హైదరాబాద్ : సచివాలయం సీ బ్లాక్ ఎదుట తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగులు బుధవారం ఆందోళనకు దిగారు. తెలంగాణ కోసం పోరాడింది... ఆంధ్రా సచివాలయంలో పని చేయటానికా అంటూ వారు నిరసన చేపట్టారు. యూనియన్లు కూడా తమగోడు పట్టించుకోవటం లేదని నాలుగో తరగతి ఉద్యోగులు మండిపడుతున్నారు. వెయ్యిమందికిపైగా గ్రూప్-4 ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
దాంతో సచివాలయంలోని తెలంగాణ సీఎం బ్లాక్ వద్ద ఆందోళనకు దిగిన ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమను తెలంగాణలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేయమని స్పష్టం చేశారు. ఇప్పుడు తాత్కాలికమని చెబుతున్నా... తర్వాత ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు వెళ్లమంటారని, అప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
కొందరు ఉన్నతాధికారుల నిర్వాకం వల్లే ఇదంతా జరుగుతోందని ఉద్యోగులు ఆరోపించారు. తమ సంఘం నేతలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు మాట్లాడుతూ ఉద్యోగుల ఇబ్బందులను ఉన్నతాధికారులతో పాటు కేసీఆర్ దృష్టికి కూడా తీసుకు వెళతామన్నారు.
'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయం'
Published Wed, Jun 4 2014 12:13 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement