేల అపార్ట్‌మెంట్లు ఒక్క హైదరాబాద్‌లోనే ఉంటాయి. వీటికి రోజుకు సుమారు 20 వేల టన్నుల సిమెంట్ అవసరం ఉంటుందని’ వివరించారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించకపోతే నిర్మాణాలనూ ఆపేస్తామని పేర్కొన్నారు.
దీంతో దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగంలో ఉన్న 1.2 కోట్ల మంది కార్మికులు రోడ్డున పడతారని హెచ్చరించారు.జూన్ 1న సిమెంట్ బస్తా ధర మార్కెట్లో రూ.210గా ఉంటే.. నేడది రూ.320కు చేరిందన్నారు. నెల రోజుల్లో రూ. 100 వరకు పెంచారన్నారు. పెంచిన సిమెంట్ ధరలపై గతంలో బీఏఐ మధ్యప్రదేశ్ చాప్టర్ లాగే జేఏసీ కూడా కాంపిటీషన్ కమీషన్(సీసీఐ)కు ఫిర్యాదు చేస్తుందని.. ఏపీ, తెలంగాణలోని అన్నిజిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని హచ్చరించారు.
సిమెంట్ రెగ్యులేటరీ అథారిటీ..
సెబీ, ట్రాయ్, ఐఆర్‌డీఏ వంటి నియంత్ర ణ సంస్థల్లాగే సిమెంట్ కంపెనీల నియంత్రణకు, ధరలను అదుపులో పెట్టేందుకు సిమెంట్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సీఆర్‌ఏ) చట్టాన్ని తీసుకురావాలని బీఏఐ, జేఏసీ కో-కన్వీనర్ ఎస్‌ఎన్ రెడ్డి డిమాండ్ చేశారు.