ఇన్ఫోసిస్‌లో 20 శాతం వరకు వేతన పెంపు | Infosys Rolls Out Salary Revision Letters with 5 to 20 percentage Hikes | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌లో 20 శాతం వరకు వేతన పెంపు

Published Wed, Feb 26 2025 11:54 AM | Last Updated on Wed, Feb 26 2025 1:14 PM

Infosys Rolls Out Salary Revision Letters with 5 to 20 percentage Hikes

భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఇటీవల ఉద్యోగులకు వేతన సవరణలను ప్రకటించింది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా 5% నుంచి 20% వరకు ఇంక్రిమెంట్లను అందిస్తూ కంపెనీ వేతన పెంపు లేఖలను విడుదల చేసింది. ఉద్యోగులను మూడు విధాలుగా వర్గీకరించి ఈ పెంపును వర్తింపజేసినట్లు కంపెనీ తెలిపింది.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం సంస్థ అంచనాలను చేరుకున్నవారికి 5-7 శాతం పెంపు, ప్రశంసనీయమైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 7-10 శాతం పెంపు, పనిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 10 నుంచి 20 శాతం వేతనాలు పెంచినట్లు తెలిపింది. అయితే  గరిష్ఠంగా వేతనాల పెంపు అందుకున్నవారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఇదిలాఉండగా ‘అవసరాల మెరుగుదల(నీడ్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌)’ కేటగిరీలోని ఉద్యోగులకు ఎలాంటి పెంపు లభించలేదు.

పెంపు అమలు తేదీలు

సవరించిన వేతనాలు జాబ్ లెవల్ 5 (టీమ్ లీడర్ల వరకు), జాబ్ లెవల్ 6 (మేనేజర్ల నుంచి వైస్ ప్రెసిడెంట్ల కంటే తక్కువ స్థాయి వరకు)లోని ఉద్యోగులకు వర్తిస్తాయి. లెవల్‌ 5లోని ఉద్యోగులు జనవరి 1 నుంచి పెరిగిన వేతన పరిధిలోకి వస్తారని కంపెనీ తెలిపింది. లెవల్‌ 6లోని ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొంది.

ఇదీ చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. విజేతగా ముఖేష్‌ అంబానీ!

ఉద్యోగుల స్పందన

తాజా వేతన పెంపుపై ఇన్ఫోసిస్ ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కంపెనీ బలమైన ఆర్థిక పనితీరు దృష్ట్యా భారీ వేతన పెంపును ఆశించి కొందరు నిరాశకు గురైనట్లు తెలుపుతున్నారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం 11.4 శాతం పెరిగి 800 మిలియన్ డాలర్లకు, ఆదాయం 7.6 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఊహించిన దానికంటే తక్కువ వేతన పెంపు ఉన్నప్పటికీ ఇన్ఫోసిస్ ఆర్థికంగా మంచి పనితీరును కొనసాగిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement