నోట్ల రద్దు: కేంద్రం మరో కీలక నిర్ణయం
ఇక చెక్కులు లేదా బ్యాంకుల ద్వారానే జీతాల చెల్లింపు
కీలక ఆర్డినెన్స్ జారీచేసిన కేంద్రం
న్యూఢిల్లీ: నోట్ల రద్దు కష్టాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు బ్యాంకులు లేదా చెక్కుల ద్వారా నేరుగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు వీలుగా వేతనాల చెల్లింపు చట్టం-1936లో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీచేసింది.
పలు పరిశ్రమలు తమ ఉద్యోగులకు జీతాలు నేరుగా బ్యాంకులు లేదా, చెక్కుల ద్వారా చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి వేతనాల చెల్లింపు (సవరణ) బిల్లు -2016ను ఈ నెల 15న లోక్‌సభలో ప్రవేశపెట్టిందని, వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇది ఆమోదం పొందే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ రెండు నెలలు ఆగడం వల్ల ఉద్యోగులకు జీతాలు పొందడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశముండటంతో ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని ఆ వర్గాలు చెప్పాయి. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ప్రభుత్వం అత్యవసర విషయాల్లో ఆర్డినెన్స్‌లు జారీచేసి.. వాటిని ఆరునెలల్లోపు పార్లమెంటులో ఆమోదింపజేసే విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ పద్ధతిలో నేరుగా ఉద్యోగుల ఖాతాలకు జీతాలు బదిలీ చేయడం లేదా చెక్కు ద్వారా జీతాలు అందించేందుకు వీలుగా వేతనాల చెల్లింపు చట్టంలోని సెక్షన్ 6లో ప్రభుత్వం సవరణలు తీసుకువస్తున్నది.