తెలంగాణలో ఉంటాం.. సీమాంధ్రకూ విస్తరిస్తాం | The plants were kept the same place for new business opportunities | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఉంటాం.. సీమాంధ్రకూ విస్తరిస్తాం

Published Wed, Jun 11 2014 1:11 AM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM

తెలంగాణలో ఉంటాం.. సీమాంధ్రకూ విస్తరిస్తాం - Sakshi

తెలంగాణలో ఉంటాం.. సీమాంధ్రకూ విస్తరిస్తాం

వ్యాపారావకాశం ఉన్నచోటుకే విస్తరణ
* పారిశ్రామికవాడల్లో అయితే పెట్టుబడికి సిద్ధం
ఒకే దరఖాస్తుతో అన్ని అనుమతులు ఇవ్వాలి
 * రెండు రాష్ట్రాలు సీఎస్‌టీ మినహాయించాలి
* ఇవీ పారిశ్రామిక ప్రతినిధుల డిమాండ్లు

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార పరంగా మేం ఎదగాలి. అందుకు విస్తరణే ఎకైక మార్గం. నూతన వ్యాపార అవకాశాలు ఉన్నచోటే ప్లాంట్లు పెడతామని అంటున్నారు వివిధ పరిశ్రమల ప్రతినిధులు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్లాంట్లు అలాగే కొనసాగుతాయని వారు అంటున్నారు. ఇక్కడి ప్లాంట్లను మూసివేసి మరోచోటుకు తరలించే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. కొత్త ప్లాంట్లు మాత్రం సీమాంధ్రతోసహా వివిధ రాష్ట్రాల్లో స్థాపిస్తామని చెబుతున్నారు.
 
మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపారంపై కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్‌టీ) మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎస్‌టీ మినహాయిస్తే తెలంగాణ నుంచి ప్లాంట్లు తరలిపోవని మరీ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాల్లో వ్యాపార అవకాశాలపై వివిధ అభిప్రాయాలను పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేశారు.

అవి..పన్ను మినహాయిస్తే..
తెలంగాణ, సీమాంధ్ర మధ్య జరిగే వ్యాపారంపై 2 శాతం సీఎస్‌టీని వ్యాపారులు చెల్లించాల్సి వస్తోంది. ఈ అంశమే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. 2-3 శాతం మార్జిన్లతో వ్యాపారాలు చేస్తున్నాం. అలాంటప్పుడు సీఎస్‌టీకే 2% పోతే ఎలా అని అంటున్నారు ఈటా బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేస్తున్న కిషోర్‌సన్స్ డిటర్జెంట్స్ ఎండీ గౌతమ్ చంద్ జైన్. ‘మా వ్యాపారంలో 80 శాతం వాటా సీమాంధ్ర నుంచే. ప్లాంటేమో తెలంగాణలో ఉంది.
 
మాలాంటి కంపెనీలు ఇక్కడ చాలా ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఫార్మా కంపెనీలు పన్ను ప్రయోజనాలు అందుకోవడానికి ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు వెళ్లాయి. ఇదే మాదిరిగా ఇప్పుడు సీమాంధ్రకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది’ అని గుర్తు చేశారు. 5 ఏళ్లపాటు ఇరు రాష్ట్రాల మధ్య సీఎస్‌టీ లేకుండా చేయాలన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలన్నారు.  ఉత్తరాఖండ్, హిమాచల్ మాదిరిగా పన్ను ప్రయోజనాలు ఇస్తే ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లింగ్ ప్లాంటు పెడతామని సెల్‌కాన్ సీఎండీ వై.గురు పేర్కొన్నారు.
 
పారిశ్రామికవాడలైతేనే...: విద్యాలయాలు, సేవా రంగంలో ఉన్న కంపెనీలు ఎంత ధరైనా స్థలానికి వెచ్చిస్తాయి. తయారీ కంపెనీలు అలా చేయలేవు. నిరంతరం ముడిపదార్థాలను కొనుగోలు చేయాలి. అటు పోటీ ఉంటుంది కాబట్టి లాభాలను కుదించుకుని తక్కువ ధరకు ఉత్పత్తులను విక్రయించాలి. ఈ పరిస్థితుల్లో స్థలానికే అధిక వ్యయం చేయలేవని సుధాకర్ పైప్స్ ఎండీ ఎం.జయదేవ్ తెలిపారు. రాజధాని మా జిల్లాలో అంటే మా జిల్లాలో అంటూ ప్రచారం జరగడంతో సీమాంధ్రలో స్థలాల ధరలు ఊహించనంతగా ఆకాశాన్నంటాయని వివరించారు.
 
పారిశ్రామిక వాడలే ఇందుకు పరిష్కారమని చెప్పారు. చిన్న కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో స్థలం కొనే అవకాశాలే లేవని తెలిపారు. ఇటువంటి కంపెనీలకు తక్కువ ధరకు భూములను అద్దెకు ఇవ్వాలని కోరారు. అందుబాటు ధరలో స్థలం, ఒకే దరఖాస్తుకు అన్ని అనుమతులు, నిరంతర విద్యుత్, కార్మికులకు నివాస గృహాలు, మంచి రోడ్లు ఇవీ సగటు పారిశ్రామికవేత్తల డిమాండ్లని పేర్కొన్నారు. ఇక అమ్మకం పన్ను, విద్యుత్ చార్జీల్లో సబ్సిడీ మొత్తాల విషయంలో రీయింబర్స్‌మెంట్ విధానాన్ని తీసేయాలని, నేరుగా ప్రయాజనం కల్పించాలని ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్, నయాస్ట్రాప్ ఎండీ వెన్నం అనిల్‌రెడ్డి కోరారు.
 
వ్యాపారావకాశాలు..
ముడి పదార్థాల లభ్యత, మౌలిక వసతుల కల్పన, వ్యాపార అవకాశాలు.. ఈ మూడు అంశాలే పారిశ్రామికవేత్తలకు అత్యంత ప్రధానమైనవని ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రుంగ్టా గ్లాస్ ఎండీ శివ్‌కుమార్ రుంగ్టా పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని అన్నారు.
 
తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలు ప్రకటించబోయే పారిశ్రామిక విధానాల కోసం వ్యాపారవేత్తలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వెలుపల, ఇతర ప్రాంతాల్లో పారిశ్రామికవాడల ఏర్పాటు, అలాగే పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.  ఇక సీమాంధ్రలో కొత్త వ్యాపార అవకాశాలు ఉత్పన్నమవుతాయి కాబట్టి విస్తరణకు అక్కడికి వెళ్లేందుకు పారిశ్రామికవేత్తలు చూస్తున్నారని వివరించారు.
 
 రూ.2,500 కోట్ల పెట్టుబడి..
ప్లాస్టిక్ కంపెనీలు హైదరాబాద్ సమీపంలో ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేయాలని చాలా ఏళ్లు శ్రమించాయి. అది సాధ్యం కాలేదు. ఇప్పుడు అన్ని వసతులతో సీమాంధ్రలో పార్కు ఏర్పాటైతే వెళ్లేందుకు దాదాపు 1,000 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ చెబుతోంది. పార్కులో రెండేళ్లలో రూ.2,500 కోట్ల పెట్టుబడి ఖాయమని అసోసియేషన్ అంటోంది. కొత్త అవకాశాలు అందుకోవడానికైనా కంపెనీలు సీమాంధ్రలో విస్తరిస్తాయని అసోసియేషన్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్‌రెడ్డి చెప్పారు. కాగా, సుధాకర్ పైప్స్ రూ.100 కోట్లతో 30 ఎకరాల్లో కేబుల్స్ తయారీ ప్లాంటు పెట్టాలని భావిస్తోంది. గుజరాత్ లేదా సీమాంధ్రలో ఇది రానుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభించనుంది.
 
రుంగ్టా గ్లాస్ రూ.20 కోట్లతో నిర్మాణ రంగానికి అవసరమయ్యే గ్లాస్, ల్యామినేటెడ్ గ్లాస్ ఉత్పత్తుల తయారీ యూనిట్ పెట్టనుంది. కిషోర్‌సన్స్ రోజుకు 300 టన్నుల సామర్థ్యం గల తయారీ యూనిట్ ఏర్పాటుకు యోచిస్తోంది. రూ.10 కోట్లదాకా వ్యయం చేయనుంది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీకై నయాస్ట్రాప్ రూ.10 కోట్లతో ప్లాంటు స్థాపించే పనిలో ఉంది. దాదాపు 60 ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మొత్తం రూ.1,200 కోట్ల దాకా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement