Gudipati Venkatachalam
-
అదే నీకు సరిపడే కవిత
టాగూర్ గీతాంజలిని అనువదించి, దానికి రాసిన ముందుమాటలో కవిత్వాన్ని ఎట్లా దర్శించాలో చలం పంచుకున్న అభిప్రాయం ఇక్కడ: గొప్ప ఆర్టు, ముఖ్యం కవిత్వం వినోదం కాదు. అనుభవం. మానవుడి హృదయానికి విశాలత్వాన్నిచ్చి, ఉన్నత పరివర్తనం కలగచెయ్యాలని ప్రయత్నిస్తుంది. గీతాంజలి కొంతవరకైనా అర్థం కావాలంటే కవిత్వరసాన్ని హృదయానుభవంగా తీసుకోగల సంస్కారం వుండాలి. గీతాంజలి సంపూర్ణంగా అర్థం కావాలన్నా, అనుభవంలోకి రావాలన్నా, ఈశ్వరుడిలో విశ్వాసం ఉండాలి. మానవుడికి ఈశ్వరుడితో ప్రత్యక్ష సంబంధం Personal Relation ఉండడానికి వీలు వుంటుందని అంగీకరించుకోవాలి. కాకపోతే ఈ గీతాలు మొహమ్మొత్తే కూని రాగాలు. వుత్త చర్విత చరణాలు. గొప్ప కవిత్వం ప్రధాన లక్షణ మేమిటంటే, ఎవరి తాహతుని బట్టి వారికి ఏదో కొంత అనుభూతిని అందించగలగడం. కొంత స్పష్టంగా తెలుస్తుంది. జయదేవుడి అష్టపదులు, కృష్ణశాస్త్రి గీతాలు, మాటల అర్థంతో ఎంత చెపుతాయో, ధ్వనితో, సంగీతంతో, భాషామాధుర్యంతో అంతకన్నా ఎక్కువ చెపుతాయి. గీతాంజలి బెంగాలీ పాటల సంగతి అదే చెపుతారు. అవి పాడగా విన్నవారికి అవి పూర్తిగా తెలీక పోవొచ్చు. కాని వాటి గానం, శబ్దలాలిత్యం, పదాల ధ్వని విన్యాసం, ఇవన్నీ శ్రవణాన్ని, మనసుని ఆకర్షించి, మనసును దాటి ఎక్కడో అంతఃకరణంలో ఆత్మలో మాధుర్యాన్నీ తేజస్సునీ నింపుతాయి. ఆ శ్రోత అంతరాంతరంలో ఏం మార్పు జరుగుతుందో అతని మనసుకే తెలీదు. ఈ రహస్యం గుర్తించక పోవడం వల్లనే, ఈనాడు తిండికీ, వొంటికీ, మనసు పై పొరల ఆహ్లాదాలకీ ఉపయోగపడని కళ, కళ కాకుండా పోతోంది. లోకం ఇంత విడిపోయింది. గొప్ప కవిత్వ సృష్టిగాని, అనుభవం గాని మనసు వెనక ఎంతో లోతునవుండే Sublime or Supernal Planeలో జరుగుతుంది. మనసుకు తెలిసేది స్వల్పం. గీతాంజలి అంతరార్థం చలానికేం తెలుసు? టాగూరు కెంతమాత్రం తెలుసు? ‘‘నీ పాటల అర్థాలన్నీ చెప్పమని అడుగుతారు. ఏం చెప్పాలో నాకు తెలీదు. ఏమో, వాటి అర్థమేమిటో ఎవరికి తెలుసు? అంటాను!’’ అంటారు టాగూర్. తన Emotional అనుభవానికి రూపకల్పన చేస్తాడు కవి. తమ విరహాన్ని, నిరాశని, విశ్వాసాన్ని, భయాన్ని ఎన్నోవిధాల పాడారు, ్కట్చ ఝటరాసిన భక్తులూ, మీరా, కబీర్, రామదాసు, త్యాగరాజు. అంత భక్త పరాధీనుడైన ప్రభువు తనెంత తపించినా దర్శనమివ్వడేమని త్యాగరాజు వ్యథ, ఆశ్చర్యం, భయం; దాని కంతకీ రూపమిచ్చి: ఖగరాజ నీ యానతి విని వేగ చనలేదో గగనానికి ఇలకు బహు దూరం బనినాడో కాకపోతే నువ్వెందుకు రావు? అని పాడతాడు కవి. ఆ విరహం నీ హృదయంలో ఏ కొద్దిగా మండినా, అతని తపనని నీకు అర్థం చెయ్యడానికి అతనిచ్చిన రూపకల్పన విష్ణూ, వాహనం గరుడుడూ నీకు అనుభవాన్నియ్యడానికి అభ్యంతరాలు కానక్కర్లేదు. కవి చెప్పేది నీకు పూర్తి అనుభవంలో వుంటే ఆ కవిత్వం నీకు అనవసరం. కవిత్వం చదివిన తరవాత కూడా నీ అనుభవానికి విషయం ఏ మాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృథా! నీకు తోచనిదీ కనపడనిదీ కవి చెప్పిన తరవాత నీ అనుభవంలోకి ఎంతో కొంత వొచ్చేదీ, అదే నీకు సరిపడే కవిత. -
గజల్ శ్రీనివాస్, మాధవి లత 'అనుష్టానం'
హైదరబాద్ : తన వినులవిందైన గజల్ గానంతో శ్రోతలను సమ్మోహితుల్ని చేసి... గజల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్న గాయకుడు గజల్ శ్రీనివాస్. గజల్ శ్రీనివాస్ హీరోగా అనుష్ఠానం చిత్రం తెరకెక్కుతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కానున్న ఆ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుపుకుంటుంది. గజల్ శ్రీనివాస్ సరసన మాధవి లత నటిస్తున్నారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న సున్నితమైన అంశాలే ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. 1950లో ప్రముఖ కవి గుడిపాటి వెంకటాచలం రచించిన 'అనుష్టానం' కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రానికి కృష్ణ వాసా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అనుష్టానానికి స్వరాలు కూడా దర్శకుడు కృష్ణ అందిస్తున్నారు. -
చిన్న మల్లెత్తు మాట
మే 19న గుడిపాటి వెంకటాచలం జయంతి శ్రీశ్రీని తూకం వెయ్యడం తేలిక. ప్రభుత్వ తూనికలు, కొలతల విభాగం వారు చక్కగా ప్రామాణీకరించి ఇచ్చిన కిలో, అర కిలో, పావు కిలో రాళ్లలా అందరి దగ్గరా ఒకే విధమైన రాళ్లు ఉంటాయి. అయినా సరే, శ్రీశ్రీని కొలిచే రాళ్లు తన దగ్గర లేవన్నాడు చలం. ఏమిటర్థం? తూనికలు, కొలతలకు అందని ఏ భార రహిత పర్వత శిఖరాలనో శ్రీశ్రీ కవిత్వంలో అధిరోహించి, అనుభూతి చెంది ఉండాలి చలం! చలాన్ని తూకం వెయ్యడం కష్టం. ఏం? రాళ్లు లేవా? ఉన్నాయి. అందరి దగ్గరా ఉన్నాయి. అయితే అవన్నీ ప్రభుత్వం వారు ముద్ర వేసి, జారీ చేసిన విధంగా ఒకే రకమైన రాళ్లు కాదు. చలం కోసమని ఎవరికి వారు సొంతంగా నూరి ఉంచుకున్న రాళ్లు. చలంపై విసరడానికి తప్ప, చలాన్ని తూచడానికి పనికి రాని రాళ్లు! అందుకే చలాన్ని తూచే రాళ్లు ఈ తెలుగు నేలలో కనిపించవు. ఎలా మరి చలాన్ని దొరకపుచ్చుకోవడం! రాళ్లే కావాలా? పూలు లేవా? అలాగని తక్కెడలో పువ్వేసుకుని వచ్చిన ప్రతి మనిషికీ చలం ‘టిల్ట్’ కాడు. చలాన్ని తూచేవారు సకలగుణ సంపన్నులై ఉండకూడదు! ‘‘ఆ వింత మృగం సృష్టిలో ఉండడానికి వీల్లేదు’’ అంటాడు సకలగుణ సంపన్నత గురించి చలం. స్త్రీ సౌందర్యానికీ, స్త్రీ ఔన్నత్యానికీ మోకరిల్లని జన్మ అసలు మగజన్మే కాదంటాడు చలం... ఎన్ని సుగుణాలు, ఎంత అధికారం ఉన్నవాడినైనా. చలానికి ఎండాకాలాలు ఇష్టం. ఆ కాలాల్లో వీచీ వీయని మధ్యాహ్నపు సోమరి గాలులు అతడిలో స్త్రీల గురించిన ఆలోచనల దుమారం రేపుతాయి. ఆ కాలాల్లో పూసే మల్లెపూలు అతడిని తన దగ్గరలేని అనేకమంది స్త్రీలలో ఏకకాలంలో వివశుడిని చేస్తాయి. చలం మల్లెపూలు గుచ్చుతాడు. మల్లెమాల మెడలో వేసుకుంటాడు. ఎవరైనా ఇస్తే మల్లెమొగ్గల్ని జేబులో వేసుకుంటాడు. మగువ లంటే పడి చచ్చిపోయినట్లే ఉంటుంది, మల్లెల కోసం అతడు పడే అరాటం. ‘‘... సాయంత్రాలు స్నేహానికి చల్లని శాంతినిచ్చే మల్లెపూలు; అర్ధరాత్రులు విచ్చి, జుట్టు పరిమళంతో కలిసి నిద్రలేపి, రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు; దేహాల మధ్య, చేతుల మధ్య నలిగి నశించిన పిచ్చి మల్లెపూలు; అలసి నిద్రించే రసికత్వానికి నవజీవనమిచ్చే ఉదయపు పూలు; రాత్రి సుందర స్వప్నానికి సాక్షులుగా అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు మల్లెపూలు’’ అంటాడు చలం.జీవితంలోని అతడి ధైర్యం కూడా ఈ పూలే! ‘‘ఎండా కాలపు దక్షిణ గాలి, తెల్లారకట్ట అలసట నిద్ర, లేవొద్దనే ప్రియురాలి గట్టి కౌగిలి, మల్లెపూల పరిమళం... అన్నీ ఒకటిగా కలిసి జ్ఞాపకం వస్తాయి... లోకం సారవిహీనమని అధైర్య పడినప్పుడల్లా’’ అంటాడు. స్త్రీ గా వికసించిన పసి సౌందర్యాన్ని పొందలేక చలం పడే యాతన, మల్లెమొగ్గను... అది తన ఎదలోనే విచ్చుకున్నా గమనించక నిర్లక్ష్యం చేసి ఆ తర్వాత అతడు పడే పశ్చాత్తాపం ఒకే తీవ్రతలో ఉంటాయి. ‘‘... నిన్న, చిన్నప్పుడు నేనెరిగిన పిల్ల పెద్దదై చూడ్డానికి వచ్చింది. వెళ్లేటప్పుడు లేచి నుంచుని వెనక్కి తిరిగేటప్పుడు ఆ నడుం నుంచి మెడ వరకు ఆమె చూపిన కదలిక ఏ మాటలు, ఏ గీతలు, ఏ రంగులు క్యాచ్ చెయ్యగలవు? అంత గొప్ప ఫ్లాష్‌ని చూపి నా కళ్లని చెద రకొట్టిందని ఆమెకే తెలీదు. అట్లాంటప్పుడు ఏం చెయ్యగలం? ఒకవేళ సిగ్గు, అభిమానం వదిలి ఆమెకి నా మీద ఉన్న కాన్ఫిడెన్సు భగ్నం చేసుకుని ఆ పిల్లని కావిలించుకుంటే చేతికి ఏమి అందుతుంది? లక్ష్మీబాయి పాడుతోంది. ఇప్పుడు ఆమెని కావిలించుకుంటే ఆ సంగీత మాధుర్యం నాకెంత దొరుకుతుందో, నిజమైన అందం కూడా అంతే దొరుకుతుంది’’ అని గట్టిగా గుండెను పట్టుకుంటాడు చలం. చిన్న పువ్వు కూడా అతడిని ఏడిపిస్తుంది. అంత లేబ్రాయపు శక్తిహీనుడు సౌందర్య ఆస్వాదనలో. ‘‘... ఒకరోజు ఒకరు నాకెంతో ఆప్యాయంగా ఇచ్చిన మల్లె మొగ్గని వదల్లేక, జేబులో వేసుకుని మరిచిపోయినాను. సాయంత్రం కాలవగట్టు దగ్గర మల్లెపూల వాసన వేసి చుట్టూ వెతికాను, తోట ఉందేమోనని. చివరికి నా జేబు అని గుర్తుపట్టి చూస్తే, తెల్లగా పెద్దదిగా విచ్చుకుని నా వేళ్లని పలకరించింది. నా జేబులో మరిచిపోయిన నా మల్లెమొగ్గ! కళ్లంబడి నీళ్లు తిరిగాయి’’ అని విలపిస్తాడు. చలం ధీరుడైన ‘మార్టిర్’. కానీ, బతికివున్నన్నాళ్లూ దుర్బలుడై స్త్రీ కాళ్లను చుట్టేసుకున్నాడు. స్త్రీకి ఏం కావాలో ప్రపంచానికి తెలియజెప్పాడు. స్త్రీలో తనకేం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేకపోయాడు. పూలలో స్త్రీలను చూసుకున్నాడు. మల్లెపూలలో మరీనూ. చలం పుట్టిందీ, పోయిందీ ఈ మల్లెల మాసంలోనే కావడం ప్రకృతి కారుణ్యమే అనుకోవాలి. ప్రకృతి అంటే స్త్రీ అని కూడా కదా!