నూతన పంథాలో బియ్యం మాఫియా
Published Fri, Jan 3 2014 3:38 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఏటీఅగ్రహారం (గుంటూరు)/ చేబ్రోలు, న్యూస్‌లైన్: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జిల్లాలో విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ రేషన్ బియ్యం అక్రమ రవా ణా మాఫియాకు సింహస్వప్నంగా మారారు. నూతన సంవత్సరంలో నూతన పంథా ఎన్నుకున్న బియ్యం మాఫీకు మళ్లీ చుక్కెదురైంది. రెండు మినీ పాలలారీల్లో మొత్తం రూ.1.60 లక్షలు విలువ చేసే 80 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తూ గురువారం పట్టుబడ్డారు. లారీడ్రైవర్లను అరెస్టుచేసి ఆరుగురిపై 6ఏ కేసు నమోదు చేసి లారీలను, బియ్యాన్ని సీజ్‌చేశారు. పట్టుబడిందిలా... ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన షేక్ బాషా, కర్లపాలెంకు చెందిన షేక్ హబీబ్, పొన్నూరుకు చెందిన బర్నబాస్‌లు ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుంటారు. బుధవారం రాత్రి చీరాల, పొన్నూరు ప్రాంతాల్లో సేకరించిన 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం బస్తాలను రెండు మినీ పాలవాహనాల్లో తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు, చేబ్రోలు రెవెన్యూ అధికారులు కలిసి నాడాకోడూరు వద్ద నిఘా ఉంచారు.
అటుగా వస్తున్న రెండు మినీ పాలవాహనాలను తనిఖీచేయగా, రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి వాటిని గుం టూరు విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. మినీ లారీ డ్రైవర్లు పఠాన్‌నాగూర్ ఖాన్, పఠాన్ కరీముల్లాలను అరెస్టుచేశారు. వీరితోపాటు షేక్ బాషా, షేక్ హబీబ్, బర్నబాస్, లారీ యజమాని షేక్ ఖాదర్‌వలిలపై 6ఏ కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో హాజరు పరిచారు. చాకచక్యంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ సీఐ కె.వంశీధర్, హెడ్‌కానిస్టేబుల్ రాంబాబులను విజిలెన్స్ ఎస్పీ అభినందించారు. ఎలా వచ్చినా వదలం.. బియ్యం అక్రమ రవాణా మాఫియా ఏ ముసుగులో వచ్చినా పట్టేస్తామని విజి లెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి విలేకరులకు తెలిపారు. గూడ్స్ ఆటోలు, గూడ్స్ మినీ వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇకపై నిఘాను ఉధృతం చేస్తామని వివరించారు. ప్రజలు ఎలాంటి సమాచారం ఉన్నా తెలియజేసి సహకరించాలని కోరారు.
Advertisement
Advertisement