జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనుంది.
సాక్షి, గుంటూరు: జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనుంది. ఐదేళ్లపాటు అమల్లో ఉండే ఈ విధానంతో పరిశ్రమల ఏర్పాటు ఊపందుకునేలా చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా కొత్త పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇవ్వనున్నాయి. ఈ విషయమై పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు గుంటూరులోని లక్ష్మీపురం ఆహ్వానం ఫంక్షన్ హాల్‌లో సెమినార్ నిర్వహించనున్నారు.
ఈ సదస్సుకు జిల్లాకు చెందిన మంత్రులు, నగర పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్‌పర్సన్, జిల్లా కలెక్టర్‌తోపాటు ముఖ్య అధికారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న 40 రకాల పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులను ఆహ్వానించేందుకు పరిశ్రమల శాఖ సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా స్పిన్నింగ్, జిన్నింగ్, టుబాకో, సిమెంట్, మిరప, ఫార్మాస్యూటికల్స్, బియ్యం, దాల్, ప్లాస్టిక్, బంగారం వ్యాపారులను ఆహ్వానించనుంది. దీంతోపాటు అన్ని రెవెన్యూ డివిజన్లలో సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కోస్తా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకానున్న నేపథ్యంలో జిల్లాకు ప్రాధాన్యం లభించనుంది.
భూసేకరణే ప్రధాన సమస్య...
జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు భూసేకరణ ప్రధాన సమస్యగా మారనుంది. భూముల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. దీంతో వీలైనంతవరకు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మరోవైపు.. పల్నాడు ప్రాంతంలో పెద్ద పరిశ్రమలను స్థాపించేందుకు అనుకూల పరిస్థితులున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 7500 చిన్న పరిశ్రమలు ఉండగా వీటి ద్వారా 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు.
పెద్ద పరిశ్రమలు 85 ఉండగా 25 వేల మందికి ఉపాధి లభిస్తోంది. జిల్లాలో వీలైనన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా వినుకొండ సమీపంలోని వెంకుపాళెంలో 83 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం భూసేకరణ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ పారిశ్రామికవాడలో చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. వినుకొండ ప్రాంతంలో ఇప్పటికే రూ.150 కోట్ల వ్యయంతో రేడియం డె న్సిటీ ఫైబర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
భూములు కేటాయించినా
ఏర్పాటు కాని పరిశ్రమలు..
జిల్లాలో భూములు కేటారుుంచి ఏళ్లు గడిచినా కొన్ని పరిశ్రమలు ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. వీటిలో గుజరాత్ అంబుజా సిమెంట్, చెట్టినాటి సిమెంట్, మైహోమ్స్, విఘ్ణేశ్ సిమెంట్స్ తదితర పరిశ్రమలు ఉన్నారుు. నూతన పారిశ్రామిక విధానం అమలుతోనైనా ఈ పరిశ్రమల స్థాపనకు యాజమాన్యాలు చొరవ చూపుతాయో లేదో వేచి చూడాల్సిందే. కొత్త పాలసీ ప్రకటించాక ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు పలువురు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
అందరినీ ఆహ్వానిస్తున్నాం..
కొత్త పారిశ్రామిక పాలసీ నేపథ్యంలో జిల్లాలోని పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఈ నెల 16న సెమినార్ ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ వై.నాగసుందర్ చెప్పారు. ఈ సదస్సుకు పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులను, ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని వివరించారు.