'మహాత్మ' టైటిల్ పై మళ్లీ వివాదం!
అహ్మదాబాద్: భారత జాతిపిత గాంధీని ఉద్దేశించి నోబెల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ తొలిసారిగా 'మహాత్మ' అని సంబోధించారన్నది మనందరికీ తెలిసిన విషయం. దేశవ్యాప్తంగా ఉన్న పాఠ్యపుస్తకాల్లోనూ ఇదే ఉంటుంది. కానీ గుజరాత్ ప్రభుత్వం మాత్రం గాంధీకి 'మహాత్మ' బిరుదుని ఇచ్చింది టాగోర్ కాదు.. సౌరాష్ట్రలోని జెత్‌పూర్ పట్టణానికి చెందిన ఓ గుర్తు తెలియని విలేకరి అని పేర్కొంటున్నది.
రాజ్‌కోట్ రెవెన్యూ డిపార్ట్‌మెంటులో పోస్టుల భర్తీ కోసం జిల్లా పంచాయతీ శిక్షణ సమితి ఇటీవల పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో గాంధీకి 'మహాత్మ' బిరుదు ఎవరు ఇచ్చారన్న ప్రశ్నకు సంబంధించిన వివాదం గుజరాత్ హైకోర్టు ముందుకు వచ్చింది. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉండగానే.. ఆయనను జెత్‌పూర్‌కు చెందిన ఓ విలేకరి 'మహాత్మ' అని సంబోధిస్తూ లేఖ రాశారని, ఈ విషయాన్ని గాంధేయవాది నారాయణ్ దేశాయ్ తన పుస్తకంలో వెల్లడించారని పంచాయతీ శిక్షణ సమితి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే, ఆ జర్నలిస్టు పేరు తెలియదని వెల్లడించింది.
గాంధీకి 'మహాత్మ' అన్న బిరుదు టాగోర్ ఇచ్చారని మొదటి కీలో సమాధానంగా పేర్కొని.. ఫైనల్ 'కీ'లో గుర్తుతెలియని జర్నలిస్టు అని సమాధానంగా పేర్కొనడాన్ని తప్పబడుతూ.. ఈ పరీక్షకు హాజరైన సంధ్య మారు అనే అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం మూడు ప్రశ్నలకు సంబంధించి మొదటి 'కీ'లో సరైన సమాధానాలు ఇచ్చి.. ఫైనల్ కీలో దానిని మార్చారని ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.