అడిగిన వారందరికీ జాబ్‌కార్డులు | Job Cards For All in Employement Scheme West Godavari | Sakshi
Sakshi News home page

అడిగిన వారందరికీ జాబ్‌కార్డులు

Published Wed, May 20 2020 12:46 PM | Last Updated on Wed, May 20 2020 12:46 PM

Job Cards For All in Employement Scheme West Godavari - Sakshi

అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముత్యాలరాజు

ఏలూరు (మెట్రో): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా అడిగిన వారందరికీ జాబ్‌కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన  సమీక్షించారు. జాబ్‌కార్డులు కావాల్సిన వారు గ్రామ సచివాలయంలో ఆధార్‌కార్డు జిరాక్స్‌ జతపర్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉపాధి కూలీలు పనిచేసే ప్రాంతాల్లో వసతులు కల్పించాలని అధికారులకు చెప్పారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 600 కోట్ల పనులు ఈ సంవత్సరంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

ఖరీఫ్‌ సీజన్‌కు సిద్ధం కావాలి : ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించేందుకు సిద్ధంకావాలని కలెక్టర్‌ ముత్యాలరాజు అధికారులకు సూచించారు. ఈ నెల 30న జిల్లాలో 938 రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జిల్లాలో నాడు– నేడు మొదటి విడత కింద 1148 పాఠశాలల్లో వివిధ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని వెల్లడించారు. సమావేశంలో జేసీలు కె.వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ఎన్‌. తేజ్‌భరత్‌ పాల్గొన్నారు. 

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం ఆరా  
కోవిడ్‌–19, ఈ ఏడాది అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, రైతుభరోసా కేంద్రాలు, సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్, నాడు– నేడు పనులు, ఇళ్ల పట్టాల పంపిణీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్పరెన్స్‌ నిర్వహించారు. జిల్లా ప్రగతిపై ఆరా తీశారు. ఈ కాన్పరెన్స్‌లో కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు, ఎస్పీ నవదీప్‌సింగ్‌గ్రేవల్, జేసీలు కె.వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ఎన్‌.తేజ్‌భరత్‌ పాల్గొన్నారు. 

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 31 వరకూ గడువు
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఈ నెలాఖరు వరకు గడువు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు  తెలిపారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణను సెక్షన్‌ 22 (2) ఏపీ రైట్స్‌ చట్టం ప్రకారం చేపడతామని పేర్కొన్నారు. పేద రైతులకు చివరి అవకాశంగా 2020 మే 31ని గడువుగా ప్రభుత్వం ప్రకటించిందని, ఈ అవకాశాన్ని జిల్లాలోని సాదాబైనామాల రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.  క్రమబద్దీకరణ కోసం ఫారం–10 నమూనాలో తహసీల్దార్‌కు మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు నకలు, కొన్న రిజిస్టర్‌ కాని క్రయ దస్తావేజు నకలు, భూమి కొనుగోలు, సాగులో ఉన్నట్టు పత్రాలను జత చేయాలని పేర్కొన్నారు. ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్, పట్టాదార్‌ పాస్‌ బుక్స్‌ యాక్ట్‌ 1971 రూల్స్‌ 1989 అనుసరించి జిల్లా యంత్రాంగం అమలుకు ఉత్తర్వులు జారీ చేశామని కలెక్టర్‌ తెలిపారు.  సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమికి పట్టా చేయించుకోనట్లయితే ఆ భూమిపై హక్కు పత్రాలు పొందడానికి అవకాశం ఉండదని వెల్లడించారు.  భూమిపై హక్కుకు రుజువుగా ఉండే పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్‌డీడ్‌ పొందాలంటే సాదాబైనామా విక్రయాన్ని క్రమబద్దీకరించుకుని ఫారం 13 (బీ) సర్టిఫికెట్‌ పొందాలని పేర్కొన్నారు. బ్యాంకు రుణం కావాలన్నా, ఎరువులు, క్రిమి సంహారక  మందులు, ప్రభుత్వం ఇచ్చే పంట నష్టం పరిహారం, ఇన్సూరెన్స్‌ ద్వారా పంట నష్టపరిహారం కావాలన్నా, భూతగాదాలు వచ్చినప్పుడు హక్కును రుజువు చేసుకోవాలన్నా పాసు పుస్తకం టైటిల్‌ డీడ్‌ అవసరమని తెలిపారు. సాదాబైనామా క్రమబద్దీకరణపై ఆర్డీఓలు విస్తృత ప్రచారం చేయించాలని, గ్రామాల్లో టాంటాం వేయించాలని  సూచించారు.  

లాక్‌డౌన్‌ నిబంధనలపై సమీ„ý.
జిల్లాలో జ్యూవెలరీ, దుస్తులు, చెప్పుల షాపులు తెరిచేందుకు అనుమతి లేదని కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు. మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు, పోలీసు అధికారులతో లాక్‌డౌన్‌ నిబంధనలపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించరాదని పేర్కొన్నారు. ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ మాట్లాడుతూ జిల్లా సరిహద్దు వద్దే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించాలని  పోలీసు అధికారులకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కె.వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ఎన్‌. తేజ్‌భరత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement