ఉపాధి కూలీలకు బ్యాంకుల ద్వారా నగదు చెల్లింపు
Published Tue, Aug 30 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
ఏలూరు సిటీ : జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డ్ కలిగిన ప్రతి వ్యవసాయ కూలికి బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఎంపీడీవోలను ఆదేశించారు. సోమవారం ఈ–ఆఫీస్, బయోమెట్రిక్ హాజరు, మీ కోసం అర్జీల పరిష్కారం, గ్యాస్ కనెక్షన్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఫామ్‌పాండ్స్, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం, ప్రజాసాధికార సర్వే తదితర అంశాలపై మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని రైతు కూలీలకు అక్టోబర్ 1 తేదీ నుంచి వేతనాలను బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూగర్భ జలాలు అడుగంటిన జిల్లాల్లో రాష్ట్రంలోనే మన జిల్లా ప్ర«థమస్థానంలో ఉందని, ఇది చాలా విచారించదగిన విషయమన్నారు.
ఈ–ఆఫీస్‌లో 5 వేల ఫైల్స్ మైలురాయి దాటితే రివార్డు
జిల్లాలో ఈ –ఆఫీస్ కార్యక్రమంలో 5 వేల ఫైల్స్ మైలురాయిని దాటిన మొదటి తహసీల్దార్‌కు తన సొంత సొమ్ము రూ. వెయ్యి రివార్డుగా కలెక్టర్ భాస్కర్ ప్రకటించారు. ఇంతవరకు నల్లజర్ల తహసీల్దార్ 4937ఫైల్స్‌తో మొదటిస్థానంలో, పాలకొల్లు తహసీల్దార్ 4858 ఫైల్స్‌తో ద్వితీయస్థానంలో ఉన్నారని తెలిపారు. జేసీ పులిపాటి కోటేశ్వరరావు, డీఆర్వో కె.ప్రభాకరరావు, డీఆర్‌డీఏ పీడీ పి.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో డి.సత్యనారాయణ, డీపీవో సుధాకర్ పాల్గొన్నారు.
Advertisement