పోస్ట్‌మాస్టర్‌ చేతివాటం | Post Master Stolen Deposit Money | Sakshi
Sakshi News home page

పోస్ట్‌మాస్టర్‌ చేతివాటం

Published Thu, Apr 12 2018 11:43 AM | Last Updated on Thu, Apr 12 2018 11:43 AM

Post Master Stolen Deposit Money - Sakshi

రుద్రారం బ్రాంచ్‌ పోస్టాఫీసు ఎదుట ఆందోళనకు దిగిన ఖాతాదారులు

మిరుదొడ్డి(దుబ్బాక): నమ్మకానికి మారుపేరుగా నిలిచే పోస్టాఫీసులో బ్రాంచి పోస్టుమాస్టర్‌ చేతివాటం చూపిన వైనం మండల పరిధిలోని రుద్రారం ఫోస్టాఫీసులో బుధవారం వెలుగులోకి వచ్చింది. గత 31 నెలలుగా పోస్టాఫీసులో జమ చేసిన డిపాజిట్‌ డబ్బులను సబ్‌ పోస్టాఫీసు అకౌంట్‌కు చూపకుండా పోస్టుమాస్టర్‌ లత రూ.లక్షల్లో స్వాహా చేసినట్లు  ఖాతాదారులు లబోదిబో మంటున్నారు. బ్రాంచి పోస్టాఫీసు ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్‌ జిల్లా నిజాంపేట సబ్‌ ఫోస్ట్‌ ఆఫీస్‌ కింద మండల పరిధిలోని రుద్రారం బ్రాంచ్‌ పోస్టాఫీసులో 47 సుకన్య సంవృద్ధి అకౌంట్లు, 76 రికరింగ్‌ డిపాజిట్లు, సేవింగ్‌ బ్యాంక్, గ్రామీణ రూరల్‌ తపాలా జీవిత బీమా వంటి లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పోస్టుమాస్టర్‌ లత తీసుకుంటున్న డిపాజిట్లల్లో అనుమానాలు తలెత్తుతున్నట్లు గమనించిన కొందరు ఖాతాదారులు నిజాంపేట సబ్‌పోస్టాఫీసులో వాకబు చేశారు.

తమ ఖాతా బుక్కుల్లో గత 31 నెలలుగా డిపాజిట్‌ చేస్తున్నప్పటికి సబ్‌ ఫోస్టాఫీసులో కేవలం రూ.4 వేలు మాత్రమే జమ అయినట్లు ఆన్‌లైన్‌లో చూపెట్టడంతో ఖాతాదారులు అవాక్కయ్యారు. దీంతో రుద్రారం బ్రాంచ్‌ ఫోస్టాఫీసులో జరుగుతున్న తతంగంపై మెదక్‌ సబ్‌ డివిజనల్‌ పోస్టల్‌ ఇన్స్‌పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న సబ్‌ డివిజనల్‌ పోస్టల్‌ ఇన్స్‌పెక్టర్‌ నికిత్, మేయిల్‌ పర్సన్‌ కరుణాకర్‌ బుధవారం రుద్రారం పోస్టాఫీసును ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పోస్టాఫీసులోని లావాదేవీలపై విచారణ చేపట్టారు. రికార్డుల పరిశీలనలో బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ లత ఖాతాదారుల పాసుబుక్కుల్లో డబ్బులు జమచేసిన అనంతరం సబ్‌పోస్టాఫీసుకు రోజువారి అకౌంట్‌ చూపకుండా డబ్బులు స్వాహాచేసినట్లు పోస్టల్‌ అధికారులు నిర్ధారణకు వచ్చారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్రాంచ్‌ పోస్టాఫీసుకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.

ఖతాదారులకు న్యాయం చేస్తాం..
రుద్రారం బ్రాంచ్‌ పోస్టాఫీసులో జరిగిన సొమ్ము స్వాహాపై ఖాతాదారులు ఆందోళన చెందవద్దని మెదక్‌ సబ్‌ డివిజనల్‌ పోస్టల్‌ ఇన్స్‌పెక్టర్‌ అంకిత్‌ అన్నారు. ఖతాదారుల పాసుబుక్కులను, రికార్డులను పూర్తిగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎంత సొమ్ము స్వాహా అయ్యిందో విచారిస్తున్నామని తెలిపారు. నష్టపోయిన ఖతాదారులకు బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ నుంచి సొమ్మును రికవరీ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఖాతాదారులు శాంతించారు. అవకతవకలకు పాల్పడిన బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.    – మెదక్‌ సబ్‌ డివిజనల్‌ పోస్టల్‌ ఇన్స్‌పెక్టర్‌ అంకిత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement