చుట్టపు చూపే!
- కరువు బృందాలతో ఒరిగింది శూన్యం
- మారని ‘అనంత’ రైతుల బతుకులు
- కరువు తీవ్రతను గుర్తించినా సహాయక చర్యలు చేపట్టని ప్రభుత్వాలు
- ఏటా రూ.వందల కోట్లతో ఇస్తున్న జిల్లా కరువునివేదికలు బుట్టదాఖలు
- నేడు జిల్లాకు కేంద్ర విపత్తు నివారణ కమిషనర్ రాఘవేంద్రసింగ్ బృందం
అనంతపురం అగ్రికల్చర్: ‘అనంత’ కరువు కాటకాలను కళ్లారా చూసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులతో కూడిన కరువు బృందాలు ఏటా వచ్చివెళుతున్నా జిల్లా రైతుల తలరాతలు మారడం లేదు. వచ్చివెళుతున్న బృందాలు జిల్లాలో అనావృష్టి పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని గుర్తిస్తున్నా... కరువు రక్కసి నుంచి ‘అనంత’ను శాశ్వతంగా విముక్తి చేసే చర్యలు మాత్రం చేపట్టడం లేదు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని రూ.వందల కోట్లతో జిల్లా అధికారులు సమర్పిస్తున్న నివేదికలు బుట్టదాఖలవుతున్నాయి.
ఉన్నత స్థాయి అధికారులతో కూడిన రెండు బృందాలు సంవత్సరానికి రెండు దఫాలుగా వచ్చి జిల్లాలో నెలకొన్న దారుణమైన కరువు పరిస్థితులు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైతులను పలకరిస్తూ, పంటల స్థితిగతులపై పరిశీలనాత్మక అధ్యయనం చేసి వెళుతున్నారు. ఏటా ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల నడుమ సాగు చేసిన 9 లక్షల హెక్టార్ల ఖరీఫ్ పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రైతులు దక్కించుకోలేక పోతున్నారు. సంవత్సరానికి జిల్లా రైతులు రూ.4 నుంచి రూ.5 వేల కోట్లు పంట ఉత్పత్తులు నష్టపోతూ ఆర్థికంగా పీకల్లోతుకు కూరుకుపోతున్న విషయం తెలిసిందే. జిల్లాలో విస్తరించిన 1.10 లక్షల హెక్టార్ల పండ్లతోటల రైతులదీ అదే పరిస్థితి.
భూగర్భజలాలు అడుగంటిపోవడంతో కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్లతోటలు నిలువునా ఎండుతున్నాయి. అకాల వర్షాలకు నేలవాలిపోతున్నాయి. లక్షలు వెచ్చించి కొత్తగా బోర్లు తవ్విస్తున్నా నూటికి ఒకట్రెండు బోర్లలో మాత్రమే నీళ్లు వస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాత్రం కంటితుడుపుగా ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్ కింద రైతుల చేతుల్లో చిల్లర పడేస్తున్నారు తప్పితే రైతు కుటుంబాలను గట్టెక్కించే ప్రయత్నాలు చేయడం లేదు. ప్రభుత్వం మాత్రం ఏటా అనంతపురం జిల్లాలో ఉన్న 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తున్నా ప్రయోజనం శూన్యం.
ఈ ఏడాది వర్షం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పంటలు సాగులోకి రాక, చేసిన అప్పులు తీర్చలేక, ఆర్థిక సమస్యలతో దిక్కుతోచని రైతులు బలవణ్మరణాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 85 మంది రైతులు అర్ధంతరంగా తనవు చాలించారు. ఈ క్రమంలో షరామూమూలు అన్నట్లుగా మరో కేంద్ర బృందం సోమవారం జిల్లా పర్యటనకు రానుంది. కేంద్ర కరువు, విపత్తు నివారణ కమిషనర్ రాఘవేంద్ర సింగ్, కేంద్ర హార్టికల్చర్ డెరైక్టర్ అతుల్‌పాట్నే, రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ ఉషారాణితో పాటు మరికొందరు అధికారుల బృందం పెనుకొండ, చెన్నేకొత్తపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తుండటంతో జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది.
కాలగర్భంలోకి కమిటీ సిఫారసులు
భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ సారథ్యంలోని 18 మంది నిపుణులతో కూడిన ‘హైపవర్ టెక్నికల్ కమిటీ’ 2012 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రెండు దఫాలు జిల్లాలో విసృ్తతంగా పర్యటించింది. డాక్టర్ అయ్యప్పన్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు రూ.7,676 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ప్రాజెక్టు అనంత’ అనే కరువు నివారణ పథకాన్ని అనతికాలంలోనే కాలగర్భంలోకి కలిపేశారు. 2013 ఏప్రిల్ 18న ఎఫ్‌సీఐ రాష్ట్ర జనరల్ మేనేజర్ కళ్యాణచక్రవరి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారుల బృందం చిలమత్తూరు, లేపాక్షి, గోరంట్ల, ఓడీసీ, కదిరి మండలాల్లో పర్యటించింది.
తక్షణసాయం కోసం జిల్లా అధికారుల బృందం రూ.1,065 కోట్లు కావాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేసింది. 2013 డిసెంబర్‌లో కేంద్రానికి చెందిన కమిషన్ ఫర్ సెంట్రల్ క్రాప్స్ అండ్ ప్రైసెస్ కమిషనర్ అశోక్‌గులాటే బృందం జిల్లాలో పర్యటించి పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరల గురించి ఆరాతీసింది. 2014 ఏప్రిల్ 22, 23 తేదీల్లో ‘ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం’ పేరుతో మరోసారి కేంద్ర బృందం జిల్లా పర్యటన చేసింది. కదిరి, ముదిగుబ్బ, అనంతపురం, ఆత్మకూరు, కళ్యాణదుర్గం మండలాల్లో పర్యటించి కరువు పరిస్థితులను కళ్లారా చూసి చలించిపోయారు.
తక్షణం రూ.1,147.50 కోట్లు అవసరమని జిల్లా అధికారులు నివేదిక అందజేశారు. అనంతరం 2015 ఏప్రిల్ 1న కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ షకీల్‌అహ్మద్ నేతృత్వంలో మరో బృందం జిల్లాలో పర్యటించింది. వచ్చిన అధికారులు రెండు బృందాలుగా విడిపోయి హిందూపురం, ఓడీ చెరువు, అమడగూరు, పెనుకొండ, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో కరువు పరిస్థితులను చూశారు. జిల్లా యంత్రాంగం తరపున రూ.1,404 కోట్లు తక్షణసాయం కావాలని సమగ్ర నివేదిక అందజేశారు. ఇలా... ఏటా కేంద్ర బృందాలు రావడం, వచ్చిన అధికారులు కరువును తిలకించి చలించిపోవడం మినహా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో రైతులు దుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతున్నారు.